బంతులు కావవి బుల్లెట్లు... రోహిత్ సేన శ్రీలంకాదహనం!
ఇలాంటి ఒక రోజు వస్తుందని, అది కూడా ప్రపంచకప్ లో వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. తనతో పోటీపడుతున్న ప్రతీ టీం ని పసికూనను చేసేస్తుంది టీం ఇండియా.
By: Tupaki Desk | 3 Nov 2023 4:00 AM GMTఇలాంటి ఒక రోజు వస్తుందని, అది కూడా ప్రపంచకప్ లో వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. తనతో పోటీపడుతున్న ప్రతీ టీం ని పసికూనను చేసేస్తుంది టీం ఇండియా. ఇందులో భాగంగా తాజాగా శ్రీలంకను ఉతికి ఉతికి ఆరేసిందని చెప్పినా అతిశయోక్తి కాదేమో! దీంతో... దంచడం మొదలుపెడితే తమకంటే బాగా ఎవరూ దంచలేరు అన్నట్లుగా దక్షిణాఫ్రికాకు ముందస్తు హెచ్చరికలు కూడా జారిచేసింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో 302 పరుగుల తేడాతో లంకపై ఘనవిజయం సాధించింది.
అవును... 302 పరుగుల తేడాతో శ్రీలంక పై భారత్ ఘనవిజయం సాధించింది. ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపు లంక ఇన్నింగ్స్ క్లోజ్ అయిపోయింది. "3/4" నాలుగో ఓవర్ తొలి బంతి అయ్యేసరికి శ్రీలంక స్కోరిది. అంటే మూడు పరుగులకు నాలుగు వికెట్లు అన్నమాట. మరో విషయం ఏమిటంటే... ఆ 3 పరుగుల్లోనూ రెండు అదనపు పరుగులు! ఈ ఒక్క ఉదాహరణ చాలు బూమ్రా, సిరాజ్ లు లంక టాప్ ఆర్డర్ ని ఏ రకంగా బెంబేలెత్తించేశారో చెప్పడానికి. అనంతరం ఫుల్ ఫాం లో ఉన్న షమీ చేతికి బంతి ఇచ్చారు.. మిగిలిన కార్యక్రమం ఆయన ముగించేశారు!
ఈ వరల్డ్ కప్ లో ఏడో మ్యాచ్ లంకతో ఆడుతున్న టీం ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టిన రోహిత్ శర్మ... రెండో బంతికి బౌల్డ్ అయ్యాడు! దీంతో వాంఖడే స్టేడియం మొత్తం సైలంట్ అయిపోయింది. అనంతరం ఆ మౌనాన్ని చేధిస్తూ... శుభ్ మన్ గిల్ (92: 92 బంతుల్లో 11×4, 2×6), విరాట్ కోహ్లి (88: 94 బంతుల్లో 11×4) చెలరేగిపోయారు. లంక బౌలర్లపై గ్యాప్ ఇవ్వకుండా చెలరేగిపోయారు.
వీరిద్దరి అనంతరం శ్రేయస్ అయ్యర్ (82: 56 బంతుల్లో 3×4, 6×6) దుమ్ముదులపడంతో.. చివర్లో జడేజా (35) సహకరించడంతో భార త్ 8 వికెట్లకు 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బౌలర్లలో మదుశంక (5/80) సత్తా చాటాడు. భారీగా పరుగులిచ్చినప్పటికీ... వికెట్లన్నీ తానే తీసుకున్నాడు. అనంతరం భారత పేస్ త్రయం షమి (5-1-18-5), సిరాజ్ (7-2-16-3), బుమ్రా (5-1-8-1) విజృంభనకు లంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది.
రికార్డులు:
ఈ మ్యాచ్ లో ప్రపంచకప్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి బంతికి వికెట్ పడగొట్టిన మొట్టమొదటి భారత బౌలర్ గా బుమ్రా రికార్డ్ నెలకొల్పాడు. ఇదే సమయంలో ఒక ఏడాదిలో 1000 పరుగులు పూర్తి చేసిన సందర్భాలు సచిన్ పేరిట 7 ఉండగా... తాజాగా కొహ్లీ కొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఏడాదిలో వెయ్యి పరుగులు చేయడం ఇది అతడికి ఎనిమిదోసారి. 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2023 లలో కోహ్లి వెయ్యి పరుగులు పూర్తిచేశాడు.
ఇక ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కొట్టిన ఓ సిక్సర్ వెళ్లిన దూరం 106 మీటర్లు కాగా... ఇప్పటివరకూ ప్రపంచకప్ లో ఇదే భారీ సిక్సర్. వీటిలో మ్యాక్స్ వెల్ (104మీ) రెండో స్థానంలో ఉండగా.. 101మీ. తో కొట్టిన ఇంకో సిక్సర్ తో శ్రేయస్ మూడో స్థానంలో ఉండటం విశేషం.
ఇదే సమయంలో ఇప్పటివరకూ ప్రపంచకప్ ల్లో షమి 5 వికెట్ల ప్రదర్శన చేసిన సందర్భాలు మూడు కాగా... ఇప్పటివరకూ ఈ నెంబర్ తో అగ్రస్థానంలో ఉన్న మిచెల్ స్టార్క్ ను అతను సమం చేశాడు. వీటిఓ షమి వన్డే ప్రపంచకప్ వికెట్ల సంఖ్య 45కి చేరింది. దిఈంతో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ గా జహీర్ ఖాన్ (44), జవగళ్ శ్రీనాథ్ (44)ను షమి వెనక్కినెట్టాడు.