ఇండియా – పాక్ మ్యాచ్ కు ప్రత్యేక ఏర్పాట్లు... ఏమిటీ “డ్రాప్ ఇన్ పిచ్”? /
అవును... ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ - 2023లో ఇండియా - పాక్ మ్యాచ్ హోరెత్తిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ అనంతరం జరిగిన రచ్చ కూడా హాట్ టాపిక్కే.
By: Tupaki Desk | 20 Jan 2024 4:09 AM GMTక్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇండియా విషయానికొస్తే.. ఇక్కడ అదొక రిలీజియన్ అని అంటారు! ఇక క్రికెట్ మ్యాచ్ లలో ఇండియా - పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ గురించి చెప్పే పనేలేదు. ఈ దాయాదీ పోరును ఈ రెండు దేశాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఈ క్రమంలో మరోసారి ఇండియా – పాక్ మ్యాచ్ జరగబోతోంది.. అందుకు అమెరికా వేదిక కాబోతుంది!
అవును... ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ - 2023లో ఇండియా - పాక్ మ్యాచ్ హోరెత్తిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ అనంతరం జరిగిన రచ్చ కూడా హాట్ టాపిక్కే. ఈ క్రమంలో మరో ఐదు నెలల్లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసే టీ20 ప్రపంచకప్ మొదలు కాబోతున్న నేపథ్యంలో... ఈ టోర్నీలో అందరి దృష్టినీ ఆకర్షించేది ఇండియా – పాక్ మ్యాచ్ అనడంలో సందేహం ఉండకపోవచ్చు.
ఈసారి జరగబోయే టీ-20 వరల్డ్ కప్ సంప్రదాయ క్రికెట్ దేశం కాని అమెరికాలోనూ జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ గ్రౌండ్స్ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ కు అంత సౌకర్యవంతమైనవి కావని అంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి చోట ఇండియా – పాకిస్థాన్ లాంటి ప్రతిష్ఠాత్మక మ్యాచ్ నిర్వహిస్తే అనుకున్నంత మజా వస్తుందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీంతో... మరో దేశం నుంచి పిచ్‌ను తయారు చేయించి తెప్పించనుంది ఐసీసీ!
సంప్రదాయ క్రికెట్ దేశం కాని అమెరికాలోనూ ఈదఫా టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లూ జరగనున్న నేపథ్యంలో... భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక మ్యాచ్ కు అనువైన పిచ్ విషయంలో కంగారేమీ అక్కర్లేదని.. ఈ మ్యాచ్ కోసం మరో దేశం నుంచి పిచ్ ను తయారు చేయించి తెప్పిస్తున్నామని అంటుంది ఐసీసీ. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతుంది.
ఏమిటీ డ్రాప్ ఇన్ పిచ్?:
సాధారణంగా సరైన పిచ్ తయారీకి అనువైన నేల లేని స్టేడియంలలో డ్రాప్ ఇన్ పిచ్ లను ఉపయోగిస్తుంటారు. ఇందులో భాగంగా... జూన్ 9న న్యూయార్క్ లోని నసావు మైదానంలో జరిగే ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఇలాంటి పిచ్ లనే ఉపయోగించాలని ఐసీసీ భావిస్తుంది. దీనికోసం ఈ పిచ్ ల తయారీలో ఎక్స్ పర్ట్ అయిన అడిలైడ్ ఓవల్ క్యురేటర్ డామియన్ హోతో ఒప్పందం చేసుకుంది.
ఇలాంటి పిచ్ ల తయారీ కోసం ట్రేలలో పిచ్ మిశ్రమాన్ని సిద్ధం చేసి కంటైనర్ల ద్వారా వాటిని ఇండియా – పాక్ మ్యాచ్ జరగబోయే న్యూయార్క్ కు రవాణా చేయబోతున్నారు. అనంతరం... మైదానంలో ఈ ట్రేలను అమర్చి.. క్వాలిటీ పిచ్ ను సిద్ధం చేస్తారు. వీటినే ద్రాప్ ఇన్ పిచ్ లు అని అంటారు. ఈదఫా ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ కోసమే కాకుండా.. మరి కొన్ని మ్యాచ్ లు ఈ డ్రాప్ ఇన్ పిచ్ ల మీదే జరగబోతున్నాయి.