Begin typing your search above and press return to search.

74.. 84.. వచ్చే ఐపీఎల్ లో మ్యాచ్ లు ఎన్ని? ఫ్యాన్స్ కు నిరాశేనా?

ఐపీఎల్ 18వ సీజన్ కు మెగా వేలం జరగనుంది. డిసెంబరులో నిర్వహిస్తారని మొన్నటివరకు భావించగా, ఇప్పుడది నవంబరులోనే అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 10:30 AM GMT
74.. 84.. వచ్చే ఐపీఎల్ లో మ్యాచ్ లు ఎన్ని? ఫ్యాన్స్ కు నిరాశేనా?
X

మార్చి 22 నుంచి మొదలైతే మే 26 వరకు.. అంటే 2 నెలల నాలుగు రోజులు.. ఫైనల్స్, ఎలిమినేటర్, క్వాలిఫయర్ కూడా కలిపితే మొత్తం 74 మ్యాచ్ లు.. ఒక్కటంటే ఒక్కటే రోజు విరామం.. పది జట్లు.. 200 మందిపైగా ఆటగాళ్లు.. లక్షల మంది ప్రేక్షకులు.. టీవీలు, ఓటీటీల్లో కోట్ల మంది వీక్షకులు.. మొత్తం కలిపితే దాదాపు రూ.లక్ష కోట్ల విలువ. ఇంకా అనేక విశేషాలు.. ఇదీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రాక్ రికార్డు. ప్రపంచంలో మరే క్రికెట్ లీగ్ కూ ఇంతటి స్థాయిలో ఆదరణ కానీ.. ఆదాయం కానీ సాధ్యం కాదనేలా రికార్డు. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి.. 18వ సీజన్ కు రంగం సిద్ధం అవుతోంది.

రిటైన్ ఎంతమంది?

ఐపీఎల్ 18వ సీజన్ కు మెగా వేలం జరగనుంది. డిసెంబరులో నిర్వహిస్తారని మొన్నటివరకు భావించగా, ఇప్పుడది నవంబరులోనే అంటున్నారు. ఈ ఏడాది ఫ్రాంచైజీలు ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయనే సందిగ్ధం నెలకొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అయితే ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటారని తెలుస్తోంది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ఈ మధ్యలోనే మ్యాచ్ ల సంఖ్య ఎంత అనే చర్చ మొదలైంది.

మ్యాచ్ లు ఎన్ని?

గత సీజన్ (2024)లో ఐపీఎల్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరిగాయి. 2022 సీజన్ నుంచి కొత్తగా రెండు జట్లు చేరడంతో లీగ్ లో జట్ల సంఖ్య 10కి పెరిగిన సంగతి తెలిసిందే. దీంతోనే మ్యాచ్ ల సంఖ్య 74కు చేరింది. కాగా, వచ్చే సీజన్ నుంచి మ్యాచ్ లను 84కు పెంచాలని గతంలో బీసీసీఐ భావించింది. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా..

ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లలో ఎక్కువ శాతం మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ప్లేయర్లు. మరీ ముఖ్యంగా భారత ఆటగాళ్లు. అలాంటిది ఐపీఎల్ లోనూ మ్యాచ్ ల సంఖ్య పెంచితే పని భారం విపరీతం అవుతుంది. షెడ్యూల్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు 74 మ్యాచ్ ల కు గాను మొన్నటి సీజన్ లో 64 రోజులు షెడ్యూల్. మరో పది మ్యాచ్ లు పెరిగితే 84 అవుతాయి. మరో పది రోజులైనా లేదా ఐదు రోజులైనా షెడ్యూల్ అధికంగా ఉంటుంది. ఇదంతా ఆటగాళ్లను ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే 74 మ్యాచ్ లతో సరిపెట్టాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.