1..2..3.. టి20 ప్రపంచ కప్ నుంచి టీమిండియా నాకౌట్?
అమెరికాలో అత్యంత స్వల్ప స్కోర్లతో మొదలై.. కరీబియన్ దీవులకు చేరింది టి20 ప్రపంచ కప్.
By: Tupaki Desk | 24 Jun 2024 10:29 AM GMTఅమెరికాలో అత్యంత స్వల్ప స్కోర్లతో మొదలై.. కరీబియన్ దీవులకు చేరింది టి20 ప్రపంచ కప్. వెస్టిండీస్ దీవులు కాస్త స్పిన్ కు అనుకూలం అనే పేరున్నప్పటికీ, మెరుగైన స్కోర్లే నమోదవుతున్నాయి. ఇక కీలకమైన సూపర్ 8 దశ కూడా ముగింపునకు వచ్చింది. సోమవారం రాత్రి ఆస్ట్రేలియాతో భారత్ తలపడే మ్యాచ్ ఈ దశలో చివరి నుంచి రెండోది. మంగళవారం ఉదయం బంగ్లాదేశ్-అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ కూడా కీలకమైనదే. గ్రూప్-ఎలోనే ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో అఫ్ఘాన్ గెలిస్తే సెమీస్ సమీకరణాలు మారిపోతాయి.
అత్యంత కీలక సమరం
టి20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు ఓ 50 మ్యాచ్ లు జరిగి ఉండొచ్చేమో..? కానీ అత్యంత ఆసక్తికర మ్యాచ్ లు కొన్నే. వీటిలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముగిసింది. అయితే, సహజంగానే భారత్-ఆసీస్ మ్యాచ్ ఆసక్తిగా ఉంటుంది. దీనికి సెమీస్ రేసు సమీకరణాలు తోడవడంతో మరింత ఆకర్షణ తోడవుతోంది. కాగా, సూపర్-8లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు నెగ్గిన భారత్.. సురక్షిత స్థానంలోనే ఉంది. కానీ, అఫ్ఘానిస్థాన్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా పరిస్థితులను సంక్లిష్టం చేసుకుంది.
ఎలిమినేట్ అవుతుందా?
సూపర్-8 ముగింపు ముంగిట ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమంటే.. టీమిండియా ఎలిమినేట్ అవుతుందా? వాస్తవానికి దీనికి అవకాశాలు తక్కువే. కానీ, పూర్తిగా కొట్టిపారేయలేం.. దీనికి రెండు మ్యాచ్ ల సమీకరణాలు కావాలి.
123 సమీకరణం
అఫ్ఘాన్-బంగ్లా, ఇండియా-ఆసీస్ మ్యాచ్ ల మధ్య గెలుపు తేడా ప్రకారం.. ఆసీస్ చేతిలో భారత్ 50 పరుగుల తేడాతో ఓడిపోవాలి. బంగ్లాపై అఫ్ఘాన్ 73 పరుగుల తేడాతో గెలవాలి. దీంతో రన్ రేట్ లో భారత్ కంటే ఆసీస్ రన్ రేట్ పెరిగి ఆ జట్టు సెమీస్ చేరుతుంది. భారత్ మాత్రం ఇంటిముఖం పడుతుంది. భారత్ ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే.. దీనికి అవకాశాలు చాలా తక్కువే. మరోవైపు బంగ్లాదేశ్ ఏమంత గొప్పగా ఆడడం లేదు. అలాగని అఫ్ఘాన్ 73 పరుగుల తేడాతో గెలుస్తుందనీ చెప్పలేం.
కాగా, క్రికెట్ లో ఎప్పుడైనా, ఏమైనా జరగొచ్చు. సంచలనాలు ఏమీ లేకుండా అయితే, భారత్ ఆసీస్ ను మట్టికరిపిస్తే టేబుల్ టాపర్ గా సెమీస్ కు వెళ్తుంది.