Begin typing your search above and press return to search.

ఐపీఎల్ రిటెన్షన్.. మళ్లీ విదేశీయుడికే అధిక ధర..మరి మనోళ్ల కథేంటి?

ఐపీఎల్ రిటెన్షన్ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ఈసారి వార్తల్లో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన డాషింగ్ బ్యాటర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ కు రూ.23 కోట్లు వెచ్చించింది.

By:  Tupaki Desk   |   1 Nov 2024 9:41 AM GMT
ఐపీఎల్ రిటెన్షన్.. మళ్లీ విదేశీయుడికే అధిక ధర..మరి మనోళ్ల కథేంటి?
X

అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ జాబితాలో అత్యధిక ధర ఎవరికి..? అతగాడు ఎవరు? గత ఏడాది కంటే ఎక్కువ ధరనా..? అనేక ఆసక్తికర అంశాలకు సమాధానం దొరికింది. అయితే, మరోసారి విదేశీ ఆటగాడికే అధిక రేటు పెట్టడం చూసి ఉసూరుమన్నారు. భారతీయ ఆటగాళ్లకు ఆ స్థాయి లేదా? అనే చర్చ మొదలైంది. ఇక ఈ నెల మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. గత ఏడాది మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కు కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ దగ్గర దగ్గరగా రూ.25 కోట్లు పెట్టింది. ఐపీఎల్ వేలంలో ఇప్పటివరకు ఇదే రికార్డు. నిరుడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కు సన్ రైజర్జ హైదరాబాద్ రూ.20 కోట్లు వెచ్చించింది. భారతీయ ఆటగాళ్లెవరూ ఈ దరిదాపుల్లోకి రాలేదు. ఇప్పుడు రిటెన్షన్ లోనూ అదే తరహా కనిపించింది.

ఎస్ఆర్ హెచ్ క్లాసెన్ టాప్

ఐపీఎల్ రిటెన్షన్ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ఈసారి వార్తల్లో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన డాషింగ్ బ్యాటర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ కు రూ.23 కోట్లు వెచ్చించింది. విధ్వంసక ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లకు రూ.14 కోట్లు చొప్పున పెట్టింది. కాగా, ఆటగాడికి అత్యధిక ధర విషయంలో సన్ రైజర్స్ తర్వాత రాయల్ చాలెంజ్ బెంగళూరు (ఆర్సీబీ) ఉంది. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని రూ.21 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఓ భారత ఆటగాడు రూ.20 కోట్ల మార్క్ ను దాటడం ఇదే మొదటిసారి కావడం విశేషం. వీరిద్దరూ కాక రూ.20 కోట్లు దాటింది లక్నో సూపర్ జెయింట్స్ హార్డ్ హిట్టర్ నికొలస్ పూరన్ మాత్రమే. అతడికి కూడా రూ.21 కోట్లు పెట్టింది. పాట్ కమిన్స్ కు నిరుటి కంటే తక్కువగా రూ.18 కోట్లు దక్కాయి. కాగా, ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రూ.18 కోట్లు, స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మను రూ.16.30 కోట్లకు తీసుకుంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యలను రూ.16.35 కోట్ల చొప్పున రిటైన్ చేసుకుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు రూ.8 కోట్లు పెట్టింది.

ఇదీ ఆటగాళ్ల ‘లెక్క’..

చెన్నై రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లకు, రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ సంజూ శాంసన్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ లకు, గుజరాత్ టైటాన్స్ తమ మిస్టరీ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ కు రూ.18 కోట్లు చొప్పున పెట్టాయి. క్లాసెన్, కోహ్లి, పూరన్, కమ్మిన్స్, బుమ్రా తర్వాత వీరే అత్యధిక మొత్తం పొందినవారు. గుజరాత్‌ టైటాన్స్‌ తమ కెప్టెన్ శుబ్ మన్‌ గిల్‌ కు, ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు రూ.16.5 కోట్లు చొప్పున ఇచ్చాయి. రాజస్థాన్ రాయల్స్‌ రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ లకు రూ.14 కోట్లు వంతున వెచ్చిచింది.

వేలంలో ఇంతకుమించి ఉంటుందా?

ఈ నెల మూడో వారంలో జరిగే మెగా వేలంలో రూ.23 కోట్లకు మించి ఏ ఆటగాడికైనా ధర దక్కుతుందా? అంటే ఏమో చెప్పలేం. ఢిల్లీ వదిలేసిన రిషబ్ పంత్ పేరు ముఖ్యంగా వినిపిస్తోంది. కోల్ కతాకు గత ఏడాది టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ కూ మంచి ధర దక్కుతుందేమో? పంత్ కు గాయాల బెడద ఉండగా, అయ్యర్ ఫామ్ గొప్పగా ఏమీ లేదు. దీంతో వీరిపై దాదాపు రూ.25 కోట్లు వేలంలో పెడతారా? అనేది అనుమానం.