కొత్త కుస్తీ సంఘానికి చెల్లు.. అంతర్జాతీయంగా రద్దు ముప్పు?
భరత రెజ్లింగ్ సమాఖ్య రాజకీయాలు మరింత మలుపుతిరిగాయి. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్యానెల్ ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.
By: Tupaki Desk | 24 Dec 2023 11:07 AM GMTచేజేతులా చెడగొట్టు కోవడం అంటే ఇదే.. ఒలింపిక్స్ పతకాలు తెచ్చే బంగారు బాతులాంటి ఆటలో రాజకీయాలు వేలుపెడితే ఏం జరుగుతుందో..? ఒక వ్యక్తి మోనోపలీని అడ్డుకోకుంటే ఏం జరుగుతుందో చాటే ఉదంతం ఇది. దాదాపు ఏడాది నుంచి క్రీడాకారుల ఆందోళనలు.. నిరసనలు.. క్రీడా సంఘం అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు.. ఇన్ని జరుగుతున్నా మళ్లీ పరోక్షంగా అతడి చేతుల్లోకే పగ్గాలు.. చివరకు కొత్త క్రీడా సంఘం రద్దు.. అసలు ఏం జరుగుతోంది..? చివరకు అంతర్జాతీయ పోటీల నుంచి బహిష్కరణ తప్పదా?
భరత రెజ్లింగ్ సమాఖ్య రాజకీయాలు మరింత మలుపుతిరిగాయి. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్యానెల్ ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. విధి విధానాలను అతిక్రమించడమే దీనికి కారణమని.. తమనుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొంది. అయితే, సమాఖ్య అధ్యక్షుడిగా గురువారం సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడు. అండర్-15, అండర్-20 జాతీయ పోటీలను ఉత్తర్‌ప్రదేశ్ గోండాలో నిర్వహించనున్నట్లు ప్రకటించాడు. రెజ్లర్లకు తగిన సమయం ఇవ్వకుండా ప్రకటన వెలువరించినందుకు కొత్త ప్యానెల్ ను సస్పెండ్ చేసినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ చెప్పడం గమనార్హం. అయితే, దీనివెనుక మాత్రం వేరే కథ ఉందని స్పష్టమవుతోంది.
భారత రెజ్లింగ్ సమాఖ్యకు కొన్ని నెలల కిందటి వరకు బ్రిజ్ భూషణ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అతడిపై స్టార్ రెజ్లర్లు తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేయడంతో పదవి నుంచి తప్పుకొన్నాడు. బ్రిజ్ భూషణ్ స్థానంలో అతడి అనుచరుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దీనిని తప్పుబడుతూ ఇకపై రెజ్లింగ్ రింగ్ లోకి దిగబోనని సాక్షిమాలిక్ ప్రకటించింది. బజరంగ్ పూనియా,
డెఫ్లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) పసిడి విజేత వీరేందర్ సింగ్ యాదవ్ కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని శనివారం ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పుడు కొత్త సమాఖ్యను రద్దు చేయడంపై రెజ్లర్లు, పలువురు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ‘‘క్రీడా మంత్రిత్వ శాఖ రెజ్లింగ్ ప్యానెల్ ను సస్పెండ్ చేసింది. ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రెజ్లర్లకు న్యాయం జరుగుతుందనే ఆశను కలిగించింది’’ అని గీతా ఫొగట్ ట్వీట్ చేశారు. ‘‘అమ్మాయిలు రెజ్లింగ్ కు దూరమయ్యేలా చేసిన, అబ్బాయిలు పద్మశ్రీని వెనక్కిచ్చేలా చేసిన రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేశారు. ఇదే ముందే చేసుండాల్సింది’’ అని బాక్సర్ విజేందర్ సింగ్ ట్వీట్ చేశాడు.
అసలు కథ ఇదీ..
కొత్త ప్యానెల్ ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేయడం వెనుక ఉద్దేశం వేరే ఉంది. స్టార్ అథ్లెట్లు ఎంత వ్యతిరేకించినా, బ్రిజ్ భూషణ్ వర్గమే సమాఖ్యలో కొలువుదీరడంతో వివాదం మరింత ముదిరేలా ఉంది. దీంతో ఎందుకైనా మంచిదని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు క్రీడల్లో రాజకీయాలను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఏమాత్రం సహించదు. తాజా పరిణామాలతో భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం విధించినా ఆశ్చర్యం లేదు.