భారత్ - పాక్ మ్యాచ్ కు వాన ముప్పు లేనట్లే.. ఇదీ క్యాండీ తాజా వెదర్
శ్రీలంక ఓ ద్వీప దేశం.. అందులోనూ ఇది వానాకాలం.. మూములుగా అయితే ఈ సమయంలో మ్యాచ్ లు పెద్దగా నిర్వహించరు.
By: Tupaki Desk | 2 Sep 2023 8:14 AM GMTశ్రీలంక ఓ ద్వీప దేశం.. అందులోనూ ఇది వానాకాలం.. మూములుగా అయితే ఈ సమయంలో మ్యాచ్ లు పెద్దగా నిర్వహించరు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆసియా కప్ నకు ఆతిథ్యం ఇవ్వాల్సి వచ్చింది. అసలే అప్పుల్లో ఉన్న లంక బోర్డుకు అందివచ్చిన అవకాశంగా మారింది. అందులోనూ భారత్-పాక్ మ్యాచ్ వంటి ప్రతిష్ఠాత్మక మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చే భాగ్యాన్ని ఏ దేశం మాత్రం ఎందుకు వదులుకుంటుంది...? కేవలం టీవీ వ్యూయర్ షిప్ ను పరిగణనలోకి తీసుకున్నా కోట్లాది మంది వీక్షిస్తారు. అందుకు ఎగిరి గంతేసి ఆతిథ్యం ఇస్తోంది. కానీ, వాతావరణమే ప్రతికూలంగా మారేలా ఉంది.
సరిగ్గా ఇప్పటి వాతావరణం ఇది..
క్యాండీలోని పల్లెకెలె లో మూడు రోజుల కిందట శ్రీలంక –బంగ్లాదేశ్ తలపడ్డాయి. పిచ్ చాలా మందకొడిగా కనిపించింది. మరికాసేపట్లో భారత్-పాక్ ఢీకొనబోతున్నాయి. అయితే, మ్యాచ్ కు వాన ముప్పు 90 శాతం ఉందనే శుక్రవారం వరకు నివేదికలు వచ్చాయి. కాగా, తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం.. క్యాండీ వాతావరణం మ్యాచ్ నిర్వహణకు సహకరించేలా ఉంది. ఆకాశం నీలి రంగులో ఉంది. వర్షం మాత్రం పడడం లేదు. అయితే ఈ ఉదయం మాత్రం కొన్ని చినుకులు కురిశాయి. దీంతో పిచ్ ను కప్పి ఉంచారు. ఇదంతా 11 గంటలకు ముందు జరిగింది. ఆ తర్వాత నుంచి కవర్లను తొలగించారు. వాతావరణ కూడా పొడిగా ఉంది. మబ్బులు కమ్ముకొంటున్నా.. వర్షం మాత్రం కురవడం లేదు.
ఒకవేళ వర్షంతో రద్దయితే..?
శుక్రవారం వరకు అందిన నివేదికల ప్రకారం క్యాండీలో శనివారం వాన కురిసే అవకాశం 90 శాతం ఉందన్నారు. కానీ, ఇప్పుడదేమీ లేదు. అయితే, శ్రీలంక కాబట్టి వాన పడదని పూర్తిగా కొట్టిపారేయలేం. కాగా, ఒకవేళ మ్యాచ్ సమయానికి వర్షం పడినా.. లేక వర్షం కారణంగా ఆడే పరిస్థితులు లేకపోయినా అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. మరి అదే జరిగితే సూపర్-4 దశకు టీమిండియా అర్హత సాధిస్తుందా.. అన్నది చర్చనీయాశంగా మారింది.
చెరో పాయింట్...
వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేస్తే భారత్ , పాక్ లకు చెరో పాయింట్ వస్తుంది. నేపాల్ ను చిత్తుగా ఓడించిన పాక్.. భారత్ తో మ్యాచ్ రద్దయినా సూపర్ -4 దశకు చేరుతుంది. భారత్ మాత్రం సూపర్-4 బెర్తు కోసం నేపాల్‌తో తలపడాల్సి ఉంటుంది. నేపాల్‌తో మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలిచితీరాలి. అటు కొంచెం సేపు మ్యాచ్ జరిగిన తర్వాత వర్షం ఆటంకం కలిగిస్తే అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని ఉపయోగించనున్నారు. డక్‌వర్త్ లూయిస్ విధానంలో మ్యాచ్ ఫలితం తేలాలన్నా కూడా.. రెండు జట్లు కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉండాలి. లేదంటే ఈ మ్యాచ్ ఫలితాన్ని పరిగణనలోకి తీసుకోవడం కుదరదు. అదే తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు పూర్తి ఓవర్లు ఆడి, ఛేజింగ్ మధ్యలో వర్షం పడితే.. ఛేజింగ్‌లో వేయాల్సిన ఓవర్ల పర్సంటేజీతో తొలి ఇన్నింగ్స్ స్కోరును గుణిస్తారు. దీన్ని బట్టి విజేతను నిర్ణయిస్తారు.