ఫ్లాష్ బ్యాక్: 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఏమి జరిగింది?
వన్డే క్రికెట్ వరల్డ్ కప్ - 2023 చివరిదశకు వచ్చేసింది! వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ప్రత్యర్థి ఎవరో కన్ ఫాం అయిపోయింది.
By: Tupaki Desk | 17 Nov 2023 3:51 AM GMTవన్డే క్రికెట్ వరల్డ్ కప్ - 2023 చివరిదశకు వచ్చేసింది! వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ప్రత్యర్థి ఎవరో కన్ ఫాం అయిపోయింది. తాజాగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా చెమటోడ్చి గెలిచింది. ఫలితంగా... ఈ నెల 19న అహ్మదాబాద్ లో భారత్ తో ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. దీంతో 20ఏళ్ల నాటి రివేంజ్ స్టోరీ తెరపైకి వచ్చింది.
అవును... తాజాగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో సఫారీలను ఓడించడంతో కంగారులు కాస్త కంగారు పడినా ఫైనల్ కి చేరుకోగలిగారు. పూర్తిగా బౌలర్ల ఆధిపత్యంలో సాగిన మ్యాచ్ లో కిందామీదా పడి గట్టేక్కి ఫైనల్ లో భారత్ తో తలపడబోతుంది. అయితే... ఇలా ఆస్ట్రేలియా - భారత్ లు ఫైనల్ లో తలపడి సుమరు ఇరవై ఏళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా రెండు దశాబ్ధాల క్రితం నాటి ఫైనల్ మ్యాచ్ కళ్లముందు కదలాడుతుంది!
సరిగ్గా 20ఏళ్ల క్రితం 2003 ప్రపంచ కప్ ఫైనల్ లో రీకీ పాంటింగ్ సారథ్యంలోని ఆసీస్ చేతిలో గంగూలీ కెప్టెన్సీలోని ఇండియా జట్టు ఓడిపోయింది. దీంతో ఈసారి గంగూలీ రివేంజ్ ని రోహిత్ సేన తీర్చాలని కోరుకుంటున్నారు టీం ఇండియా ఫ్యాన్స్. ఇప్పటికే గత వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇచ్చిన ఓటమికి తాజాగా వరల్డ్ కప్ సెమీస్ లో రివేంజ్ తీర్చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా... మార్చి 23 - 2003 న జోహనస్ బర్గ్ మైదానంలో ఆస్ట్రేలియా, టీం ఇండియా తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్... కేవలం రెండు వికెట్లు కోల్పోయి 359 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసిస్ బ్యాటర్స్ లో ఓపెనర్లు అడం గిల్ క్రిస్ట్ (57: 8x4, 1x6), మాథ్యూ హెడెన్ (37: 5x4) శుభారంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఇందులో భాగంగా సెంచరీతో చెలరేగిన పాంటింగ్ 120 బంతుల్లో 140 పరుగులు సాధించాడు. ఇందులో ఫోర్లు నాలుగే ఉండగా.. సిక్స్ లు 8 ఉండటం గమనార్హం. కెప్టెన్ కు మరో ఎండ్ లో డెమియన్ మార్టిన్ (88: 7x4, 1x6) సహకారమందించాడు. ఇక టీం ఇండియా బౌలర్లలో హర్భజన్ సింగ్ మాత్రమే రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఇక 360 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా బ్యాటర్స్ లో ఓపెనర్ సచిన్ (4) తొందరగా వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 81 బంతుల్లో 83 (10x4, 3x6) పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. ఇక మిగిలిన బ్యాటర్స్ లో రాహుల్ ద్రావిడ్ (47) తర్వాత గంగూలీ (24), యువరాజ్ సింగ్ (24), దినేష్ మోంగియా (12)లే రెండంకెల స్కోర్లు!
దీంతో 39.2 ఓవర్లలో 234 పరుగులకు టీం ఇండియా ఆలౌట్ అయ్యింది. ఆసిస్ బౌలర్లలో మెక్ గ్రాత్ (3), బ్రెట్ లీ (2), సైమండ్స్ (2) వికెట్లు తీసుకోగా... బ్రాడ్ హాగ్, బిచెల్ లు చెరో వికెట్ తీసుకున్నారు. ఫలితంగా ఆసిస్ కు 125 పరుగుల తేడాతో భారీ విక్టరీని అందించారు. ఇది జరిగి సుమారు 20 ఏళ్లు గడిచింది!
నాడు ఆసిస్ ఎంత ఫాం లో ఉందో.. అంతకు మించిన ఫాం లో నేడు టీం ఇండియా ఉందని అంటున్నారు విమర్శకులు! దీంతో 20ఏళ్ల నాడు జరిగిన పరాభవానికి ఇప్పుడు రివేంజ్ తీర్చుకునే సమయం వచ్చిందని.. ఇది గంగూలీకి టీం కి, రోహిత్ సేన ఇవ్వాల్సిన బహుమతి కూడా అని అంటున్నారు అభిమానులు!