ఐపీఎల్-18లో మరో కొత్త రూల్.. గేమ్ చేంజర్ గానా? బిగ్ కాంట్రవర్సీనా?
ఈసారి లీగ్ ప్రారంభానికి ముందే కొత్త రూల్ వచ్చింది. బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
By: Tupaki Desk | 22 March 2025 12:34 AM ISTఐపీఎల్ 18వ సీజన్ మరికొద్ది గంటల్లో మొదలుకానుంది.. వర్షం అడ్డంపడితే తప్ప శనివారం కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈసారి లీగ్ ప్రారంభానికి ముందే కొత్త రూల్ వచ్చింది. బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఇక ఐపీఎల్ లో రెండేళ్ల కిందట తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ లో ఇదో అతిపెద్ద నిర్ణయంగా నిలిచింది. ఈసారి మరింత రచ్చ లేపే మరో నిర్ణయం ప్రవేశపెట్టారు.
చాప కింద నీరులా..
ఎప్పుడు ప్రవేశపెట్టారో కానీ.. వచ్చే ఐపీఎల్ సీజన్ లో మరో రూల్ తీసుకొచ్చారు. అదేమంటే.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో రెండు కొత్త బంతులను ఉపయోగించనున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మ్యాచ్ లను మలుపుతిప్పే నిర్ణయంగా భావించవచ్చు. మ్యాచ్ లను మరింత రసవత్తరం చేసే అంశంగానూ పేర్కొనవచ్చు.
భారత దేశంలో ఇంకా మంచు ప్రభావం పోలేదు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో. శనివారం నుంచి మొదలయ్యే ఐపీఎల్ లో కనీసం పది పదిహేను రోజులైనా మంచు ప్రభావం ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే బౌలర్ కు బంతిపై పట్టు చిక్క.. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే జట్టుకు మేలు జరిగే చాన్సుంది.
రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత, కొత్త బంతి తీసుకోవడానికి అంపైర్ నిర్ణయమే ప్రామాణికం కానుంది. ఆ సమయంలో అధిక మంచు ఉందా లేదా అని ఆన్-ఫీల్డ్ అంపైర్లు నిర్ణయిస్తారు. అయితే, అధిక మంచు అంటే ఏమిటో నిర్ణయించడానికి ఎలాంటి ఆబ్జెక్టివ్ పద్ధతి లేదు.
అయినా.. మ్యాచ్ ను మార్చే నిర్ణయం ఇద్దరు అంపైర్లపై ఆధారపడి ఉంటుంది.
అయితే, అంపైర్లు తప్పు చేస్తే పరిస్థితి ఏమిటి? అని కూడా ప్రశ్న వస్తోంది. వారి నిర్ణయాన్ని చాలామంది ప్రేక్షకులు కూడా అంగీకరించకపోవచ్చు. కెప్టెన్- ఫీల్డ్ అంపైర్ల మధ్య వాగ్వాదానికి దారితీసే నేపథ్యంలో ఫెయిర్ ప్లే అవార్డుకు అవకాశం ఉండదు. దీంతో కొత్త బంతి నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొందరు ఐపీఎల్ అభిమానులు ఇది ముఖ్యమైన నియమం అంటుండగా.. బెంగళూరు, ముంబై మైదానాల్లో భారీ స్కోర్లను సులభంగా ఛేదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. విమర్శకులు మాత్రం కొత్త బంతి రూల్ ఐపీఎల్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు.
ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై విమర్శలు ఉన్నాయి. తాజా నిబంధన మాస్టర్ స్ట్రోక్ అవుతుందా లేక బీసీసీఐ మరో తప్పిదంగా మారుతుందా? అనేది చూడాలి.