Begin typing your search above and press return to search.

పారిస్ ఖర్చు రూ.72 కోట్లు.. పతకాలు.. ‘సున్నా’.. భారత ‘బ్యాడ్’మింటన్

పారిస్ కు 117 మంది భారత క్రీడాకారులు వెళ్లారు. పోటీల అనంతరం క్రీడా పండితులు బ్యాడ్మింటన్ కు డి గ్రేడ్ ఇవ్వడం గమనార్హం.

By:  Tupaki Desk   |   13 Aug 2024 8:15 AM GMT
పారిస్ ఖర్చు రూ.72 కోట్లు.. పతకాలు.. ‘సున్నా’.. భారత ‘బ్యాడ్’మింటన్
X

పారిస్ కు 117 మంది భారత క్రీడాకారులు వెళ్లారు. పోటీల అనంతరం క్రీడా పండితులు బ్యాడ్మింటన్ కు డి గ్రేడ్ ఇవ్వడం గమనార్హం. అథ్లెటిక్స్ కు ఎఫ్ గ్రేడ్ ఇచ్చారు. హాకీకి ‘ఎ’ గ్రేడ్, నీరజ్ చోప్రా అసమాన ప్రతిభతో రజతం దక్కిన జావెలిన్ త్రోలో ఏ+ గ్రేడ్ కేటాయించారు. అయితే, పతకాలు వచ్చి ఉంటే వీటన్నిటిలో బ్యాడ్మింటన్ కు ఏ+ గ్రేడ్ దక్కాల్సింది. కానీ.. ’డి’కి పడిపోయింది.

గత మూడు ఒలింపిక్స్ లో మూడు పతకాలు.. అందులో ఒకటి రజతం.. మొత్తమ్మీద ఈ పన్నెండు ఏళ్లలో వసతులు, క్రీడాకారులు, ప్రభుత్వాల ప్రోత్సాహకాలు చాలా మెరుగయ్యాయి. కొత్తకొత్త వారు పుట్టుకొచ్చారు. పాతవారు మరింత రాటుదేలారు. కానీ, ఈసారి ఒక్క పతకమూ రాలేదు. కచ్చితంగా రెండు మెడల్స్ వస్తాయనుకుంటే.. ఉత్త చేతులతో వెనుదిరగారు. తెలుగు తేజం పీవీ సింధు, ప్రణయ్, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అందరూ నిరాశపరిచారు. లక్ష్య సేన్ ఒక్కడే అద్భుతంగా ఆడాడు. సెమీస్ తొలి సెట్ లో అతడి దూకుడు చూస్తే ఈ సారీ పతకం ఖాయం అనిపించింది. కానీ, ఆ తర్వాత అలసిపోయి చేతులెత్తేశాడు.

లండన్, రియో, టోక్యో హిట్.. పారిస్ తుస్

సైనా (2012- లండన్), సింధు (2016- రియో, 2021- టోక్యో) దూకుడుతో ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ భళా అనిపించింది. సైనా దూరమైనా ఈసారి సింధు బరిలో ఉండడంతో ఆశలు మిగిలాయి. ఆమె కూడా స్థాయికి తగ్గట్లు ఆడితే మిగతావారిలో ఒకరైనా అసాధారణ ప్రతిభ చూపితే కనీసం రెండు పతకాలు అయినా బ్యాడ్మింటన్ అందిస్తుందని అంచనా వేసుకున్నారు. మరీ ముఖ్యంగా సింగిల్స్‌ లో హెచ్‌ఎస్‌ ప్రణయ్, లక్ష్యసేన్‌ సూపర్ ఫామ్, డబుల్స్ లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ ఆశలు రేపింది.

ఖర్చు మోపెడు.. పతకాలు జాడే లేదు

గత రెండు ఒలింపిక్స్ లో వచ్చిన ఫలితాలను చూసి కేంద్ర ప్రభుత్వం బ్యాడ్మింటన్ పై ఈసారి భారీగా ఖర్చుచేసింది. పారిస్ ఒలింపిక్స్ కోసం రూ.470 కోట్లు కేటాయిస్తే అందురూ రూ.72 కోట్లు బ్యాడ్మింటన్ కే కావడం గమనార్హం. అథ్లెటిక్స్ (రూ.96 కోట్లు) తర్వాత ఈ క్రీడాంశానికే ఎక్కువ నిధులు అధికంగా కేటాయించడం పరిశీలించాల్సిన అంశం.

సింధుకే రూ.3 కోట్లు..

హ్యాట్రిక్ మెడల్ తెస్తుందన్న ఆశతో పీవీ సింధు శిక్షణకే రూ.3.13 కోట్లు ఖర్చు పెట్టారట. అయితే, పెద్దగా ఫామ్ లో లేని ఆమె ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఓడిపోయింది. ఇక 2022 కామన్ వెల్త్, నిరుటి ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌ షిప్‌ లలో గోల్డ్మెడల్స్ సాధించిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీ ఈ ఏడాది నాలుగు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. భారీ అంచనాలతో ఒలింపిక్స్ కు వెళ్లిన వీరు.. క్వార్టర్స్ లో వెనుదిరిగారు. ఈ జోడీ కోసం ప్రభుత్వం రూ.5.62 కోట్లు, ప్రణయ్‌ (రూ.1.8 కోట్లు), మహిళల డబుల్స్‌ అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో కోసం (రూ.1.5 కోట్లు) కేటాయించింది. కానీ, వీరంతా ఉత్త చేతులతోనే వచ్చేశారు.

వచ్చే ఒలింపిక్స్ లోనూ డౌటే..

2028లో లాస్ ఏంజెలిస్ లో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇప్పటికే సింధు ఫామ్ తగ్గింది. నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఏమిటో చెప్పలేం. ఇప్పుడున్నవారిలో చాలామంది లాస్ ఏంజెలిస్ కు వెళ్తారని చెప్పలేం. సింధు, ప్రణయ్ లకు ఫిట్‌ నెస్‌ సమస్యలున్నాయి. అయితే, లక్ష్య సేన్, సాత్విక్‌-చిరాగ్‌ మాత్రం ఆశలు రేపుతున్నారు. వీరు ఏం చేస్తారో చూడాలి.