'లక్ష కోట్ల' లీగ్.. ఫుట్ బాల్ కాదు క్రికెట్ లో.. మనదే
ప్రపంచ క్రికెట్ పై 15 ఏళ్లుగా భారత బోర్డుదే పెత్తనం. కాదూ కూడదు అంటే.. సొంతంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను తయారు చేసేలా ఉంది బీసీసీఐ
By: Tupaki Desk | 14 Dec 2023 9:30 AM GMTకొన్నిసార్లు ఓటమి మంచి చేస్తుందనుకోవాలేమో..? మరికొన్ని వైఫల్యమే మనల్ని మేటిగా నిలుపుతుందేమో..? భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పుడు ఇంత బలంగా తయారైందంటే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మనకు తలొంచింది అంటే.. కేవలం అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కారణంగానే. అంతకుముందు ఐసీసీపై ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలదే ఆధిపత్యం.. వారేం చెబితే అదే రూల్.. ద్వైపాక్షిక సిరీస్ లు.. ఐసీసీ టోర్నీలు.. కొత్త నిబంధనలు.. ఆటగాళ్ల విషయంలో నిర్ణయాలు.. ఇలా ఏ విషయంలోనైనా సరే. కానీ, ఇప్పుడలా నడవడం లేదు.
ఇండియాను కాదని ఇంచు కూడా..
ప్రపంచ క్రికెట్ పై 15 ఏళ్లుగా భారత బోర్డుదే పెత్తనం. కాదూ కూడదు అంటే.. సొంతంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను తయారు చేసేలా ఉంది బీసీసీఐ. మరోవైపు భారత బోర్డు ఇంతలా బలోపేతం కావడానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). 2007 వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు లీగ్ దశలోనే పరాజయం పాలవడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అదే సమయంలో బీసీసీఐకి పోటీగా పుట్టుకొచ్చింది.. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్). భారత దేశ క్రికెట్ పునాదులనే కదిలించేలా ఉన్న ఈ లీగ్ ను చూసి బీసీసీఐ ఉలిక్కిపడింది. అప్పటికప్పుడు ఐపీఎల్ ను సిద్ధం చేసింది.
అలా పడిన బీజం..
సరిగ్గా 16 ఏళ్ల కిందట.. అంటే 2007 చివర్లో అలా పడిన ఐపీఎల్ బీజం ఇప్పుడు ఆకామంత ఎత్తయిన చెట్టుగా ఎదిగింది. వివాదాలు ఎన్ని వచ్చినా.. 16 సీజన్లుగా నిరాటంకంగా సాగుతూ వస్తోంది. ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. 10 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను దాటి డెకాకార్న్ హోదాను దక్కించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ విలువ 10.7 బిలియన్ డాలర్లు (రూ.83,353 కోట్లు).
2008 నుంచి 433 శాతం.. ఏడాదిలోనే 28 శాతం జంప్..
2022లో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 8.4 బిలియన్ డాలర్లు. కానీ, ఇప్పుడు 10.7 బి.డాలర్లు దాటింది. ఏడాదిలోనే 28 శాతం పెరిగింది. ఇక ఐపీఎల్ ఆరంభమైన 2008తో పోలిస్తే ఏకంగా 433 శాతం వృద్ధి ఉంది. బ్రాండ్ విలువను లెక్కగట్టే సంస్థ బ్రాండ్ ఫినాన్స్ రివీల్స్ ఈ నివేదికను వెల్లడించింది. మీడియా హక్కుల కింద 6.2 బిలియన్ డాలర్లు (రూ.48,390 కోట్లు) రావడం, రెండు ఫ్రాంఛైజీలు కొత్తగా చేరడం, కొవిడ్ తర్వాత స్టేడియాలు పూర్తిగా నిండటం తదితర కారణాలతో బ్రాండ్ విలువ పెరిగిందని నివేదిక పేర్కొంది. ఇక ఫ్రాంఛైజీల విషయానికి వస్తే ముంబయి ఇండియన్స్ 87 మిలియన్ డాలర్లు (సుమారు రూ.725 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ 81 మిలియన్ డాలర్లు (రూ.675 కోట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ 78.6 మిలియన్ డాలర్లు (రూ.655 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 69.8 మిలియన్ డాలర్లు (రూ.581 కోట్లు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.