భలే చాన్సులే.. బంపర్ ఆఫరే.. ఐపీఎల్ లో కోట్లు కొట్టిన కుర్రాళ్లు
చడీచప్పుడు లేకుండా వేలంలోకి వచ్చేసి కోట్లు కొల్లగొట్టారు. వీరిలో చాలామంది ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయనివారే కావడం విశేషం.
By: Tupaki Desk | 27 Nov 2024 2:03 PM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ముగిసి మూడు రోజులవుతున్నా.. దాని తాలూకు వైబ్రేషన్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి.. అత్యధిక ధర దక్కిన ఆటగాళ్లెవరు..? కనీస ధరకూ అమ్ముడుపోని వారెవరు..? విదేశీయుల్లో ఎవరికి ఎక్కువ డబ్బు దక్కింది..? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు.. స్పీడ్ స్టర్ గా పేరుగాంచిన నవదీప్ సైనీ, యువ సంచలనంగా పేరు తెచ్చుకున్న పృథ్వీ షా.. వంటివారిని ఏ ఫ్రాంచైజీ కూడా పట్టించుకోలేదు. అయితే, కొందరు కుర్రాళ్లు మాత్రం లక్కీ చాన్స్ కొట్టేశారు. చడీచప్పుడు లేకుండా వేలంలోకి వచ్చేసి కోట్లు కొల్లగొట్టారు. వీరిలో చాలామంది ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయనివారే కావడం విశేషం.
వచ్చేశాడు మరో రషీద్
మిస్టరీ స్పిన్నర్లంటే అఫ్ఘానిస్థానే. ఒక రషీద్ ఖాన్, ముజిబుర్ రెహ్మాన్, నూర్ అహ్మద్. వీరి సరసన చేరాడు అల్లా గజన్ ఫర్. ఇతడి వయసు కేవలం 18 మాత్రమే. బంగ్లాదేశ్ పై వన్డేలో 6 వికెట్లు తీశాడు. ఐపీఎల్ వేలంలో తొలిసారి పేరు నమోదు చేసుకున్న వెంటనే రూ.4.8 కోట్లు పలికాడు. గట్టి పోటీ మధ్య ముంబై ఇండియన్స్ పాడుకుంది. రషీద్ ఖాన్ లాగానే ఇతడూ రాణిస్తాడేమో చూడాలి.
ఆరుకు ఆరు సిక్సర్లు.. ఆర్య
అప్పట్లో రవిశాస్త్రి, మధ్యలో యువరాజ్ సింగ్, ఇటీవల రుతురాజ్ (7) ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టిన మొనగాళ్లు. ఇలాంటిది అరుదైన ఫీట్. ఢిల్లీ ప్రిమియర్ లీగ్ లో దీనిని సాధించాడు ప్రియాంశ్ ఆర్య. దీంతో ఆర్య పేరు భారత క్రికెట్లో మార్మోగింది. లీగ్ లో ఇంకొన్ని మ్యాచ్ లలోనూ మెరిశాడు. హార్డ్ హిట్టర్లకు బాగా డిమాండ్ ఉండే ఐపీఎల్ లో ఆర్య కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. పంజాబ్ కింగ్స్ రూ.3.8 కోట్లు పెట్టి కొనుక్కుంది.
హైదరాబాద్ కు మలింగ
తన వైవిధ్యమైన బౌలింగ్ తో ప్రపంచ క్రికెట్ పై బలమైన ముద్ర వేసిన బౌలర్ మలింగ. ఐపీఎల్ ఆల్ టైం గ్రేట్ లలోనూ ఒకడు. ముంబైకి చాలాకాలం పెట్టని కోటలా నిలిచాడు. ఇప్పుడు అదే పేరుతో మరో ప్రతిభాంతుడైన పేసర్ శ్రీలంక నుంచి వచ్చాడు. అతడే ఇషాన్ మలింగ. కానీ.. లసిత్ తరహా బౌలింగ్ యాక్షన్ కాదు. వేగంలో మాత్రం అతడితో పోటీ పడతాడు. అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఇషాన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.1.2 కోట్లు పెట్టి తీసుకుంది. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్ దీని వెనుక కీలకపాత్ర పోషించాడు.
చెన్నైకు సింగ్
పంజాబీ మూలాలున్నప్టపికీ రంజీల్లో తమిళనాడుకు ఆడుతున్నాడు గుర్జన్ ప్రీత్ సింగ్. చెన్నైలో ఉండే గుర్జన్ పొడగరి. ఫాస్ట్ బౌలర్ అయిన గుర్జన్.. తమిళనాడు ప్రిమియర్ లీగ్ లో దిండిగల్ జట్టు ఈ ఏడాది విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్షదీప్ సింగ్ తరహాలోనే ఎత్తు, మంచి వేగంతో ఎడమచేతి వాటం పేసర్ అయిన గుర్జన్ కోసం వేలంలో డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ కు నెట్ బౌలర్ గా ఉన్న అతడిని చెన్నైనే రూ.2.2 కోట్లకు సొంతం చేసుకుంది.
కశ్మీర్ పేస్ ఇప్పటికే కశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మలిక్ కు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తాడని పేరొచ్చింది. కానీ, అతడు అంతర్జాతీయ క్రికెట్ లో నిలవలేకపోయాడు. కానీ, కశ్మీర్ నుంచే ఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు రసిక్ సలాం. అయితే, ఆలస్యంగా బరిలో దించింది. 18 ఏళ్ల రసిక్.. ఎమర్జింగ్ ఆటగాళ్ల ఆసియా కప్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించాడు. ఐదేళ్ల కిందట ఏజ్ ఫ్రాడ్ తో రసిక్ రెండేళ్ల నిషేధానికి గురయ్యాడు. అలాంటి స్థితి నుంచి ఈ ఏడాది వేలంలో రూ.6 కోట్లకు బెంగళూరు కొనుక్కునే స్థితికి వెళ్లింది. రసిక్.. త్వరలో టీమ్ ఇండియాకు ఎంపికవుతాడని భావిస్తున్నారు.
పంజాబ్ కింగ్స్ అంటే.. పేలవ ఫ్రాంచైజీ. ఒక్కసారీ టైటిల్ కొట్టలేదు. కనీసం పోటీ ఇచ్చేది గానూ నిలవలేదు. అలాంటి పంజాబ్ తరఫున ఈ ఏడాది శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ అదరగొట్టారు. ఓ మ్యాచ్ లో 61 పరుగుల ఆశుతోష్ మెరుపు ఇన్నింగ్స్ లీగ్ కే హైలైట్ గా నిలిచింది. 11 మ్యాచ్ లలో 167 స్ట్రైక్ రేట్‌తో 189 పరుగులు చేసిన ఆశుతోష్ ను ఐపీఎల్ వేలంలో రూ.3.8 కోట్లకు ఢిల్లీ తీసుకుంది.