భారత్ – పాక్ మ్యాచ్.. పాకిస్థాన్ ఫిర్యాదుపై ఐసీసీ స్పందన ఇదే
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ లో భారత్ ఎలాంటి పోటీ లేకుండా సులువుగా గెలుపొందింది.
By: Tupaki Desk | 18 Oct 2023 8:52 AM GMTప్రస్తుతం భారత్ లో వన్డే వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం పది జట్లు ఈ టోర్నమెంటులో పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు భారత్ తాను ఆడిన మూడు మ్యాచ్ ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది. భారత్ తన తర్వాత మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడునుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 19న పుణేలో జరగనుంది.
కాగా భారత్ తన మూడో మ్యాచ్ లో పాకిస్థాన్ పై విజయం సాధించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ లో భారత్ ఎలాంటి పోటీ లేకుండా సులువుగా గెలుపొందింది.
కాగా ఈ మ్యాచ్ నిర్వహణపై పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్ మిక్కీ అర్థర్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ను ఆయన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈవెంట్‌గా పేర్కొన్నారు. ఈ మ్యాచ్.. ఐసీసీ నిర్వహించినట్లుగా లేదని తీవ్ర విమర్శలు చేశారు. క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా భారత్ –పాక్ మ్యాచ్ సాగిందని మండిపడ్డారు. ఐసీసీ ఈవెంట్ లాగా కాకుండా రెండు దేశాల మధ్య జరిగిన ఓ ద్వైపాక్షిక సిరీస్ లా ఉందని హాట్ కామెంట్స్ చేశారు.
మ్యాచ్ కొనసాగుతున్న సమయంలోనూ, ఆ తర్వాత తమ దేశ జట్టు ఆటగాళ్లకు ఉత్సాహమివ్వడానికి 'దిల్ దిల్ పాకిస్తాన్' పాటను ప్లే చేయనివ్వలేదని మిక్కీ అర్థర్ ధ్వజమెత్తారు. ఈ విషయంలతో ఇతర దేశాల ఆటగాళ్లు, వారి అభిమానులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన బీసీసీఐ.. పాకిస్తాన్ తో మ్యాచ్ కు మాత్రం ఎక్కడ లేని ఆంక్షలు విధించిందని మిక్కీ అర్థర్ మండిపడ్డాడు.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ డైరెక్టర్ మిక్కీ అర్థర్ విమర్శలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పందించింది. ఆయన చేసిన ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తామని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్లే్క తెలిపారు. ప్రతి అర్థవంతమైన విమర్శలను తాము స్వీకరిస్తామని చెప్పారు. ఇలాంటి ఉదంతాలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ప్రతి ఈవెంట్ నిర్వహించేటప్పుడూ విమర్శలు, సూచనలు వస్తూనే ఉంటాయని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్లే్క తెలిపారు. వాటిని సమీక్షించి అవసరమైన సవరణలను చేస్తుంటామని చెప్పారు. మిక్కీ అర్థర్ తాజా విమర్శలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అయితే వాటిని విమర్శలుగా కాకుండా సద్విమర్శలుగానే తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐసీసీ రివ్యూ తరువాత అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.