Begin typing your search above and press return to search.

బూమ్రా అద్భుతం... రోహిత్ సంచలనం... పాండ్యా ఫ్యాన్స్ కు స్పష్టం!

18 ఓవర్లో సిరాజ్ 9 పరుగులిచ్చి టెన్షన్ పెట్టినా.. 19 ఓవర్లో బూమ్రా మూడే పరుగులిచ్చి ఒక వికెట్ తీసి ఉత్కంట రేపాడు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 4:34 AM GMT
బూమ్రా అద్భుతం... రోహిత్  సంచలనం... పాండ్యా ఫ్యాన్స్  కు స్పష్టం!
X

120 పరుగుల లక్ష్యం.. టీ20లో ఇది అసలు పెద్ద లక్ష్యమే కాదు. పైగా అవతల ఉన్నది పాకిస్థాన్ బ్యాటర్స్.. బలమైన టాప్ ఆర్డర్.. స్థిరమైన మిడిల్ ఆర్డర్. కానీ ఇవతల ఉన్నది కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలు.. బుల్లెట్లలా దూసుకొచ్చే బూమ్రా వేసిన బంతులు. పాకిస్థాన్ బ్యాటర్స్ కి 120 పరుగులు భారీ లక్ష్యంగా మారిపోయింది.. అందనంత దూరంగా మిగిలిపోయింది.. పాక్ పై భారత్ మరోమారు జయకేతనం ఎగురవేసింది.

అవును... టీ20 వరల్డ్ కప్ లో అత్యంత ఆసక్తికరమైన, అత్యంత రసవత్తరమైన మ్యాచ్ అనుకున్నట్లే సాగింది. ఇందులో భాగంగా... పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 19 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలిన పరిస్థితి. వర్షం ప్రభావం చూపిన ఈ మ్యాచ్‌ లో పాక్ బౌలింగ్ దాటికి అత్యంత సులువుగా అన్నట్లుగా కుప్పకూలింది.

భారత్ బ్యాటర్స్ లో రిషబ్‌ పంత్‌ (42: 31 బంతుల్లో 6×4) టాప్‌ స్కోరర్‌ కాగా... పాక్‌ బౌలర్లలో నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్‌ లు తలో మూడేసి వికెట్లు తీసుకోగా మహ్మద్‌ ఆమిర్‌ రెండు వికెట్ల పడగొట్టాడు. ఒక్కమాటలో చెప్పాలంటే... పాక్ బౌలర్లు అదరగొట్టారనే చెప్పాలి. దీంతో... భారత్ ఓటమిని ఆల్ మోస్ట్ కన్ ఫాం చేసేసుకున్నారు అభిమానులు, ప్రేక్షకులు!

అనుకున్నట్లుగానే పాకిస్థాన్ బ్యాటర్స్ ఉన్నంతలో నిలకడ, దూకుడు మేళవించి ఆడారు. ఇందులో భాగంగా... 10 ఓవర్లకు 57/1తో లక్ష్యం దిశగా సాగింది పాకిస్థాన్. 12 ఓవర్లకు 72/2తో మరింత ముందంజ వేసింది. 17 ఓవర్లకు స్కోరు 90/5. అప్పుడే అద్భుతం జరిగింది. 18 ఓవర్లో సిరాజ్ 9 పరుగులిచ్చి టెన్షన్ పెట్టినా.. 19 ఓవర్లో బూమ్రా మూడే పరుగులిచ్చి ఒక వికెట్ తీసి ఉత్కంట రేపాడు.

అనంతరం అర్ష్ దీప్ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికే ఇమాద్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేసిందనే భావన అందరిలో నెలకొంది! కానీ 4, 5 బంతులకు నసీమ్‌ షా వరుసగా 2 ఫోర్లు బాదడంతో మళ్లీ భయం మొదటికి వచ్చింది. అయితే చివరి బంతికి సింగిలే రావడంతో మ్యాచ్‌ భారత్‌ సొంతమైంది. ఈ సమయంలో రోహిత్ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయని అంటున్నారు విశ్లేషకులు.

పాండ్యాను ఎత్తుకున్న రోహిత్:

ఈ మ్యాచ్ లో జరిగిన ఒక సన్నివేశం చాలా మందికి ఒక క్లారిటీ ఇచ్చిందనే చెప్పాలి. ఇందులో భాగంగా... ఐపీఎల్ లో ముంబై కెప్టెన్సీని హార్ధిక్ పాండ్యాకు ఇవ్వడంతో రోహిత్ కి అతనికి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే కామెంట్లు వినిపించాయి. అయితే.. పాకిస్థాన్ తో జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాండ్యా... షాదబ్ ఖాన్ వికెట్ తీయగానే ఒక సంఘటన జరిగింది.

ఇందులో భాగంగా... ఆ వికెట్ పడగానే కెప్టెన్ రోహిత్ శర్మ పరుగు పరుగున వచ్చి పాండ్యాను ఎత్తుకుని మరీ అభినందించాడు. దీంతో.. వీరిద్దరిమధ్యా కోల్డ్ వార్ లేదు ఏమీ లేదు... హ్యాపీగా ఉన్నారనే సంకేతాలు ఇద్దరి ఫ్యాన్స్ కూ ఒకేసారి పంపినట్లయ్యిందని అంటున్నారు.

కాగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో అందరి బ్యాటర్స్ తో పాటు పాండ్యా కూడా ఫెయిల్ అయ్యాడు. కేవలం 7 పరుగులే చేశాడు. అయితే బౌలింగ్ లో మాత్రం సత్తా చాటాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు దక్కించుకున్నాడు.