Begin typing your search above and press return to search.

దక్షిణాఫ్రికా.. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ కు.. టీమిండియా సిద్ధమా?

అమెరికా-కరీబియన్ దీవుల వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ తుది అంకానికి చేరింది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 8:31 AM GMT
దక్షిణాఫ్రికా.. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ కు.. టీమిండియా సిద్ధమా?
X

ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఇప్పటివరకు వెస్టిండీస్ ను కొట్టాం.. శ్రీలంకను కొట్టాం.. పాకిస్థాన్ నూ కొట్టాం.. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఇంగ్లండ్ నూ కొట్టాం.. కానీ, ఈసారి గతంలో ఎన్నడూ చూడని ప్రత్యర్థి.. వారికి కూడా ఎన్నడూ ఫైనల్ చేరని చరిత్ర.. మరి టీమిండియా సిద్ధమా?

అమెరికా-కరీబియన్ దీవుల వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ తుది అంకానికి చేరింది. భారత్-ఇంగ్లండ్ మధ్య గురువారం రాత్రి 8 గంటలకు రెండో సెమీస్ జరగనుంది. గురువారం ఉదయం జరిగిన తొలి సెమీస్ లో అఫ్ఘానిస్థాన్ ను చిత్తు చేసింది. దీంతో ఫైనల్‌ కు దూసుకెళ్లింది.

ఏ ఫైనల్ కైనా తొలిసారి..

1975లో వన్డే ప్రపంచ కప్ మొదలైంది. అప్పటికే జాతి వివక్ష కారణంగా దక్షిణాఫ్రికాపై వేటు పడింది. 21 ఏళ్ల నిషేధం అనంతరం 1991లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చింది. కానీ, అప్పటినుంచి ‘దురదృష్టాఫ్రికా’ అనే పరిస్థితి. 1992 సెమీఫైనల్లో ఇంగ్లండ్ పై విజయం దిశగా ఉండగా వర్షం పడింది. సమీకరణం మారిపోయి 1 బంతికి 21 పరుగులు చేయాల్సి వచ్చింది. అయ్యో.. అనే రీతిలో దక్షిణాఫ్రికా నిష్క్రమించింది. భారత్ లో జరిగిన 1996 ప్రపంచ కప్ లో అతి విశ్వాసానికి పోయింది. 1999లో ఇంగ్లండ్ లో జరిగిన కప్ లో ఓపెనర్ గిబ్స్ చేసిన పొరపాటు, ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో తడబాటు దక్షిణాఫ్రికాను కప్ నకు దూరం చేసింది. 2003లో సొంత గడ్డపై జరిగిన టోర్నీలో అయితే, దారుణమైన ప్రదర్శనతో తొలి రౌండ్ లోనే వెనుదిరిగింది. 2007, 2011లో కాస్త ఫర్వాలేదు. 2019లో సెమీస్ చేరలేదు. భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2023 ప్రపంచ కప్ లో మాత్రం దూకుడైన ఆటతో సెమీస్ వరకు వచ్చి ఆస్ట్రేలియా చేతిలో భంగపడింది.

టి20 ప్రపంచ కప్ లలోనూ అదే తీరు

తొలి టి20 ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇచ్చింది దక్షిణాఫ్రికానే. కానీ, ఆ కప్ తో సహా ఎప్పుడూ ఫైనల్ చేరలేదు. కానీ, 9వ టి20 ప్రపంచ కప్ లో మాత్రం ఫైనల్ చేరి.. టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. ట్రినిడాడ్‌ లో అఫ్ఘాన్‌ తో జరిగిన తొలి సెమీఫైనల్‌ లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ పై అనూహ్య విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించిన అఫ్ఘాన్‌ సెమీస్ లో చేతులెత్తేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అఫ్ఘాన్.. 56 పరుగులకే పరిమితమైంది. అయితే, ఓపెనర్ డికాక్‌ (5)ను తక్కువ స్కోరుకే ఔట్ చేసిన అఫ్ఘాన్‌ బౌలర్లు కాస్త కట్టడి చేసినట్లే కనిపించారు. కానీ, ఓపెనర్ హెండ్రిక్స్‌ (29*), వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మార్‌క్రమ్‌ (23*) తడబడినా నిలదొక్కుకుని మ్యాచ్‌ ను ముగించేశారు.

అఫ్ఘాన్‌ ఇన్నింగ్స్.. 11.5 ఓవర్లలోనే ముగిసింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కొ యాన్సెన్, చైనా మన్ స్పిన్నర్ షంసీ చెరో 3 వికెట్లు తీశారు. రబడా, నోకియా రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లండ్ ను భారత్ పడగొడుతుదా?

గురువారం రాత్రి 8 గంటలకు మొదలయ్యే రెండో సెమీస్ లో భారత్‌- ఇంగ్లాండ్‌ ను ఢీకొననుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. శనివారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. కాగా, బలాబలాల ప్రకారం చూస్తే ఇంగ్లండ్ కంటే భారత్ దే పైచేయి. కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ కోహ్లి, పంత్, సూర్య, హార్దిక్ లతో భారత బ్యాటింగ్ పటిష్ఠంగా ఉంది. అయితే, ఇంగ్లండ్ కూ బట్లర్, సాల్ట్, బ్రూక్, లివింగ్ స్టోన్, బెయిర్ స్టోలతో కూడిన బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, మేటి పేసర్ బుమ్రా ఈ రెండు జట్ల మధ్య తేడా చూపగలరు. ఇంగ్లండ్ పేసర్లలో జోఫ్రా ఆర్చర్ ను ఎదుర్కొనడం కీలకం. మిగతా పేసర్లు పెద్దగా ఇబ్బంది పెట్టే స్థాయి ఉన్నవారు కాదు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ ను ఓ కంట కనిపెడుతూ మిగతా బౌలర్లపై ఎదురుదాడికి దిగితే టీమిండియా మంచి స్కోర్ చేయగలదు.

ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టి20 ప్రపంచకప్ లో టీమిండియాను సెమీస్ లో 10 వికెట్ల తేడాతో ఓడించింది ఇంగ్లండ్. అప్పుడు కుల్దీప్, బుమ్రా లేరు. నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు భారత్ కు చక్కటి అవకాశం లభించింది.