భారత్ - పాక్ మ్యాచ్ టికెట్ రూ.386 అన్నా కొనే దిక్కులేదట
దాయాది పోరు అన్నంతనే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే వాతావరణం నెలకొంటుందన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 Sep 2023 6:34 AM GMTదాయాది పోరు అన్నంతనే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే వాతావరణం నెలకొంటుందన్న సంగతి తెలిసిందే. కీలక టోర్నీల్లో భాగంగా తప్పించి.. మిగిలిన సందర్భాల్లో ఈ రెండు దేశాల మధ్య పోటీలు జరుగుతున్నది లేదు. మిగిలిన క్రీడల సంగతి ఎలా ఉన్నా.. క్రికెట్ మ్యాచ్ లో మాత్రం రెండు దేశాలు తలపడుతున్నాయంటే చాలు మ్యాచ్ ఫలితం మీద ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ మ్యాచ్ ను టీవీల్లో చూసే వారి సంఖ్యకు కొదవ ఉండదు. ఇక.. మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు భారీ ఎత్తున క్యూ కడతారు.
అలాంటి అనుభనానికి భిన్నమైన అనుభవం తాజాగా శ్రీలంకలో చోటు చేసుకుంది. నాలుగళ్ల తర్వాత భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ శనివారం జరిగింది. ఆసియా కప్ లో భాగంగా గ్రూప్ ఏలో జట్లుగా ఉన్న రెందు దాయాది దేశాల మద్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ తుది ఫలితం తేలకుండానే రద్దు చేసిన నిర్వాహకులు.. చెరో పాయింట్ ఇచ్చారు. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 48.5 ఓవర్లలో 266 పరుగులకు అలౌట్ అయ్యింది. ఆ తర్వాత రెండున్నర గంటల పాటు కురిసిన వానతో మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. ఈ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ రెండు జట్లకు చెరో పాయింట్ ఇస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు పెద్దగా హాజరు కాకపోవటం విశేషంగా మారింది. సగం స్టేడియం ఖాళీగా ఉండటంతో కొత్త అనుభవంగా మారింది. అయితే.. ఈ మ్యాచ్ ను ఎట్టి పరిస్థితుల్లో వరుణుడు గండి కొడతారన్న విషయాన్ని నమ్మటం.. అందుకు తగ్గట్లే వర్షం పడటం తెలిసిందే. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అంచనాతో మ్యాచ్ టికెట్లను కొన్నది లేదు. మ్యాచ్ ముందు రోజైన శుక్రవారం సాయంత్రానికి కూడా టికెట్లు అమ్ముడు కాకపోవటంతో అప్పటివరకు ఉన్న టికెట్ల ధరల్ని భారీగా తగ్గించేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ టికెట్లు అమ్ముడు కాకపోవటం గమనార్హం.
శ్రీలంక కరెన్సీలో రూ.6426 మొత్తాన్ని కనీస టికెట్ ధరగా నిర్ణయించారు. దాన్ని మ్యాచ్ జరిగే శనివారానికి రూ.1500లకు తగ్గించారు. శ్రీలంక రూపాయిల్లో ఉన్న రూ.1500 మొత్తాన్ని భారత కరెన్సీలోకి మారిస్తే రూ.386 అవుతుంది. ఒక మల్టీఫ్లెక్సులో సినిమా టికెట్ ధర కంటే తక్కువ ఉన్నప్పటికీ.. వర్షం కారణంగా మ్యాచ్ కు దెబ్బ పడుతుందన్న ఉద్దేశంతో హాజరు కాలేదు. దీంతో.. స్టేడియం ఖాళీగా దర్శనమిచ్చింది. సాధారణంగా భారత్ - పాక్ మ్యాచ్ అన్నంతనే కిక్కిరిసిపోయే స్టేడియంకు భిన్నమైన సీన్ తాజా మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది.