Begin typing your search above and press return to search.

10 జట్లు.. 100 మ్యాచ్ లు.. 4 బెర్తులు.. టాప్ టీమ్స్ ఇవే

ఇక ప్లేఆఫ్స్ చేరిన జట్లకూ విలువ ఉంటుంది. ఎంతో పోటీ ఉండే లీగ్ లో.. మెరుగైన జట్లు మాత్రమే టాప్ 4లో నిలిచి ప్లే ఆఫ్స్ చేరతాయి.

By:  Tupaki Desk   |   14 March 2024 4:30 PM GMT
10 జట్లు.. 100 మ్యాచ్ లు.. 4 బెర్తులు.. టాప్ టీమ్స్ ఇవే
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే రూ.50 వేల కోట్లకు పైగా క్యాష్ రిచ్ లీగ్. వేలకోట్ల అడ్వర్టయిజ్ మెంట్లు, వందల కోట్ల విలువైన ఆటగాళ్లు.. మరికొద్ది సీజన్లలోనే లీగ్ రూ.లక్ష కోట్లకు చేరడం ఖాయం. ఇలాంటి లీగ్ లో టైటిల్ విజేతకు ఉండే ప్రాముఖ్యతే వేరు. ఇక ప్లేఆఫ్స్ చేరిన జట్లకూ విలువ ఉంటుంది. ఎంతో పోటీ ఉండే లీగ్ లో.. మెరుగైన జట్లు మాత్రమే టాప్ 4లో నిలిచి ప్లే ఆఫ్స్ చేరతాయి. ఇప్పటివరకు ముగిసిన 16 సీజన్లలో అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ చేరిన జట్లేమిటో చూద్దామా? ఈ నెల 22న చెన్నైలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

లీగ్ కా డాన్ ముంబై..లీగ్ లో అత్యంత విజయవంతమై జట్టు ముంబై ఇండియన్స్. 16 ఎడిషన్లలో 10సార్లు ప్లే ఆఫ్స్‌ చేరింది. ఇందులో ఆరుసార్లు ఫైనల్స్‌ ఆడింది. ఒక్కసారి మాత్రమే (2010-చెన్నై చేతిలో ఓటమి) టైటిల్ అందుకోలేకపోయింది. 2013, 2015, 2017, 2019, 2020లో విజేతగా నిలిచింది. ఇవన్నీ టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ సారథ్యంలో వచ్చినవే. 2011లో మూడో, 2012, 2014, 2023లో నాలుగో స్థానంలో నిలిచింది.

చెన్నై చమక్..ఐపీఎల్‌ లో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఎక్కువసార్లు ప్లే ఆఫ్స్ ఆడిన జట్టు కూడా ఇదే. గమనార్హం ఏమంటే..14 సీజన్లలో మాత్రమే ఐపీఎల్ పాల్గొన్నది చెన్నై. మిగతా రెండు సీజన్లు పుణె సూపర్ జెయింట్స్ గా (2016, 2017) బరిలో దిగింది. ఇక చెన్నై రికార్డుస్థాయిలో 12సార్లు ప్లే ఆఫ్స్‌ వెళ్లింది. 2020, 2022లో మాత్రమే టాప్‌-4లో నిలవలేదు. అంతేకాదు మరే జట్టుకూ సాధ్యం కానంతగా 10 సార్లు ఫైనల్స్‌ ఆడింది. ఐదుసార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఛాంపియన్‌. మరో ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్‌.

టైటిల్ కొట్టకున్నా.. లీగ్ లో విశేష అభిమానులున్న జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. విరాట్ కోహ్లి లాంటి స్టార్ మొదటినుంచి ఈ జట్టుకే ఆడుతున్నాడు. అయినా 16 సీజన్లలో కప్ కొట్టలేకపోయింది. ఇప్పటివరకు బెంగళూరు ఎనిమిదిసార్లు ప్లేఆఫ్స్‌ చేరింది. మూడు సార్లు ఫైనల్స్‌ కూ వెల్లింది. అయితే, 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌, 2011లో సీఎస్కే, 2016లో సన్‌ రైజర్స్‌ చేతిలో ఓడి కప్ చేజార్చుకుంది. 2010, 2015, 2022లో 3వ స్థానం, 2020, 2021లో నాలుగో స్థానంలో నిలిచింది.

కోల్ 'కథ' చాలా పెద్దదే ఐపీఎల్ లో రెండుసార్లు చాంపియన్ నిలిచింది బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కు చెందిన కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్). ముంబై, చెన్నై తర్వాత రెండుసార్లు టైటిల్ కొట్టింది ఈ జట్టే. 16 సీజన్లలో 7 సార్లు ప్లేఆఫ్స్‌ చేరింది. మూడుసార్లు ఫైనల్స్‌ కు వెళ్లింది. ఫైనల్స్ లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌ సారథ్యంలో 2012లో చెన్నై, 2014 పంజాబ్‌ ను ఓడించింది. 2021లోనూ ఫైనల్‌ చేరినా సీఎస్కే చేతిలో ఓడింది. 2017, 2018లో 3వ స్థానం.. 2011, 2016లో నాలుగో స్థానంలో నిలిచింది.

మన హైదరాబాద్ కూ చరిత్ర.. ఎస్ఆర్ హెచ్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 11 సీజన్లలో 6 సార్లు ప్లేఆఫ్స్‌ చేరింది. ఆస్ట్రేలియా విధ్వంక ఆటగాడు డేవిడ్ వార్నర్‌ సారథ్యంలో 2016లో తొలి టైటిల్‌ కొట్టింది. 2018లో న్యూజిలాండ్ స్టార్ విలియమ్సన్‌ కెప్టెన్సీలో ఎస్ఆర్‌హెచ్‌ టేబుల్ టాపర్ గా నిలిచింది. ఫైనల్లో చెన్నై చేతిలో ఓడింది. 2020లో మూడో స్థానం, 2013, 2017, 2019లో నాలుగో స్థానంలో నిలిచింది.

ఢిల్లీకీ దమ్ముంది..ఢిల్లీ క్యాపిటల్స్‌ 16 సీజన్లలో బరిలోకి దిగి ఆరుసార్లు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. 2020లో ఫైనల్‌ కు చేరి ముంబై చేతిలో ఓడింది. 2009, 2012, 2019, 2021లో మూడో స్థానం, 2008లో నాలుగో స్థానంతొ సరిపెట్టుకుంది.

లీగ్ కు తొలి చాంపియన్ రాజస్థాన్‌ రాయల్స్‌. 2016, 17లో నిషేధం ఎదుర్కొంది. మొత్తం 14 సార్లు పాల్గొని ఐదుసార్లు ప్లేఆఫ్స్‌ చేరింది. 2022లో కొత్త జట్లుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు చేరాయి.

అట్టడుగున పంజాబ్..ఐపీఎల్ లో అత్యంత బలహీన జట్టు పంజాబ్ కింగ్స్. 2014లో కేకేఆర్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. తొలి సీజన్ (2008)లో మూడో స్థానం దక్కించుకుంది.