టీమిండియా ‘ఆఖండ’.. ఖండం మారినా ఆ జట్టుపై గెలుపు మనదే
టీ20 ప్రపంచ కప్ లో మాత్రం పరిస్థితి భిన్నం.. 8 సార్లు ఎదురుపడగా 7 సార్లు భారత్ నెగ్గింది.
By: Tupaki Desk | 11 Jun 2024 9:22 AM GMTశ్రీలంక.. ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్.. న్యూజిలాండ్.. ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్ లో భారత్ పై పలుసార్లు గెలిచాయి.. ఆఖరికి 17 ఏళ్ల కిందటే బంగ్లాదేశ్ కూడా ఓడించింది. కానీ ఇప్పటివరకు మనపై ఒక జట్టు మాత్రం గెలవలేకపోయింది.. 13 సార్లు ప్రపంచ కప్ లు జరిగితే.. ఏడుసార్లు తలపడినా పరాజయమే మిగిలింది.. కనీసం విజయానికి దగ్గరగానూ రాలేదు.
టీ20 ప్రపంచ కప్ లో మాత్రం పరిస్థితి భిన్నం.. 8 సార్లు ఎదురుపడగా 7 సార్లు భారత్ నెగ్గింది. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఈ ఫార్మాట్ గురించి.. క్షణాల్లో ఫలితం మారిపోయే టి20ల్లో గెలుపు ఓటములకు పెద్ద ప్రాధాన్యం ఉండదు.
అన్నిచోట్లా మనదే గెలుపు..
పాకిస్థాన్ తో సమరం అందులోనూ ప్రపంచ కప్ లో అంటే భారత అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులూ ఎంతో ఉత్సాహం చూపుతారు. గత ఆదివారం అమెరికాలో జరిగిన టి20 ప్రపంచ కప్ మ్యాచ్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. కాగా, అమెరికాలో భారత్-పాకిస్థాన్ తలపడడం ఇదే తొలిసారి.
యూరప్ నుంచి అమెరికా వరకు..
భారత్-పాక్ ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో తలపడ్డాయి. ప్రతిచోటా భారత్ దే విజయం. టి20 ప్రపంచ కప్ లో వీటికితోడు తాజాగా ఉత్తర అమెరికా ఖండంలోని అమెరికాలో జరిగిన మ్యాచ్ లోనూ టీమిండియా గెలుపొంది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
మిగతా జట్లకు దక్కని రికార్డు ఇది..
ప్రపంచంలోని మిగతా ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగినా లేని క్రేజ్.. టీమిండియా-పాక్ తలపడితే వస్తుంది. అంతేగాక.. ఇప్పుడు ఉత్తర అమెరికా ఖండంలోనూ ఇరు జట్లూ తలపడడం మరో ప్రత్యేకతగా నిలిచింది. బహుశా మరే జట్లూ ఇన్ని భిన్న ఖండాలలో ఆడి ఉండవేమో?