లోతైన బ్యాటింగ్.. బలమైన బౌలింగ్.. ఐనా టీమిండియాకు మేల్కొలుపు ఓటమి
టీమిండియాకు ఇది మేల్కొలుపు ఓటమి అని భావించాలి.
By: Tupaki Desk | 16 Sep 2023 6:25 AM GMTఏకంగా తొమ్మిదో నంబరు వరకు బ్యాటింగ్ బలం.. ముగ్గురు పేసర్లు.. ఇద్దరు స్పెషలిస్ట్ (స్పిన్ ఆల్ రౌండర్లు కూడా) స్పిన్నర్లు.. మరో పార్ట్ టైమ్ బౌలర్.. రెగ్యులర్ ఓపెనర్లు.. పైకి ఐదు మార్పులు చేసినట్లు కనిపిస్తున్నా, టీమిండియా శుక్రవారం నాటి బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో పూర్తి బలమైన జట్టుతోనే దిగింది. ఐనా ఓటమి పాలైంది. దీనికి సమాధానం.. ఐదుగురు తొలి ప్రాధాన్య ఆటగాళ్లు లేరని చెబుతున్నారు. కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేటప్పుడు ఇది అసలు లెక్కలోకి రాదు. అంటే.. టీమిండియాకు ఇది మేల్కొలుపు ఓటమి అని భావించాలి.
ఆడారు కానీ.. ఓడారు
బంగ్లాదేశ్ తో నిన్నటి మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అభిమాని కోణంలో చెప్పాలంటే ఇది మొదటి తప్పు. బ్యాటింగ్ బలాన్ని పరీక్షించుకోవాలంటే తొలుత బ్యాటింగే ఎంచుకోవాల్సింది. అంతేకాదు స్పిన్ స్లో పిచ్ లు ఉండే శ్రీలంక వంటి దేశాల్లో కచ్చితంగా మొదట బ్యాటింగే చేయాలి. సరే.. ఎప్పుడూ మొదట బ్యాటింగే కాదు, ఛేదనలో బ్యాటింగ్ సత్తాను పరీక్షించుకుందామని భావించారేమో?.. ఈ విషయాన్ని వదిలేద్దాం. మరి బౌలింగ్ లోనూ తేలిపోయారు. 59 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టిన మన బౌలర్లు తర్వాత ప్రత్యర్థిని ఏకంగా 265 పరుగులు చేయనిచ్చారు. అందులోనూ బంగ్లాదేశ్ 8-9-10వ నంబరులో బ్యాటింగ్ కు దిగిన ఆటగాళ్లు చేసిన పరుగులు 87. కెప్టెన్ షకిబుల్ హసన్ (80) ఇన్నింగ్స్ ను పక్కనపెట్టి.. ఉమ్మడిగా చూస్తే ఈ ముగ్గురు చేసిన పరుగులు బంగ్లా ఇన్నింగ్స్ లో అత్యధికం. చివరకు అవే గెలుపోటములను శాసించాయి. కాగా, బంగ్లా టాపార్డర్ ను కూల్చిన టీమిండియా బౌలర్లు.. వారి టెయిలెండర్లను మాత్రం కట్టడి చేయలేకపోయారు.
అవకాశాలు మిస్.. క్యాచ్ లు మిస్.. మ్యాచ్ మిస్
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో టీమిండియా మూడు మంచి క్యాచ్ లను జారవిడిచింది. హైదరాబాదీ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ చెరో క్యాచ్ ను విడిచిపెట్టారు. దీంతో బంగ్లా మోస్తరు స్కోరుకు చేజేతులా అవకాశం ఇచ్చారు. ఆ క్యాచ్ లను పట్టి ఉంటే బంగ్లా ఇన్నింగ్స్ 200కు అటుఇటుగానే పరిమితమయ్యేదనడంలో సందేహం లేదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరో విషయం కూడా ఉంది. అది అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం. టి20ల్లో అదరగొట్టే సూర్యకుమార్ యాదవ్, టి20 అరంగేట్రంలో ఆకట్టుకున్న తిలక్ వర్మలకు ఈ మ్యాచ్ లో అనుకోకుండానే అవకాశం దక్కింది. కానీ, వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. యువ తిలక్ ను వన్ డౌన్ లో పంపడంపై టీమ్ మేనేజ్ మెంట్ ఆలోచించి ఉండాల్సింది. అయితే, తిలక్ అనూహ్య బంతికి ఔటైన సంగతి మర్చిపోకూడదు. ఇక సూర్య వన్డేలకు తగినవాడినని నిరూపించుకోలేపోతున్నాడు. కుదురుకున్నాక.. మ్యాచ్ లో గెలిపించే అవకాశం వచ్చాక ఔటై నిరాశపరిచాడు. బౌలింగ్ ప్రసిద్ధ్ క్రిష్ణ, అక్షర్ పటేల్ ప్రభావం చూపలేకపోయారు. సిరాజ్ కంటే తాను ఉత్తమం అని షమీ చాటుకోలేకపోయాడు. శార్దూల్ బంతితో రాణించినా.. బ్యాట్ తో కీలక సమయంలో పరుగులు చేయలేకపోయాడు.
ఇది మేల్కొలుపు
టీమిండియా నిన్నటి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. యువ శుబ్ మన్ గిల్ అద్భుత సెంచరీ ప్లస్ పాయింట్. కానీ, అనూహ్య పరిస్థితుల్లో ఒకరిద్దరు ఆటగాళ్లు ప్రపంచ కప్ సమయంలో గాయపడితేనో, అనారోగ్యంతోనే జట్టుకు దూరమైతే పరిస్థితి ఎలా ఉంటుందో బంగ్లా మ్యాచ్ నిరూపించింది. ఏమో..? బుమ్రా గాయపడితే షమీని ఆడించాల్సి రావొచ్చేమో? రోహిత్ కు గాయమైతే అయ్యర్ నో ఇంకొకరినో దింపాల్సి రావొచ్చేమో? వాస్తవానికి ఈ మ్యాచ్ లో కోహ్లిని ఆడించి రోహిత్ రెస్ట్ తీసుకోవాల్సింది. తిలక్ ను నాలుగు-ఐదు స్థానాల్లో పంపాల్సింది. కానీ, అతడిని వన్ డౌన్ లో దింపి ప్రయోగం చేశారు. ఇక బౌలింగ్ లోనూ లోపాలు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థి టెయిలెండర్లను త్వరగా ఔట్ చేయలేకపోవడం మన జట్టుకున్న బలహీనత. అది నిన్నటి మ్యాచ్ లో మళ్లీ కనిపించింది. ఏదేమైనా.. లోపాలను సరిదిద్దుకుంటే మన జట్టు ప్రపంచ కప్ ముంగిట బలంగా మారుతుంది.