టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ 'లీకు వీరుడు' అతడే?
సర్ఫరాజ్ పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో హర్భజన్ స్పందించాడు.
By: Tupaki Desk | 17 Jan 2025 1:30 PM GMTగెలుస్తూ పోతున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది.. ఓటములు ఎదురైనప్పుడే లోపాలు బయటపడతాయి.. టీమ్ ఇండియాలొ ప్రస్తుతం ఇదే జరుగుతోంది. జట్టు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న సమయంలో.. అసలు ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం సరిగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్నిటికీ మించి జట్టు గురించి బయటకు తెలియకూడనివి బయటకు వచ్చాయి. ఆటగాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు వీటి ద్వారా స్పష్టమైంది.
బయటకు చెప్పిందెవరు?
కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి. అలాంటిది వేర్వేరు ప్రాంతాల నుంచి ఒకచోటకు చేరి జట్టుగా ఆడే ఆటగాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు అత్యంత సహజం. అయితే, వీటిని ఆట వరకే చూడాలి. అంతకుమించి వ్యక్తిగతంగా తీసుకోకూడదు. జట్టు కూర్పు, టీమ్ మేనేజ్ మెంట్ వ్యూహాలు, మైదానంలో వ్యవహరించే తీరు వీటిని బయటకు చెప్పడం నైతికంగా కూడా ఓ ఆటగాడికి సరికాదు. అయితే, ఇటీవలి కాలంలో టీమ్ ఇండియా విషయాలు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాయి. దీంతో వీటిని బయట పెట్టింది ఎవరు? అనే ప్రశ్నలు వచ్చాయి.
హర్భజన్ చెప్పినట్లు అతడేనా?
టీమ్ ఇండియాకు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్య వహించి, మ్యాచ్ విన్నర్ గా పేరు తెచ్చుకున్న ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెబుతున్నదాని ప్రకారం టీమ్ ఇండియా విషయాలను బయట పెట్టింది యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ అని తెలుస్తోంది.
ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు పొక్కాయి. సర్ఫరాజ్ కారణంగానే అవి లీక్ అయినట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సర్ఫరాజ్ పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో హర్భజన్ స్పందించాడు. సర్ఫరాజ్ పై వస్తోన్న ఆరోపణలు నిజమని చెప్పలేమని.. అలా జరిగితే మాత్రం అది పెద్ద తప్పేనిని.. కుర్రాడు కాబట్టి అతడితో గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించాడు. 2005-06 మధ్య గ్రెగ్ ఛాపెల్ కోచ్ గా ఉన్నప్పుడూ ఇలాగే డ్రెస్సింగ్ రూమ్ నుంచి లీక్ లు వచ్చేవని హర్భజన్ తెలిపాడు.
డ్రెస్సింగ్ రూమ్ విషయాలు సర్ఫరాజ్ లీక్ చేశాడని కోచ్ గంభీరే చెప్పినట్లు ప్రచారంలో ఉంది. అయితే, ఇవన్నీ ఊహాగానాలే. వాస్తవం ఏమిటో తెలియదు. సర్ఫరాజ్ కుర్రాడు. తండ్రి ఎంతో కష్టపడి అతడిని క్రికెటర్ గా తీర్చిదిద్దాడు. ఒకవేళ పొరపాటున తప్పు చేసి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలి. పద్ధతి కాదని చెప్పాలి. మంచి భవిష్యత్ ఉన్న అతడిని శిక్షించడం మాత్రం సరికాదు.