Begin typing your search above and press return to search.

భారత్ దే బ్యాటింగ్.. లక్నో పిచ్ పై కాస్త కష్టమే..

వన్డే ప్రపంచ కప్ లో అన్ని జట్ల కంటే అధికంగా టీమిండియా 9 మైదానాల్లో లీగ్ మ్యాచ్ లు ఆడనుంది.

By:  Tupaki Desk   |   29 Oct 2023 8:15 AM GMT
భారత్ దే బ్యాటింగ్.. లక్నో పిచ్ పై కాస్త కష్టమే..
X

వన్డే ప్రపంచ కప్ లో అన్ని జట్ల కంటే అధికంగా టీమిండియా 9 మైదానాల్లో లీగ్ మ్యాచ్ లు ఆడనుంది. ముంబై లోనో, కోల్ కతాలోనో సెమీ ఫైనల్ ను కలుపుకొని.. ఫైనల్ కూ చేరితే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ను కూడా లెక్కేస్తే మొత్తం 11 వేదికల్లో ప్రపంచ కప్ ఆడుతునట్లు లెక్క. కాగా, వివిధ కారణాల రీత్యా మరే జట్టూ ఇన్ని మైదానాల్లో ఆడడం లేదు. అంతేకాదు.. పాకిస్థాన్ వంటి జట్టు ఐదారు వేదికల్లోనే లీగ్ మ్యాచ్ లను పూర్తి చేస్తోంది. ఇందులో హైదరాబాద్ లోనే రెండు మ్యాచ్ లు ఆడింది. కాగా, ఆదివారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా భారత్ తన ఆరో మ్యాచ్ ఆడుతోంది. ఇందులో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను ఎదుర్కొంటోంది.

సిక్సర్ కొడితే నాకౌట్ ఖాయం

ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ విజయం సాధించిన టీమిండియా.. బలహీన పడిన ఇంగ్లండ్ పైనా గెలిస్తే.. ఆరుకు ఆరు విజయాలతో దాదాపు సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఈ మ్యాచ్ లో ఓడినా భారత్ కు పోయిదేం లేదు.. అలాగని ఇంగ్లండ్ కు వచ్చేదేం లేదు. భారత్ ఇకమీదట దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ పై ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం రెండైనా గెలవగలదు. ఎలా చూసినా సెమీఫైనల్ చేరడం పక్కా.

పిచ్ మందకొడి.. మంచు ప్రభావం

ఉత్తర భారత దేశంలోని లక్నోలో ఇప్పటికే మంచు కురవడం మొదలైంది. రాత్రి వేళ కచ్చితంగా ఈ మేరకు మ్యాచ్ మీద ప్రభావం ఉంటుంది. లక్నోలోని ఏకనా పిచ్ కూడా కాస్త తేడానే. ఐపీఎల్ లోనూ ఇక్కడ పెద్దగా స్కోర్లు నమోదు కాలేదు. అయితే, కాస్త నిలదొక్కకుంటే బ్యాటర్లు సత్తా చాటగలరు. భారీగా కాకున్నా.. మంచి స్కోర్లే నమోదవుతుంటాయి. బంతి మాత్రం నిదానంగా వస్తుంది. అంటే.. స్పిన్నర్లకు సహకరిస్తుంది. మ్యాచ్ ఆరంభంలో పేసర్లు కూడా ప్రభావం చూపుతారు. ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. చివరగా చెప్పేదేమంటే.. క్రీజులో కుదురుకుంటే బ్యాటర్లు పరుగులు చేయగలరు.

సగటు 226 .. అంటే మోస్తరే..

ఏకనా పిచ్‌ పై మొదటి ఆరు ఇన్నింగ్స్‌ల్లో సగటు స్కోర్ 226. ఈ మైదానంలో 12 వన్డేలు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు మూడు సార్లు, ఛేదనకు దిగిన జట్లు 9 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 229. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 213. కాగా, వరల్డ్ కప్‌లో ఇక్కడ 3 మ్యాచ్‌ లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 311 పరుగులు చేసింది. చిత్రం ఏమంటే.. ఏకనా పిచ్ పై ఇదే అత్యధిక స్కోరు. దీంతో విజయం దక్షిణాఫ్రికానే వరించింది. రెండో మ్యాచ్‌ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. మూడో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలిచింది. లక్నోలో పొగ మంచు కురిసే అవకాశం ఉంది. మ్యాచ్‌ కు వర్షం ముప్పు లేదు. వాతావరణంలో తేమ 30 శాతం కాగా.. 13 శాతం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రత 18 నుంచి 31 డిగ్రీల సెల్సియస్‌.

మనదే బ్యాటింగ్ ఏం జరుగుతుందో?

లక్నో గ్రౌండ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. అయితే, స్పిన్ కు కాస్త అనుకూలించే ఏకనా పిచ్ పై ఇద్దరు ప్రధాన స్పిన్నర్లతోనే టీమిండియా బరిలో దిగింది. ఇదే కాస్త ప్రతికూలం కానుంది. రాత్రి పూట మంచు ప్రభావం ఉంచే మైదానంలో ఛేదన కష్టం అవుతుంది. మరోవైపు ఇన్నింగ్స్ ప్రారంభంలో పేసర్ ప్రభావం చూపుతారు. చివరకు ఏం జరుగుతుందో చూద్దాం..