2 గాయాలు.. ఆస్ట్రేలియాలో టీమిండియాకు బిగ్ షాక్..ఇక కష్టాలే
ఇక తాజా సిరీస్ లో భాగంగా తొలి టెస్టు ఈ నెల 22న మొదలు కానుంది. అయితే, ఆ మ్యాచ్ కు ముందే టీమ్ ఇండియాకు అపశకునాలు ఎదురవుతున్నాయి.
By: Tupaki Desk | 17 Nov 2024 7:30 PM GMTక్రికెట్ లో న్యూజిలాండ్ లో పిచ్ లు విపరీతమైన గాలి కారణంగా పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తాయి.. దక్షిణాఫ్రికాలో బౌన్స్ తో బెంబేలెత్తిస్తాయి.. ఇంగ్లండ్ లో స్వింగ్ తో కంగారు పెడతాయి.. ఇక ఆస్ట్రేలియాలో అయితే ఇవన్నీ కలిసినట్లు కనిపిస్తాయి.. పైగా కంగారూ జట్టుతో టెస్టు సిరీస్ అంటే ప్రత్యర్థి జట్లకు ముందే ముచ్చెమటలు పడతాయి. అంతటి కఠిన సవాల్ ఇప్పుడు టీమ్ ఇండియా ముందుంది. కానీ, మైదానంలోకి దిగకముందే మన జట్టుకు కష్టాలు మొదలయ్యాయి.
33 ఏళ్ల తర్వాత..?
అప్పుడెప్పుడో విరాట్ కోహ్లికి ఇంకా నడక రాకముందే ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్ ఆడింది టీమ్ ఇండియా. మళ్లీ 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల సమరానికి సిద్ధమైంది. ఇన్నేళ్లలో కంగారూ గడ్డపై మూడు లేదా నాలుగు మ్యాచ్ ల సిరీస్ లు మాత్రమే జరిగాయి. ఇక తాజా సిరీస్ లో భాగంగా తొలి టెస్టు ఈ నెల 22న మొదలు కానుంది. అయితే, ఆ మ్యాచ్ కు ముందే టీమ్ ఇండియాకు అపశకునాలు ఎదురవుతున్నాయి.
కెప్టెన్ లేడు.. ఓపెనర్ కు గాయం
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. రెండోసారి తండ్రి అయిన అతడు.. జట్టుతో పాటు ఆస్ట్రేలియా వెళ్లలేదు. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి రానున్నాడు. ఆ నేపథ్యంలో యువ యశస్వి జైశ్వాల్ తో కలిసి టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ను ఓపెన్ చేసింది ఎవరు? అనే ప్రశ్న రాగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరు వినిపించింది. కానీ, ఇంట్రా టీమ్ మ్యాచ్ లో అతడి మోచేతికి దెబ్బ తగిలింది. దీంతో మైదానాన్ని వీడాడు. తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియరావడం లేదు.
ఇప్పుడు గిల్ వంతు..
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు యువ బ్యాట్స్ మన్ శుభ్‌మన్ గిల్ కూడా దూరమయ్యాడు. అతడి వేలు విరిగింది. శనివారం జట్టులోని ఆటగాళ్లతో అంతర్గత మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ వేలికి బంతి బలంగా తాకింది. దీంతో వెంటనే అతడు బయటకు వెళ్లిపోయాడు. గిల్ వేలిలో చీలిక వచ్చింది. తొలి టెస్టుకు ఇంకో ఐదు రోజులే సమయం ఉండగా గిల్ కోలుకోవడం కష్టమే. మ్యాచ్‌కు దాదాపు దూరమైనట్లే. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్ గా అభిమన్యు ఈశ్వరన్, వన్ డౌన్ లో గిల్ స్థానాన్ని తమిళనాడు యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ భర్తీ చేసే అవకాశం ఉంది.