క్రికెట్ లో కర్మభూమి vs జన్మభూమి.. ఆధార్ కార్డ్ vs గ్రీన్ కార్డు
తొలిసారి టి20 ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇస్తోంది అమెరికా.
By: Tupaki Desk | 13 Jun 2024 6:49 AM GMTఇదో విచిత్రమైన పరిస్థితి.. జన్మనిచ్చిన భూమి వైపు నిలవాలో.. పొట్టచేత పట్టుకుని వచ్చిన కర్మభూమి పక్షాన నినదించాలో తెలియని సందిగ్ధత.. బహుశా ప్రపంచంలో మరెక్కడ టోర్నీ జరిగినా ఇలాంటి ఇబ్బంది రాదేమో..? కానీ, ఈ ఒక్క దేశంలో మాత్రమే ఆ కష్టం. ఇంతకూ ఏమిటిదంతా అంటే..
తొలిసారి టి20 ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇస్తోంది అమెరికా. ఈ హోదాలో ప్రపంచ కప్ లోనూ అడుగుపెట్టి అదరగొడుతోంది. పొరుగు దేశం కెనడాను మట్టి కరిపించి.. మాజీ చాంపియన్ పాకిస్థాన్ కు షాక్ ఇచ్చింది. బుధవారం భారత్ ను సైతం ఓ దశలో వణికించిది. అయితే, అనుభవంతో ఒత్తిడిని ఎదుర్కొన్న టీమిండియా మ్యాచ్ ను తమ వశం చేసుకుంది.
ఎంతటి డైలమానో?
బుధవారం భారత్-అమెరికా మధ్య మ్యాచ్ సందర్భంగా అమెరికాలో స్థిరపడిన, ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు అత్యంత డైలమాను ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్ లో తాము పనిచేస్తున్న అమెరికాను సపోర్ట్ చేయాలా? లేక జన్మనిచ్చిన భారత్ గెలవాలని కోరుకోవాలా? తెలియక కొట్టుమిట్టాడారు. కొందరు జన్మభూమి వర్సెస్ కర్మభూమి ప్లకార్డులు పట్టుకుని రావడం కూడా కనిపించింది. దీనికి క్రికెట్ వ్యాఖ్యాతలు.. క్రియేటివిటీని కలిపి ఆధార్ కార్డు వర్సెస్ గ్రీన్ కార్డు అనే కామెంట్ తగిలించారు.
పరిణతితో ఆలోచించారు
ఇంతటి సందిగ్ధతలోనూ క్రికెట్ అభిమానులుగా ప్రవాస భారతీయులు క్రీడా స్ఫూర్తి చూపారు. ఆటను ఆటలాగా ఆస్వాదించారు. ఏ జట్టు గెలిచినా తమ జట్టేననే భావనలో కనిపించారు. తాము ఏ ఒక్క దేశానికో చెందినవారం కాదనే సందేశం పంపారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం’’ అనేది అటు అమెరికా.. ఇటు భారత దేశం రెండింటిలోనూ కనిపించే సహజ లక్షణమని చాటారు.