Begin typing your search above and press return to search.

0-3తో స్వీప్ ముప్పు.. 35 మంది నెట్ బౌలర్లతో టీమ్ ఇండియా ప్రాక్టీస్

మన దేశంలో మన జట్టును స్వీప్ చేసే విదేశీ జట్టు లేదనేది ఇప్పటివరకు మనకు ఉన్న నమ్మకం.. కానీ, ఇప్పుడది ముప్పులో పడింది.

By:  Tupaki Desk   |   31 Oct 2024 9:20 AM GMT
0-3తో స్వీప్ ముప్పు.. 35 మంది నెట్ బౌలర్లతో టీమ్ ఇండియా ప్రాక్టీస్
X

ఆస్ట్రేలియాలో కాదు.. ఇంగ్లండ్ లో అంతకన్నా కాదు.. దక్షిణాఫ్రికాలో అసలే కాదు.. న్యూజిలాండ్ లో కానే కాదు.. ఇలాంటి పరిస్థితి భారత్ లో భారత్.. టెస్టు మ్యాచ్ లలో క్లీన్ స్వీప్ గురించి ఇదంతా. చేస్తే గీస్తే మనమే చేయాలి కానీ.. మన దేశంలో మన జట్టును స్వీప్ చేసే విదేశీ జట్టు లేదనేది ఇప్పటివరకు మనకు ఉన్న నమ్మకం.. కానీ, ఇప్పుడది ముప్పులో పడింది.

అనుకోకుండా ఓడడం కాదు..

అసలు ఒక్క మాటలో చెప్పాలంటే.. 20 రోజుల కిందటి వరకు న్యూజిలాండ్ జట్టుతో మనం టెస్టు సిరీస్ ఆడుతున్నాం అనే సంగతే చాలామంది అభిమానులకు తెలియదు. తీరా సిరీస్ మొదలయ్యే సమయానికి మూడు టెస్టుల సిరీస్ అంటే టీమ్ ఇండియాదే మొత్తం విజయం అనుకున్నాం. తీరా ఇప్పుడు చూస్తే టీమ్ ఇండియా 0-3తో ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే చరిత్రలోనే దారుణ పరాభవం కింద లెక్క. అయితే, ఇదంతా టీమ్ ఇండియా బ్యాటింగ్ వైఫల్యమే. బెంగళూరులో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ కావడం, ఆపై పుణెలో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ ఫెయిలవడంతో చరిత్రలో తొలిసారి న్యూజిలాండ్ కు స్వదేశంలో సిరీస్ ను కోల్పోయాం. నవంబరు 1 నుంచి ముంబై వాంఖడేలో మూడో టెస్టు జరగనుంది.

అసలే స్పిన్ పిచ్..

ఈ సిరీస్ లో న్యూజిలాండ్ స్పిన్నర్లు టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ ను కంగు తినిపించారు. దీంతో ముంబై టెస్టు కోసం జట్టు గట్టిగా సిద్ధం అవుతోంది. ప్రాక్టీస్ కు అందరూ తప్పక హాజరు కావాలని కోచ్ గంభీర్ ఆదేశించడం దగ్గరనుంచి.. ముంబై క్రికెట్‌ సంఘం మైదానంలో బ్యాట్స్ మెన్ శ్రమిస్తున్న తీరు వరకు దీనినే సూచిస్తోంది. కాగా, ముంబై వాంఖడే పిచ్ స్పిన్ కు బాగా అనుకూలం. న్యూజిలాండ్ స్పిన్నర్ల దూకుడు చూశాక టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ ప్రాక్టీస్‌ సెషన్‌ లో ఏకంగా 35 మంది నెట్‌ బౌలర్ల సేవలను వాడుకున్నట్లు సమాచారం.

35 మందిలో స్పిన్నర్లే అధికం.

నెట్ ప్రాక్టీస్ కు తీసుకున్న 35 మంది బౌలర్లలో ఎక్కువమంది స్పిన్నర్లే ఉన్నారట. వీరుకూడా ఎవరికి వారు భిన్నమైన యాక్షన్ ఉన్నవారని తెలిసింది. ఇలాంటి వారిని ఏరికోరి జట్టు మేనేజ్‌మెంట్‌ నెట్స్‌ కు రప్పించినట్లు సమాచారం. వీరందరినీ బ్యాటర్లు ఎక్కువసేపు ఎదుర్కొని సాధన చేశారు. కాగా, ముంబై పిచ్ తొలి రోజు నుంచే స్పిన్‌ కు అనుకూలంగా ఉండేలా తయారు చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.