Begin typing your search above and press return to search.

ఐపీఎల్ మెగా వేలం.. ఫ్రాంచైజీల్లో ఉండేదెవరు? వెళ్లేదెవరు?

దీనికి ముందు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను గురువారంలోగా వెల్లడించాలి.

By:  Tupaki Desk   |   31 Oct 2024 10:15 AM GMT
ఐపీఎల్ మెగా వేలం.. ఫ్రాంచైజీల్లో ఉండేదెవరు? వెళ్లేదెవరు?
X

ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు.. అన్నట్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. 18వ సీజన్ కు రంగం సిద్ధం అవుతోంది. అనేక మార్పులు.. అంతకుమించిన చేర్పులతో వచ్చే సీజన్ ప్రేక్షకులను అలరించనుంది. అన్నిటికిమించి ఈ ఏడాది మెగా వేలం జరగనుంది. దీనికి ముందు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను గురువారంలోగా వెల్లడించాలి. వచ్చే సీజన్ కు విధించిన నిబంధనల ప్రకారం ప్రతి జట్టు గరిష్ఠంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. రైట్‌ టు మ్యాచ్‌ కార్డు ద్వారా మరొకరిని తిరిగి సొంతం చేసుకోవచ్చు. మొత్తం పది ఫ్రాంచైజీల్లో ఎవరెవరిని అట్టి పెట్టుకుంటాయి..? ఎవరిని విడిచిపెడతాయో? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం..

చాంపియన్లు చాంపియన్ ఆటగాళ్లు..

ఐపీఎల్ లో ఐదేసి టైటిల్స్ కొట్టాయి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. మరే జట్లకూ ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఇక చెన్నై అంటే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే. ముంబై అంటే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మనే. 43 ఏళ్లకు దగ్గరైన ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? లేదా? అని మొన్నటివరకు ఊహాగానాలు సాగాయి. తాను వచ్చే సీజన్ లో పాల్గొంటానని ధోనీ వాటికి తెరదించాడు. ఐపీఎల్ మొదలైన దగ్గరనుంచి చెన్నైనే అంటిపెట్టుకుని ఉన్న ధోనీ (మధ్యలో పుణె సూపర్ జెయింట్స్ సహా)ని చెన్నై రిటైన్ చేసుకుంటున్నట్లు తేలింది. మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా, కెప్టెన్ రుతురాజ్, లంక పేసర్ పతిరన, ఆల్ రౌండర్ శివమ్‌ దూబెలనూ కొనసాగించనున్నట్లు సమాచారం. కాన్వేను రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. కాగా, ముంబై గత ఏడాది రోహిత్‌ స్థానంలో ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యను కెప్టెన్ చేయడం విమర్శలకు కారణమైంది. పైగా రోహిత్‌ ను హార్దిక్ అవమానించాడని అభిమానులు మండిపడ్డారు. దీంతో ముంబైని వీడాలంటూ ఈసారి వారినుంచి డిమాండ్లు వచ్చాయి. కానీ, రోహిత్ ముంబైతోనే కొనసాగే అవకాశముంది. అయితే, అది రిటైన్ ద్వారా కాదు.. రైట్‌ టు మ్యాచ్‌ కార్డు ద్వారానట. కెప్టెన్‌ హార్దిక్, బుమ్రా, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్, తిలక్‌ వర్మలను రిటైన్ చేసుకుంటుందని సమాచారం.

పంత్ వెళ్లిపోతున్నాడు..

2022 డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి 2023 సీజన్ కు దూరమయ్యాడు హార్డ్ హిట్టింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్. 2024 సీజన్ కు అతడు నేరుగా ఐపీఎల్ ద్వారా పునరాగమనం చేశాడు. తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారా గత సీజన్ ఆడాడు. కెప్టెన్ అయినప్పటికీ అతడు ఈ సారి ఢిల్లీకి టాటా చెప్పి వేలంలోకి వస్తున్నాడు. ఢిల్లీ జట్టు కుల్‌దీప్‌ యాదవ్, అక్షర్‌ పటేల్, జేక్‌ ఫ్రేజర్, ట్రిస్టన్‌ స్టబ్స్, అభిషేక్‌ పోరెల్‌ లను రిటైన్ చేసుకుంటుందని చెబుతున్నారు.

రాహుల్ బైబై..

మూడు సీజన్లుగా లక్నో సూపర్ జెయింట్స్ ను నడిపిస్తున్నాడు కేఎల్ రాహుల్. కానీ, గత సీజన్ లో అతడికి ఫ్రాంచైజీ ఓనర్ గోయెంకాకు మధ్య జరిగిన వాగ్వాదం అందరూ చూశారు. దీంతో రాహుల్ లక్నోతో కొనసాగడం కష్టమేనని తేలిపోయింది. కానీ, మధ్యలో అతడు గోయెంకాతో భేటీ అయ్యాడు. ఇప్పుడు మాత్రం రాహుల్ కు, లక్నోకు చెల్లుచీటీ ఇచ్చాడని సమాచారం. 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసే పేస్‌ సంచలనం మయాంక్‌ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, పూరన్, స్టాయినిస్, ఆయూష్‌ బదోని, డికాక్‌ లను లక్నో అట్టిపెట్టుకుంటుందట.

సన్ రైజర్స్ లో ఉండేది వీరే?

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ గత సీజన్ లో బ్యాటింగ్‌ రికార్డులు బద్దలు కొట్టింది. దీనికి ప్రధాన కారణం ఓపెనర్లుగా దిగిన అభిషేక్‌ శర్మ- ట్రావిస్‌ హెడ్‌. వీరిద్దరినీ హైదరాబాద్ కచ్చితంగా కొనసాగిస్తుందని సమాచారం. మరో విధ్వంసక బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్‌ కూ ఢోకా లేదట. కెప్టెన్‌ కమిన్స్, తెలుగు యువ ఆల్‌ రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిలను కొనసాగిస్తుందని చెబుతున్నారు. కాగా, సీనియర్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ కోసం రైట్ టు మ్యాచ్ కార్డును వాడేందుకు రాజస్థాన్‌ రాయల్స్‌ సిద్ధమైందట. కెప్టెన్‌ సంజు శాంసన్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, రియాన్‌ పరాగ్, సందీప్‌ శర్మలను అట్టిపెట్టుకుని, స్టార్‌ బ్యాటర్‌ బట్లర్‌ ను వదిలేసి వేలంలోకి రావాలని అనుకుంటున్నట్లు తెలిసింది.

కోహ్లి ఉంటాడు.. మ్యాక్సీని పంపేస్తారు

అసలు ఏమాత్రం రాణించని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రాంరాం పలకడం ఖాయం అని చెబుతున్నారు. అయితే, మొదటినుంచి కొనసాగుతున్న టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్‌ కోహ్లిని ఈ సారి కెప్టెన్ గా చేస్తుందట. హైదరాబాదీ పేసర్ సిరాజ్, ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్‌ గ్రీన్, బ్యాట్స్ మన్ రజత్‌ పటీదార్ ను అట్టిపెట్టుకుంటూనే.. దక్షిణాఫ్రికా బ్యార్ డుప్లెసిస్‌ కు మరో చాన్స్ ఇస్తుందని చెబుతున్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్ లో కెప్టెన్‌ శుభ్‌ మన్‌ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్, పేసర్ మహమ్మద్‌ షమి, మిస్టరీ స్పిన్నర్ రషీద్‌ ఖాన్, హార్డ్ హిట్టర్ డేవిడ్‌ మిల్లర్, ఆల్ రౌండర్ రాహుల్‌ తెవాతియాను అట్టిపెట్టుకుంటుందని తెలుస్తోంది.

డిఫెండింగ్ చాంపియన్ షాకింగ్ నిర్ణయం

గత సీజన్ లో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ను చాంపియన్ గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ ను ఆ ఫ్రాంచైజీ వదిలేస్తుందట. కొనసాగేందుకు అతడు పెద్ద మొత్తం అడగడంతోనే కోల్ కతా యాజమాన్యం ఈ నిర్ణయానికి వచ్చిందట. వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌ ను మాత్రం కొనసాగించే అవకాశం ఉందట. రింకూ సింగ్, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తిలనూ కొనసాగిస్తుందని చెబుతున్నారు.