వికెట్ల వెనుక రక్షకులు..వికెట్ల ముందు హిట్టర్లు.. ఐపీఎల్ లో డిమాండ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ కు రంగం సిద్ధం అవుతోంది.
By: Tupaki Desk | 2 Oct 2024 2:30 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ కు రంగం సిద్ధం అవుతోంది. మూడు రోజుల కిందట రూల్స్ విడుదల చేసింది బీసీసీఐ. ఇందులో అనేక మార్పులు, విశేషాలు కనిపించాయి. ఈ ఏడాది మెగా వేలం నేపథ్యంలో కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టారు. ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు అదనపు ఆకర్షణ కానుంది. ఒకవేళ వేలంలో కొన్నాక అందుబాటులో లేకుంటే రెండేళ్ల బ్యాన్ విధింపు.. ఎంతమందిని రిటైన్ చేసుకోవాలి? ఇలా పలు అంశాలతో ఐపీఎల్ 18 అభిమానులను అలరించేందుకు సిద్ధ అవుతోంది.
ఆరుగురిని అట్టిపెట్టుకుంటే..
వచ్చే సీజన్ కు ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు (రిటైన్) ఐపీఎల్ పాలకవర్గం ఆమోదం తెలిపింది. కానీ, ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం). రిటైన్ చేసుకున్నవారి కోసం రూ.75 కోట్లు ఖర్చుపెట్టాలి. 2022 తర్వాత ఇప్పుడు మెగా వేలం నిర్వహించనున్నారు. రెండేళ్ల కిందట ఒక్కో ఫ్రాంచైజీ నలుగురిని మాత్రమే రిటై చేసుకునే వీలుండేది. అప్పుడే ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చర్చనీయాంశం అయింది. దీనిని వచ్చే సీజన్ లోనూ కొనసాగించనున్నారు.
కీపర్లకు భలే డిమాండ్
ఒకప్పుడు భారత్ లో వికెట్ కీపర్ అంటే కీపింగ్ కు మాత్రమే పరిమితం. కానీ, మహేంద్ర సింగ్ ధోనీ వచ్చాక ఆ అర్థాన్నే మార్చేశాడు. దీంతో వికెట్ కీపర్ అంటే ఇప్పుడు వికెట్ల వెనుక చురుగ్గా ఉండడమే కాదు.. వికెట్ల ముందు హిట్టింగ్ కూడా చేసేవారనే అభిప్రాయం స్థిరపడిపోయింది. ఈ క్రమంలో యువ కీపర్లకు మాంచి డిమాండ్ నెలకొంది. వచ్చేది మెగా వేలం కాబట్టి హిట్టింగ్ చేయగల కీపర్లకు మహర్దశ పట్టనుంది. చెన్నైకి ధోనీ ఎలాగూ ఉండగా.. ముంబై ఇండియన్స్ కు ఇషాన్ కిషన్ చాన్నాళ్లుగా ఆడుతున్నాడు. ధ్రువ్ జురెల్ ఈ మధ్య దూసుకొచ్చిన ధ్రువ తార. కాస్త వయసు ఎక్కువే అయినా జితేశ్ శర్మ మంచి హిట్టర్. గత సీజన్ లో పంజాబ్ కు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ధ్రువ్ రాజస్థాన్ రాయల్స్ వంటి మంచి జట్టులో ఉన్నాడు.
ఎంత ధర పలుకుతారో?
కిషన్ ను ముంబై అట్టిపెట్టుకుంటుంది. ఎందుకంటే వారికి మరో కీపర్ లేడు. 2022లోనే కిషన్ ను రూ.15.25 కోట్లకు దక్కించుకుంది. ధ్రువ్, జితేశ్ లు మెగా వేలంలోకి వస్తే ఎంత ధర పలుకుతారో చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరికి రూ.10 కోట్ల వరకు అయినా దక్కొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషభ్ పంత్ కెప్టెన్. మిగతా జట్లకు కూడా కీపర్ అవసరం ఉంది. అందుకే ధర గట్టిగానే పలకొచ్చు.