ఆస్ట్రేలియాను ఊదేసిన భారత బ్యాటర్లు!
277 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.
By: Tupaki Desk | 23 Sep 2023 3:58 AM GMTభారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. పంజాబ్ లోని మొహాలిలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచింది. దీంతో మొదట ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత పేస్ బౌలర్ మహ్మద్ షమి నిప్పులు చెరిగే బంతులు విసరడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షమి 5 వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ నడ్డి విరిచాడు. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 52 (53 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే వన్ డౌన్ లో వచ్చిన స్టీవ్ స్మిత్ 41 (60 బంతుల్లో), లబుషేన్ 39, గ్రీన్ 31, వికెట్ కీపర్ జాస్ ఇంగ్లిష్ 45, స్టొయినిస్ 29 పరుగులు, కెప్టెన్ కమ్మిన్స్ 21 పరుగులు మాత్రమే చేశారు.
భారత బౌలర్లలో మహ్మద్ షమి 10 ఓవర్లు బౌల్ చేసి 51 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ చొప్పున పడగొట్టారు. ఆసీస్ బ్యాటర్లలో ఇద్దరు రనౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
277 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ బౌండరీలతో చెలరేగారు. దీంతో అలవోకగా పరుగులు వచ్చాయి. రుతురాజ్ 77 బంతుల్లో 71 పరుగులు, శుభమన్ గిల్ 63 బంతుల్లో 74 పరుగులు చేసి ఔటయ్యారు. వీరిద్దరూ అభేద్యంగా మొదటి వికెట్ కు 142 పరుగులు జోడించారు. 142 పరుగుల వద్ద రుతురాజ్ ఔట్ కాగా శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ కు వచ్చాడు.
అయితే 3 పరుగులు మాత్రమే చేసిన అయ్యర్ భారత స్కోరు 148 పరుగుల వద్ద ఉండగా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత 151 పరుగుల వద్ద శుభమన్ గిల్ ఔటయ్యాడు. శుభమన్ గిల్ ఔటయ్యాక వచ్చిన ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ కష్టాల్లో పడ్డట్టు అనిపించింది.
ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ 63 బంతుల్లో 58 పరుగులతో, సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 50 పరుగులతో భారత్ ను విజయపథంలో నడిపారు. సూర్యకుమార్ ఖచ్చితంగా హాఫ్ సెంచరీ చేసి ఔటయినా రవీంద్ర జడేజాతో కలిసి కెప్టెన్ రాహుల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. జడేజా 3 పరుగులు చేశాడు. దీంతో భారత్ 48.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసి విజయం సాధించింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా 2 వికెట్లు తీయగా, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 1 వికెట్, సీన్ అబాట్ 1 వికెట్ తీశారు. తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1–0 ఆధిక్యాన్ని సంపాదించింది.