Begin typing your search above and press return to search.

మున్ముందు టి20 కాదు..హండ్రెడ్ లీగ్.. ఐపీఎల్ దిగ్గజాలదీ అదే బాట

టి20లు అంటే 20 ఓవర్లు.. 120 బంతులు. అదే హండ్రెడ్ లీగ్ అంటే.. వంద బంతులే ఉంటాయి. దీనికితగ్గట్లే ఓవర్ల కుదింపు ఉంటుంది

By:  Tupaki Desk   |   22 Oct 2024 12:30 AM GMT
మున్ముందు టి20 కాదు..హండ్రెడ్ లీగ్.. ఐపీఎల్ దిగ్గజాలదీ అదే బాట
X

టెస్టుల శకం చూశాం.. వన్డేల హవా చూశాం.. టి20ల రాజ్యం చూశాం.. కానీ, వీటికి తోడు మున్ముందు హండ్రెడ్ లీగ్ తరం రానుంది.. ఇదేదో కొత్తగా వినిపించినా.. పూర్తిగా కొత్తది మాత్రం కాదు.. మన దగ్గర ప్రాచుర్యంలో లేదు కానీ.. ఇంగ్లండ్ లో మాత్రం హండ్రెడ్ లీగ్ కు మంచి ఆదరణే ఉంది. క్రికెట్ కే కాక.. టి20లకూ పుట్టిల్లయిన దేశం కావడమో ఏమో కానీ.. ఇంగ్లిష్ గడ్డ ఎప్పుడూ క్రికెట్ లో ప్రయోగాలకు వేదిక అవుతోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) 100 బంతుల లీగ్ ను తీసుకొచ్చింది.

మున్ముందు ఇదే లీగ్..

టి20లు అంటే 20 ఓవర్లు.. 120 బంతులు. అదే హండ్రెడ్ లీగ్ అంటే.. వంద బంతులే ఉంటాయి. దీనికితగ్గట్లే ఓవర్ల కుదింపు ఉంటుంది. ఇప్పుడు ఈ లీగ్ లో పాల్గొనేందుకు ఆరుపైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఈ నెల 18తో మొదటి రౌండ్ బిడ్‌ లకు గడువు ముగిసింది. ఈ ఇంగ్లిష్ టోర్నమెంట్‌ లో వాటా సొంతం చేసుకునే దిశగా మొదటి అడుగు వేశాయి. ఈసీబీ ది హండ్రెడ్‌ లీగ్ లో సీఎస్కే, కేకేఆర్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు మన సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడనుంది. ఇవన్నీ ఐపీఎల్ లో పెద్ద ఫ్రాంచైజీలే కావడం గమనార్హం.

ష్.. గప్ చుప్ ది హండ్రెడ్ లీగ్ కోసం బిడ్‌ లు సమర్పించినప్పటికీ ఫ్రాంచైజీలేవీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, దుబాయ్‌ కి చెందిన కాప్రి గ్లోబల్ యాజమాన్యంలోని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపిఎల్) ఫ్రాంచైజీ యూపీ వారియర్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) కూడా రేసులో చేరినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మాంచెస్టర్ యునైటెడ్ సహ-యజమాని అవ్రమ్ గ్లేజర్ కు చెందిన లాన్సర్ క్యాపిటల్స్, ఐఎల్ టీ 20లో డెసర్ట్ వైపర్స్ జట్టు నిర్వాహకుల రంగప్రవేశంతో హండ్రెడ్ లగ్ బిడ్డింగ్ ప్రక్రియ మరింత ఆకర్షణీయం కానుంది. దీంతోపాటే లీగ్ల ప్రపంచంలో ది హండ్రెడ్ లీగ్ ను హాట్ కేక్ చేస్తోంది.

అనూహ్యం.. ఆర్సీబీ దూరం..

ది హండ్రెడ్ లీగ్ లో ఆర్సీబీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), పంజాబ్ కింగ్స్ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు. బ్రిటిష్ సంస్థ డియాజియో యాజమాన్యంలోని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ విషయంలో ఇది కాస్త ఆసక్తికరమే. ఐపీఎల్ మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కూడా దూరంగానే ఉండనుంది. అయితే, ది హండ్రెడ్ లీగ్ బిడ్డింగ్ తొలి దశలోనే ఉండడంతో ఇవి ఎప్పుడైనా రంగంలోకి దిగుతాయని చెబుతున్నారు. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ యజమానులు సీవీసీ క్యాపిటల్ కు యూకేలో కార్యాలయం ఉంది. దీని ఆపరేషనల్ హెడ్ నిక్ క్లారీ లండన్‌ లోనే ఉంటారు.

ది హండ్రెడ్‌ లీగ్ లో ఐపీఎల్ పవర్‌ హౌస్‌ల ప్రవేశం ఆ టీర్నీని మరింత లాభదాయకం చేస్తుందనడంలో సందేహం లేదు. పైగా మంచి గుర్తింపు కూడా దక్కుతుంది. పోటీని పెంచడానికి కొత్త పెట్టుబడిదారులకు ది హండ్రెడ్‌లోని ప్రతి జట్టులో కనీసం 49% విక్రయించాలని ఇంగ్లండ్ బోర్డు ఆలోచిస్తోంది. పెట్టుబడిదారులు 40-50 మిలియన్ పౌండ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన వాటాను ఇంగ్లండ్ కౌంటీలకు బహుమతిగా ఇవ్వాలని యోచిస్తోంది. ఏదేమైనా వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ మెగా వేలం తర్వాత ది హండ్రెడ్ లీగ్ పై మరింత సమాచారం బయటకు రానుంది.