Begin typing your search above and press return to search.

అదే జరిగితే.. అమరావతి ఆ ‘ఫీవర్‌’ తో ఊగిపోవాల్సిందే!

ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధిపై దృష్టిపెట్టింది.

By:  Tupaki Desk   |   13 Sep 2024 7:25 AM GMT
అదే జరిగితే.. అమరావతి ఆ ‘ఫీవర్‌’ తో ఊగిపోవాల్సిందే!
X

ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధిపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా మొదటి ఏడాదిన్నరలోనే రాజధానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం మీద తమ ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యేసరికి పూర్తి స్థాయి రాజధాని నగరంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ఉంది.

మరోవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరిలోని క్రికెట్‌ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు వీలుగా మంగళగిరి స్టేడియాన్ని తీర్చిదిద్దనుంది.

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ కు కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్‌) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏసీఏ అధ్యక్షుడిగా వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌ చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏసీఏలో వైసీపీ నేతలే చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున నిధుల గోల్‌ మాల్, వందల కోట్ల రూపాయల నిధుల అవకతవకలు వంటివి చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో ఇప్పుడు ఏసీఏలో కూటమి నేతలు పాగా వేశారు. తాజాగా ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ లో క్రికెట్‌ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఏసీఏ సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మంగళగిరి ఎమ్మెల్యే, ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సహకారంతో మంగళగిరిలో క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ స్టేడియంతో పాటు మంగళగిరి స్టేడియంను కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్‌ లకు ఆతిథ్యం ఇచ్చేలా మంగళగిరి స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఈ నేపథ్యంలో మంగళగిరి స్టేడియంలో మౌలిక వసతుల కల్పనకు త్వరలో ఏసీఏ నిధులు కేటాయిస్తుందని కేశినేని చిన్ని తెలిపారు.

కొద్ది రోజుల క్రితం స్టేడియంను పరిశీలించిన చిన్ని గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వ సహకారంతో ఏసీఏ క్రికెట్‌ క్రీడాభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలిపారు.

కేశినేని చిన్ని హామీ ఇచ్చినట్టు మంగళగిరిలో స్టేడియం సాకారమై అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ లు జరిగితే ఇక అమరావతి క్రికెట్‌ ఫీవర్‌ తో ఊగిపోవాల్సిందేనని క్రీడా పండితులు చెబుతున్నారు. ఆ రోజులు త్వరగా రావాలని ఆశిస్తున్నారు.