Begin typing your search above and press return to search.

ఎనిమిదిన్నర నెలలకు తొలి వన్డే 9840 రోజులుగా సిరీస్ నెగ్గని లంక

ఆ తర్వాత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే టూర్ కు వెళ్లి 5 టి20లు ఆడింది.

By:  Tupaki Desk   |   2 Aug 2024 2:30 PM GMT
ఎనిమిదిన్నర నెలలకు తొలి వన్డే  9840 రోజులుగా సిరీస్ నెగ్గని లంక
X

వన్డే ప్రపంచ కప్ ముగిసింది.. టి20 ప్రపంచ కప్ కూడా అయిపోయింది.. మిగిలింది టెస్టు చాంపియన్ షిప్. దీనికి వచ్చే ఏడాది ఫైనల్ జరగనుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి ప్రధాన టోర్నీలు మిగిలాయి. అంటే దాదాపు మూడేళ్లు ప్రపంచ కప్ లు లేవన్నమాటే. గత ఏడాది భారత్ ఏకైక వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచిన రోహిత్ శర్మ టీమ్ ఫైనల్లో కంగారూల చేతిలో బోల్తాకొట్టింది. కానీ, ఆ పరాజయం నుంచి తొందరగానే తేరుకుని జూన్-జూలై లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే టూర్ కు వెళ్లి 5 టి20లు ఆడింది.

ప్రపంచ కప్ తర్వాత ఐపీఎల్

నిరుడు నవంబరు 19న వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత భారత్ అదే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడింది. అనంతరం ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తలపడింది. ఆపై రెండున్నర నెలలు ఐపీఎల్ ఆడింది. ఆ వెంటనే టి 20 ప్రపంచ కప్ నకు వెళ్లింది. ఈ మొత్తం క్రమాన్ని గమనిస్తే భారత్ చివరిగా వన్డే ఆడింది ప్రపంచ కప్ ఫైనల్లోనే. మళ్లీ శుక్రవారం శ్రీలంకతో వన్డే ఆడుతోంది. అంటే.. దాదాపు ఎనిమిదిన్నర నెలల తర్వాత అన్నమాట. బహుశా మరే జట్టు కూడా ఇంత సుదీర్ఘ విరామంతో వన్డేలు ఆడి ఉండదు. అందులోనూ భారత్ వంటి టాప్ జట్టు ఇంత కాలం 50 ఓవర్ల ఫార్మాట్ కు దూరంగా ఉందంటే ఆశ్చర్యమే.

దాదాపు 10 వేల రోజులైంది.. సిరీస్ గెలిచి

ప్రస్తుతం శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ పాల్గొంటోంది. చెప్పుకోదగ్గ విషయం ఏమంటే భారత్ పై లంక వన్డే సిరీస్ నెగ్గి ఇప్పటికి 9,840 రోజలు. వన్డే ప్రపంచ కప్ మాజీ చాంపియన్ అయిన లంక.. 1996-2002 మధ్య భారత్ ను వణికించింది. ఈ క్రమంలోనే 1997 ఆగస్టులో 3-0తో భారత్ ను స్వీప్ చేసింది. మళ్లీ అప్పటినుంచి.. 27 ఏళ్లుగా ఆ జట్టు భారత్ పై వన్డే సిరీస్ గెలిచిందే లేదు. ఆ క్రమంలో భారత్ వరుసగా 10 వన్డే సిరీస్ లను నెగ్గింది. కాగా,ప్రపంచ చాంపియన్ గా నిలిచిన జట్లలో దేనికీ భారత్ పై ఇంత చెత్త రికార్డు లేదేమో?