Begin typing your search above and press return to search.

మన డబ్బు మనకే.. ఐపీఎల్ లో పంట పండిన భారత క్రికెటర్లు

ఆదివారం జెద్దాలో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Nov 2024 10:25 AM GMT
మన డబ్బు మనకే.. ఐపీఎల్ లో పంట పండిన భారత క్రికెటర్లు
X

నిరుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో ఆస్ట్రేలియాకు అప్పుడే వన్డే ప్రపంచ కప్ అందించిన పేస్ బౌలర్, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కు రూ.20 కోట్లు పెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ కాసేపటికే ఆసీస్ కే చెందిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కు రూ.25 కోట్ల వరకు వెచ్చించింది కోల్ కతా నైట్ రైడర్స్. దీంతో భారత ఆటగాళ్లకు అత్యధిక ధర దక్కదా? మన డబ్బు విదేశీయులకు పోవాల్సిందేనా? అనే ప్రశ్నలు వచ్చాయి. వాస్తవానికి అది మినీ వేలం. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, ఆ లోటును తీరుస్తూ మెగా వేలం వచ్చింది. భారత క్రికెటర్ల పంట పండింది.

భారతీయులకు కాసుల పంట

ఆదివారం జెద్దాలో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. టీమ్ ఇండియా మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను రూ.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. వెంకటేశ్ అయ్యర్ ను రూ.23.75 కోట్లకు కోల్ కతా, పేసర్ అర్షదీప్ సింగ్, స్పిన్నర్ చాహల్ ను రూ.18 కోట్లకు పంజాబ్ పాడుకుంది. అంటే.. రూ.51 కోట్లను ముగ్గురు ఆటగాళ్ల కోసమే వెచ్చించింది పంజాబ్.

కాస్త తక్కువైనా..

టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా ఓ వెలుగు వెలిగి, ఏడాది నుంచి జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్‌ ను సన్‌ రైజర్స్ హైదరాబాద్ రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది. కిషన్ ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోలేదు. గతంలో రూ.15 కోట్లకు పైగా పలికిన కిషన్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇక టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కు రూ.14 కోట్లు పెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. గత సీజన్ వరకు హైదరాబాద్ కు ఇడిన తమిళనాడు పేసర్ నటరాజన్‌ ను ఢిల్లీ రూ.10.75 కోట్లకు, రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన పేసర్ అవేశ్ ఖాన్‌ ను రూ.10.75 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.

కుర్రాళ్లకు కిక్

తొలి రోజు వేలంలో ముంబై ఇండియన్స్ అతి తక్కువగా నలుగురిని కొనుగోలు చేయగా.. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ దూకుడు కనబర్చాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ ఆచితూచి వ్యవహరించాయి.

గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటిన నెహాల్ వదేరాను రూ.4.20 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. అంగ్‌క్రిష్ రఘువంశీని రూ.3 కోట్లకు కోల్‌కతా, అభినవ్ మనోహర్‌ను రూ. 3.20 కోట్లకు సన్‌రైజర్స్, నమన్ ధిర్‌‌ ను రాజస్థాన్ రాయల్స్ రూ.5.25 కోట్లకు దక్కించుకున్నాయి. సన్‌ రైజర్స్ ఆటగాడు అబ్దుల్ సమద్‌ ను రూ.4.20 కోట్లకు లక్నో తీసుకుంది.