Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి కాంస్యాన్ని సాధించిన హాకీ కుర్రాళ్లు

మన హాకీ ఆటగాళ్ల అద్భుత ఆటతో పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   9 Aug 2024 4:41 AM GMT
ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి కాంస్యాన్ని సాధించిన హాకీ కుర్రాళ్లు
X

మన హాకీ ఆటగాళ్ల అద్భుత ఆటతో పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి పతకం స్పెష్ ఏమంటే.. టోక్యో ఒలింపిక్స్ లోనూ కాంస్యాన్ని సొంతం చేసుకొని.. వరుసగా రెండు ఒలింపిక్స్ లోనూ కాంస్యాన్ని సాధించిన ఘనతను సొంతం చేసుకుంది. మొత్తానికి వినేశ్ ఇష్యూలో వేదనకు గురైన భారతీయులకు కాస్తంత ఊరటనిచ్చేలా భారత హాకీ టీం అద్భుత ఆట తీరును ప్రదర్శించింది.

దాదాపు 52 ఏళ్ల తర్వాత భారత హాకీ టీం వరుస ఒలింపిక్స్ లో పతకాల్ని సొంతం చేసున్న సందర్భంగా దీన్ని చెప్పాలి. 1952 - 1972 మధ్య ఒలింపిక్ మెడల్ పోడియంపై నిలిచిన భారత జట్టు ఆ తర్వాత ఎప్పుడూ కూడా వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాల్ని గెలుచుకున్న సందర్భమే లేదు. ఈసారి మాత్రం ఆ లోటును భర్తీ చేసి.. ఆనందాన్నిచ్చింది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. టోక్యో ఒలింపిక్స్ లో తన అద్భుత ఆటతో పతకాన్ని సాధించిన పెట్టిన గోల్ కీపర్.. పారిస్ ఒలింపిక్స్ లోనూ తన ఆటలో మేజిక్ ప్రదర్శించి.. పతకం సొంతమయ్యేలా చేశాడు. కాంస్యాన్ని సాధించిన ఆనందంలో ఉన్న జట్టు సహచరులకు.. అభిమానులకు తన రిటైర్మెంట్ షాకిచ్చాడు. కాకుంటే.. ఈ మ్యాచ్ తర్వాత తాను అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలుకుతానని ముందే ప్రకటించాడు. చెప్పినట్లే చేసినప్పటికీ.. అతడి నిర్ణయం కాస్తంత నిరాశకు గురి చేసింది. అయితే.. వరుసగా రెండోసారి కాంస్యాన్ని సొంతం చేసుకోవటం మాత్రం భారతీయులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు.

సెమీస్ లో అనూహ్యంగా ఓటమి పాలైన భారత జట్టు.. తాజా పోరులో స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో విజయాన్ని సాధించటం ద్వారా కాంస్యాన్ని సొంతం చేసుకుంది. భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించగా.. స్పెయిన్ తరఫున మార్క్ మిరాల్స్ ఒక గోల్ కొట్టాడు. తాజా ఫలితంతో పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం సొంతమైంది. 1980 తర్వాత ఒలింపిక్స్ లో హాకీలో పతకాన్ని సాధించలేదు.

41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్ లో కాంస్యాన్ని సొంతం చేసుకోగా.. తాజా ఒలింపిక్స్ లోనూ అదే పతకాన్ని సొంతం చేసుకుంది. అటు అటాకింగ్ లోనూ.. ఇటు డిఫెన్స్ లోనూ జట్టు తన సత్తా చాటింది. సస్పెన్షన్ కారణంగా ముందు మ్యాచ్ ఆడని డిఫెండర్ అమిత్ ఈ మ్యాచ్ లో తిరిగి రావటం జట్టు బలాన్ని పెంచింది. మ్యాచ్ తొలి క్వార్టర్ లో ఇరు జట్లు సమఉజ్జీలుగా పోరాడటంతో గోల్ నమోదు కాలేదు.

మొదటి గోల్ స్పెయిన్ ఆట 18వ నిమిషంలో చేయగా.. ఆట 30వ నిమిషంలో భారత్ ఒక గోల్ సాధించి.. స్కోర్ సమం చేసింది. అనంతరం మరో మూడు నిమిషాల వ్యవధిలోనే మరో గోల్ ను సాధించి అధిక్యతను ప్రదర్శించింది. ఆ తర్వాత మళ్లీ ఇరుజట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో 2-1 తేడాతో కాంస్య పతకం భారత హాకీ జట్టు సొంతమైంది. నిజానికి మ్యాచ్ మొదలైన ఆరో నిమిషంలో సుఖ్ జీత్ కు గోల్ కొట్టే ఛాన్స్ దక్కినా.. అతను కొట్టిన షాట్ పోస్టుకు దూరంగా వెళ్లింది. దీంతో.. మొదటి గోల్ ఆట మొదటి క్వార్టర్ లో దక్కే అవకాశం మిస్ అయ్యింది.

రెండో క్వార్టర్ లో స్పెయిన్ తన గొల్ ను కొట్టి అధిక్యతను ప్రదర్శించింది. రెండో క్వార్టర్ మరో 21 సెకన్లలో ముగుస్తుందన్న సందర్భంలో పెనాల్టీలో భారత్ గోల్ సాధించటం ద్వారా స్కోర్ ను సమం చేసింది. తర్వాత మరో గోల్ సాధించింది. ఆ తర్వాత నుంచి తన అధిక్యతను నిలుపుకోవటం కోసం జట్టు తీవ్రంగా శ్రమించింది. ఆట ముగిసేందుకు ముందు మూడు నిమిషాల పాటు స్పెయిన్ క్రీడాకారులు స్కోర్ ను సమం చేసేందుకు పలు ప్రయత్నాలు చేసినా.. గోల్ పోస్టులో గోడలా మారిన గోల్ కీపర్ పుణ్యమా అని గోల్ కాకుండా ఆగింది.

ఆట మొత్తంలో ఆరు పెనాల్టీ కార్నర్ లు భారత జట్టుకు లభిస్తే.. అందులో రెండింటిని గోల్ గా మార్చుకుంది. అదే సమయంలో స్పెయిన్ జట్టుకు మొత్తం 9పెనాల్టీలు లభించినా.. వాటిలో ఆ జట్టు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. దీనికి కారణం గోల్ కీపర్ అద్భత ఆటే. గ్రేట్ వాల్ ఆఫ్ భారత్ శ్రీజేశ్ ఆటతీరుతో.. అతను భారత పతక కలను సొంతం చేశాడు. ఈ మ్యాచ్ లో అంతర్జాతీయ హాకీకి ఘనంగా వీడ్కోలు పలికాడు.

ఇదిలా ఉంటే..పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్నిసొంతం చేసుకున్న భారత హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి ఆటగాడికి రూ.15 లక్షలు.. సహాయక సిబ్బందికి రూ.7.5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లుగా హాకీ ఇండియా వెల్లడించింది. ఇిలా ఉంటే.. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో నెదర్లాండ్స్ పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైన్ లో జర్మనీ జట్టుపై 3-1 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.