Begin typing your search above and press return to search.

మన'మను'కున్నది జరగలేదు.. మూడో పతకం చేజారెను.. నిరాశే మిగిలెను..

By:  Tupaki Desk   |   3 Aug 2024 9:23 AM GMT
మనమనుకున్నది జరగలేదు.. మూడో పతకం చేజారెను.. నిరాశే మిగిలెను..
X

ఒక పతకం సాధిస్తే ఆశ్చర్యపోయాం.. రెండో పతకమూ తెస్తే మురిసిపోయాం.. మూడోదీ వస్తుందని ఆశపడ్డాం.. కానీ, అన్నిసార్లు మనం అనుకున్నదే జరగదు కదా...? మన 'మను'కున్నది ఒకటైతే జరిగింది ఇంకోటి.. పారిస్ ఒలింపిక్స్ లో భారత యువ యువ షూటర్ మను బాకర్‌ చరిత్రలో నిలిచిపోయే అవకాశం చేజారింది. అభిమానులకు నిరాశే మిగిలింది.

రెండు పతకాల రికార్డుతో..

పారిస్ ఒలింపిక్స్‌ లో హరియాణ బుల్లెట్ మను బాకర్.. మహిళల 10మీటర్లఎయిర్‌ పిస్టల్‌ లో, సరబ్‌ జ్యోత్‌ సింగ్‌ తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కాంస్యాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఒలింపిక్స్ లో భారత్ కు వచ్చిన పతకాలు ఈ రెండే. అయితే, వీటిలో మను పాత్ర ఉండడంతో ఆమె ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారతీయురాలుగా చరిత్ర నెలకొల్పింది. ఇదే క్రమంలో మూడో పతకమూ సాధించే అవకాశం దక్కింది. అది 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో కావడం.. అద్భుత ఫామ్ లో ఉండడం, ఆమెకు మంచి గురి ఉన్న అంశం కావడంతో మను మూడో పతకమూ తెస్తుందనే ఆశలు నెలకొన్నాయి.

గురి కొద్దిలో తప్పింది..

రెండు సార్లు కాంస్యం తెచ్చిన మను బాకర్ గురి 25 మీటర్ల పిస్టల్ విభాగంలో త్రుటిలో తప్పింది. ఆమె నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం మధ్యాహ్నం 1గంటలకు జరిగిన ఫైనల్‌ లో స్టేజ్‌ వన్‌ ను మను నిదానంగా మొదలుపెట్టింది. సిరీస్‌ 1లో కేవలం 2 షాట్లను మాత్రమే కొట్టింది. అనంతరం మెరుగైన ప్రదర్శన చేసింది. సిరీస్‌ 2లో 4, సిరీస్‌ 3లో 4 షాట్లు కొట్టి ముందంజ వేసింది. ఇదే జోరు సిరీస్‌ 6 వరకు కొనసాగించింది. దీంతో రెండో స్థానానికి చేరుకుంది. కానీ.. ఇక్కడే ప్రత్యర్థి షూటర్లు మరింత రాణించారు. ఎలిమినేషన్‌ చివర్లో సిరీస్‌ 8లో మను రెండు షాట్లను మాత్రమే కొట్టి వెనుకబడింది. హంగేరీ అథ్లెట్ వెరోనికా 3 షాట్లతో మూడో స్థానంలోకి దూసుకొచ్చి మనును వెనక్కునెట్టింది. కొరియాకు చెందిన యాంగ్‌ జిన్‌ స్వర్ణం.. ఫ్రాన్స్‌ షూటర్ కామెలీ రజతం సొంతం చేసుకున్నారు.