5 ఓవర్లలో 103 పరుగులు... భారత్ కు "సూపర్" ఫలితం!
గుమ్మడికాయంత కష్టానికి ఆవగింజంత అదృష్టం కూడా కలిసివస్తే ఫలితం ఎలా ఉంటుందనేది చాలా మందికి తెలిసిందే
By: Tupaki Desk | 18 Jan 2024 4:27 AM GMTగుమ్మడికాయంత కష్టానికి ఆవగింజంత అదృష్టం కూడా కలిసివస్తే ఫలితం ఎలా ఉంటుందనేది చాలా మందికి తెలిసిందే. తాజాగా అఫ్గానిస్థాన్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ కు అదే జరిగింది! టీం ఇండియా కష్టానికి అదృష్టం కూడా తోడయ్యింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సమయంలో తాజాగా జరిగిన మూడో టీ20 అత్యంత ఆసక్తిగా ముగియడం గమనార్హం. కారణం... భారత్ విజయం కోసం రెండో సూపర్ ఓవర్ వరకూ ఎదురుచూడాల్సి రావడం!
అవూను... అఫ్గానిస్థాన్ తో జరిగిన మూడో టీ20లో భారత్ "సూపర్" విక్టరీ సాధించింది. అత్యంత నాటకీయంగా రెండో సూపర్ ఓవర్ కు దారితీసిన ఈ మ్యాచ్ లో భారత్ గెలుపొంది టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, రింకూ సింగ్ వీరోచిత బ్యాటింగ్ ఒకెత్తు అయితే... రెండో సూపర్ ఓవర్ లో బిష్ణోయ్ బౌలింగ్ మరొకెత్తు అని చెప్పుకోవాలి. ఫలితంగా.. అత్యంత ఆసక్తిగా సాగిన మూడో మ్యాచ్ లో విజయం భారత్ ను వరించింది.
వివరాళ్లోకి వెళ్తే... మూడో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. వాస్తవానికి ఆరంభంలో యశస్వి జైస్వాల్ (4), కోహ్లీ (0), శివం దూబె (1), సంజు శాంసన్ (0) లు దారుణంగా విఫలమవ్వడంతో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో రోహిత్ శర్మ, రింకూ సింగ్ బ్యాట్ కు పనిచెప్పారు.
ఆఫ్గాన్ బౌలర్లతో... “మీరు వేస్తుండాలా - మేము కొడుతుండాలా” అన్నట్లుగా ఫిక్సయిన వీరిద్దరూ చెలరేగిపోయారు. ఫలితంగా... రోహిత్ శర్మ (121: 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్ లు), రింకు సింగ్ (69: 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్ లు) ఆకాశమే హద్దుగా చెలరేగి నాటౌట్ గా మిగిలారు! వీరి విధ్వంసం ఎలా సాగిందంటే... చివరి ఐదు ఓవర్లలో భారత్ ఏకంగా 103 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన అఫ్గాన్... చివరి బంతి దాకా పోరాడి ఆరు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (50), ఇబ్రహీం జద్రాన్ (50), గుల్బాదిన్ నైబ్ (55 నాటౌట్), మహ్మద్ నబీ (34) పోరాడారు. ఈ సమయంలో మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్ నిర్ణయించాల్సిన పరిస్థితి ఎదురైంది.
సూపర్ ఓవర్స్ సాగాయిలా!:
ఇక సూపర్ ఓవర్ లో భాగంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు.. ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్.. తొలి నాలుగు బంతుల్లో 14 పరుగులు చేసింది. ఇక మిగిలిన రెండు బంతుల్లోనూ ఒక్క బౌండరీ అయినా రాకపోతుందా అని చూసిన సమయంలో... రెండు పరుగులు మాత్రమే లభించాయి. దీంతో మళ్లీ స్కోర్ సమం అయింది.
దీంతో మ్యాచ్ రెండోసారి సూపర్ ఓవర్ కు దారితీసింది. ఈ సమయంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 11 పరుగులే చేసింది. దీంతో ఆఫ్గాన్ బ్యాటర్లు మొదటి మూడు నాలుగు బంతుల్లోనే పనిపూర్తి చేసేస్తారనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో... బౌలింగ్ కు దిగిన బిష్ణోయ్ మూడు బంతుల్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో ఆఫ్గాన్ కథ ముగియడం, భారత్ కు క్లీన్ స్వీప్ విక్టరీ దక్కడం జరిగింది.