రెజ్లింగ్ సమాఖ్య పై వేటు.. భారత క్రీడా రంగానికి షాక్
ఆ తర్వాత కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను తాత్కాలిక కమిటీకి అప్పగించింది. 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ కు ఎన్నికలు నిర్వహించాలని కోరింది.
By: Tupaki Desk | 24 Aug 2023 12:07 PM GMTఇప్పటివరకు సంక్షోభం అంచున ఉన్న దేశం పైనో..? ఆర్థికంగా పతనమైన దేశం పైనో..? అకారణంగా యుద్ధానికి దిగిన దేశం పైనో విధించిన నిషేధం.. ఇప్పుడు భారత్ కు ఎదురైంది. మైదానం నుంచి అంతరిక్షం వరకు దూసుకెళ్తున్న మన దేశానికి షాక్ తగిలింది. దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న రెజ్లింగ్ సమాఖ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. ఏకంగా ఇప్పుడు అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొనాల్సి వచ్చింది.
అనూహ్య నిర్ణయం..దేశాల క్రీడా సంఘాల్లో రాజకీయాలను ప్రపంచ సమాఖ్యలు సహించవు. అలాగే నిర్ణీత కాలంలోగా సంఘాలకు ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఎన్నుకోకున్నా ఊరుకోవు. అంతేకాదు.. జాత్యంహకార ధోరణులు కనిపించినా భరించవు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ జట్టుగా ఎదుగుతున్న దక్షిణాఫ్రికా ఇలానే 22 ఏళ్ల పాటు నిషేధం ఎదుర్కొంది. అయితే, అదెప్పుడో 1970ల్లో తీసుకున్న నిర్ణయం. కాగా, ఇప్పుడు భారత్ కు రెజ్లింగ్ విభాగంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ప్రకటించింది.
ఎన్నికల్లేవు.. అందుకే బహిష్కరణ భారత్ వంటి పెద్ద దేశాన్ని.. అందులోనూ వివిధ పోటీల్లో భారీగా పతకాలు కొల్లగొడుతున్న రెజ్లింగ్ క్రీడలో నిషేధం విధించడం సంచలన నిర్ణయమే. అయితే, దీనికి సహేతుక కారణమే ఉంది. రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైనందుకే ఈ నిర్ణయం తప్పలేదు.
మనవాళ్లిక తటస్థ రెజ్లర్లేనా? భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం సాంకేతికం.. ఇక పోటీల పరంగా చూస్తే మన రెజ్లర్లు వచ్చే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించలేరు. అంటే మన రెజ్లర్లే అయినా.. పేరు మాత్రం భారత్ కాదు. గమనార్హం ఏమంటే సెప్టెంబరు 16 నుంచి ప్రపంచ ఛాంపియన్ షిప్ మొదలుకానుంది. అంటే సరిగ్గా 25 రోజుల సమయం. అందులో భారత రెజ్లర్లు 'తటస్థ అథ్లెట్లు'గానే బరిలో దిగాల్సి ఉంటుంది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు నిర్ణయం బుధవారం తీసుకున్నా.. నేడు (గురువారం) బయటకు వచ్చింది. దీనిని భారత ఒలింపిక్ అసోసియేషన్ ధ్రువకీరించింది.
ఇక్కడ వచ్చింది సమస్య...భారత రెజ్లింగ్ సమాఖ్యకు మొన్నటి వరకు బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అధ్యక్షుడు. అయితే, మహిళా రెజ్లర్లపై వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయన తప్పుకొన్నారు. అంతేకాక మహిళా రెజ్లర్లు కొన్ని రోజుల పాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. తాము సాధించిన పతకాలను గంగా నదిలో కలిపే ప్రయత్నమూ చేశారు. చివరకు కేంద్ర ప్రభుత్వ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే మహిళా రెజ్లర్ల ఆరోపణలతో భారత సమాఖ్య ప్యానెల్ ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం రద్దు చేసింది. ఆ తర్వాత కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను తాత్కాలిక కమిటీకి అప్పగించింది. 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ కు ఎన్నికలు నిర్వహించాలని కోరింది.
ఏప్రిల్ 28న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ స్పందిస్తూ.. గడువులోగా ఎన్నికలు పూర్తిచేయాలని, లేదంటే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించింది. పలు కారణాలతో ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరిసారిగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా.. దానికి ఒక రోజు ముందు పంజాబ్ -హరియాణా హైకోర్టు సమాఖ్య ఎన్నికలపై స్టే విధించింది. దీంతో మరోసారి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రపంచ రెజ్లింగ్ సంఘం.. భారత సభ్యత్వంపై వేటు వేసింది.