Begin typing your search above and press return to search.

కంగారూలపై టీమిండియాకు గట్టిగా కసి తీర్చుకునే చాన్స్.. ఎలాగంటే?

ప్రస్తుతం వెస్టిండీస్ దీవుల వేదికగా టి20 ప్రపంచ కప్ జరుగుతున్నది. ఇందులో సూపర్ 8 దశ రసవత్తరంగా మారింది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 11:13 AM GMT
కంగారూలపై టీమిండియాకు గట్టిగా కసి తీర్చుకునే చాన్స్.. ఎలాగంటే?
X

సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరింది టీమిండియా.. కానీ, అక్కడ తుది మెట్టుపై బోల్తాకొట్టింది. ప్రత్యర్థిగా మరే జట్టు ఉన్నా.. ప్రపంచ కప్ మనదే అయ్యేదేమో? కానీ, ఆ రోజు తలపడింది.. ఎవరితో అయితే ఫైనల్ ఆడకూడదో అలాంటి జట్టుతో.. దీంతో భారత్ కు వన్డే ప్రపంచకప్ అందినట్లే అంది చేజారింది. దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం సరిగ్గా 8 నెలల్లోనే ఇప్పుడు లభించింది.

రేపటి మ్యాచ్ లో..

ప్రస్తుతం వెస్టిండీస్ దీవుల వేదికగా టి20 ప్రపంచ కప్ జరుగుతున్నది. ఇందులో సూపర్ 8 దశ రసవత్తరంగా మారింది. దీనికి కారణం.. ఆదివారం ఆస్ట్రేలియాను అఫ్ఘానిస్థాన్ ఓడించడం. సూపర్ 8 గ్రూప్ ఎలో భారత్, అఫ్ఘాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఉన్నాయి. భారత్.. అఫ్ఘాన్, బంగ్లాలను ఓడించి సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. చివరి మ్యాచ్ ను సోమవారం ఆస్ట్రేలియాతో ఆడనుంది. మరోవైపు ఆసీస్.. బంగ్లాదేశ్ పై గెలిచి, అఫ్ఘాన్ చేతిలో ఓడింది. సోమవారం భారత్ పైనా పరాజయం పాలైతే ఆ జట్టు సెమీస్ చేరడం క్లిష్టం అవుతుంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ పై అఫ్ఘాన్ విజయం సాధిస్తే కంగారూలకు దారులు మూసుకుపోయినట్లే.

ప్రతీకారానికి భలే చాన్స్

వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో మనల్ని ఓడించిన ఆస్ట్రేలియాను టి20 ప్రపంచ కప్ లో సోమవారం భారత్ ఓడిస్తే.. గట్టిగా ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది. దీనికితోడు మనకు ఫైనల్లో మరోసారి ఆస్ట్రేలియా ఎదురవకుండా ఉంటుంది. కాగా, సూపర్ 8 గ్రూప్ –బిలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్ లు రెండు సెమీఫైనల్ బెర్తులకు పోటీ పడుతున్నాయి. వీటిలో ఏ జట్లు ముందుంజ వేస్తాయో చూడాలి. సోమవారం దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ తలపడనున్నాయి.