ఫైనల్ మ్యాచ్ రద్దు... టీమిండియా గోల్డ్ మెడల్!
ఇప్పటికే 100కు పైగా పథకాలతో పాయింట్ పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన భారత్... ఆసియా క్రీడల్లో తనదైన శైలిలో సత్తా చాటుతుంది
By: Tupaki Desk | 7 Oct 2023 11:47 AM GMTఇప్పటికే 100కు పైగా పథకాలతో పాయింట్ పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన భారత్... ఆసియా క్రీడల్లో తనదైన శైలిలో సత్తా చాటుతుంది. ఇప్పటికే 27 స్వర్ణాలు, 36 రజతాలు, 41 కాంస్య పతకాలు సాధించిన ఇండియా... తాజాగా ఇండియన్ క్రికెట్ జట్టు స్వర్ణంతో మెరిసింది. దీంతో స్వర్ణా పతకాల సంఖ్య 28కి చేరగా.. మొత్తం పథకాల సంఖ్య 105 కి చేరింది!
అవును... ఆసియా క్రీడలు-2023 లో మొదటి నుంచీ దూకుడు మీదున్న టీం ఇండియా... ఫైనల్ మ్యాచ్ లోనూ బౌలిం గ్ లో ప్రతిభ కనబరిచింది. ఈ నేపథ్యంలో వర్షం వల్ల మ్యాచ్ రద్దవ్వడంతో... విజయం భారత్ ను వరించింది. ఫలితంగా భారత్ కు స్వర్ణపతకం రాగా, ఆఫ్ఘనిస్తాన్ కు రజత పతకం వరించింది.
వివరాళ్లోకి వెళ్తే... చైనా వేదికగా హోంగ్జూలో రుతురాజ్ గైక్వాడ్ సేన శనివారం అఫ్గనిస్తాన్ తో ఫైనల్లో తలపడింది. టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత బౌలర్ల దాటికి అఫ్గన్ టాప్ ఆర్డర్ పేకమేడలా కూలింది. అందులో భాగంగా... 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో షహీదుల్లా కమ ల్ 49 పరుగులతో, కెప్టెన్ గులాబదిన్ నయీబ్ 27 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, వర్షం రాకతో సీన్ మొత్తం మారిపోయింది. అఫ్గాన్ ఇన్నింగ్స్ లో 18.2 ఓవర్లలో ఆట పూర్తయిన తర్వాత వరుణుడు అంతరాయం కలిగించగా.. అప్పటికి 112/5 స్కోరుతో ఉంది.
ఈ పరిస్థితుల్లో వరుణుడు ఎంతకూ శాంతించలేదు. దీంతో ఈ పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని చెబుతూ... భారత్ ను విజేతగా ప్రకటించారు. దీంతో టీం ఇండియా స్వర్ణ పతకం గెల్చుకోగా.. అఫ్గాన్ రజతం అందుకుంది. కాగా... క్రికెట్ లో భారత మహిళల జట్టు కూడా పసిడి పతకాన్ని గెల్చుకున్న సంగతి తెలిసిందే.
ఈ టోర్నమెంట్ లో ముందునుంచీ దూకుడు ప్రదర్శించిన టీం ఇండియా... పటిష్ట స్థితిలో నేరుగా క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఇందులో భాగంగా... తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ ను 23 పరుగుల తేడాతో ఓడించింది. అనంతరం తొలి సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
ఈ క్రమంలో ఫైనల్ కి అడుగుపెట్టిన భారత్.. నేడు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడింది. అయితే వరుణుడి కారణంగా ఫైనల్లో అఫ్గనిస్తాన్ తో మ్యాచ్ రద్దు కావడంతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
ఇదే క్రమంలో శనివారం భారత్ కు మరో రెండు స్వర్ణ పథకాలు, ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి. ఇందులో భాగంగా... దక్షిణ కొరియా జంటపై పోటీకి దిగిన సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ బ్యాడ్మింటన్ లో బంగారు పతకం గెలుచుకుంది. ఫైనల్ లో 21-18, 21-16 తేడాతో విజయం సాధించింది.
ఇదే సమయంలో కబడ్డీలోనూ భారత్ స్వర్ణం సాధించింది. ఫైనల్ లో పురుషుల జట్టు ఇరాన్ ను 33-29 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని పట్టేసింది. మరోపక్క రెజ్లింగ్ లో పురుషుల 86 కేజీల ప్రీస్టైల్ విభాగంలో దీపక్ పునియా రజతం దక్కించుకోగా... డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ పై 2-1 తేడాతో విజయం సాధించి హాకీలో భారత మహిళల జట్టు కాంస్య పతకం దక్కించుకుంది.