ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు.. ఈ జట్లదే ప్లేసు బాసు
ప్రతిభావంతులైన క్రికెటర్లతో ఆడినప్పటికీ ఈ జట్లు చాలాసార్లు లీగ్ దశలోనే వెనుదిరిగాయి.
By: Tupaki Desk | 19 March 2025 4:32 PM ISTమరొక్క రెండు రోజులే.. ఆపై రెండు నెలల 10 రోజులు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మహా సంగ్రామం.. పది జట్లు.. 70 మ్యాచ్ లు.. మరి ఇందులో కీలకమైన ప్లేఆఫ్స్ చేరేది ఎవరు..? లీగ్ దశలో ఎవరెంత పోటీ పడినా.. నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లే కీలకం.. అయితే, ప్లేఆఫ్స్ చేరడం అంటే అంత సులువు కాదు.. ఈ విషయం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ వంటి జట్లకు బాగా తెలుసు. ప్రతిభావంతులైన క్రికెటర్లతో ఆడినప్పటికీ ఈ జట్లు చాలాసార్లు లీగ్ దశలోనే వెనుదిరిగాయి.
మరి రెండు రోజుల్లో మొదలుకానున్న 18వ సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరేదెవరు? ఇది మాత్రం ఎవరూ చెప్పలేం.. ఎందుకంటే.. క్రికెట్ అంటేనే ఊహించలేనిది.. ఐపీఎల్ అంటే అసలే ఊహించలేనిది.. ఇక ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్లేవో తెలుసా..?
17 సీజన్లలో 15 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ గా, రెండుసార్లు పుణె సూపర్ జెయింట్స్ గా ఐపీఎల్ లో తలపడిన జట్టు చెన్నై. 12 సార్లు ప్లేఆఫ్స్ చేరడమే కాదు.. 5 సార్లు టైటిల్ గెలిచింది. 4 సార్లు రన్నరప్ గా నిలిచింది. ఇవన్నీ ధోనీ సారథ్యంలోనే కావడం గమనార్హం. గత ఏడాది విఫలమైనా ఈ సారి ప్లే ఆఫ్స్ చేరే చాన్సుంది.
చెన్నైతో సమానంగా ఐపీఎల్ టైటిల్ ను ఐదుసార్లు నెగ్గిన జట్టు ముంబై ఇండియన్స్. దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఎంతో బలంగా ఎదిగింది. పదిసార్లు ప్లేఆఫ్స్ చేరింది. ఐదు టైటిల్స్ కొట్టింది. మూడు సీజన్లుగా పేలవంగా ఆడుతోంది. గత ఏడాది రోహిత్ శర్మను కాదని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి తీసుకొచ్చి కెప్టెన్ చేసినా ఫలితం లేకపోయింది. ముంబై 2020లో చివరగా టైటిల్ గెలిచింది. 2023 తర్వాత మళ్లీ ప్లేఆఫ్స్ చేరలేదు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. 17 సీజన్లలో ఒక్కసారీ టైటిల్ కొట్టలేదు. కానీ, ప్లేఆఫ్స్ రేసులోకి అత్యధిక సార్లు వచ్చిన మూడో జట్టుగా నిలిచింది. ఆర్సీబీ 9 సార్లు ప్లే ఆఫ్స్ చేరిందంటే నమ్మాల్సిందే. మూడుసార్లు ఫైనల్ కూడా ఆడింది.
దక్కన్ చార్జర్స్ పేరిట రెండో సీజన్ (2009)లోనే ఐపీఎల్ టైటిల కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారాక 2016లో టైటిల్ కొట్టింది. 2016-20 మధ్య వరుసగా ఐదుసార్లు ప్లే ఆఫ్స్ లోకి కూడా వచ్చింది. నిరుడు మరింత దుమ్మురేపింది. ఫైనల్లో అనూహ్యంగా తడబడింది. మొత్తంమీద 9 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది.
పదేళ్ల తర్వాత నిరుడు ఐపీఎల్ చాంపియన్ అయింది కోల్ కతా నైట్ రైడర్స్. 2012, 2014, 2024 ఇలా మూడుసార్లు టైటిల్ కొట్టిన ఈ జట్టు ఇప్పటివరకు 8 సార్లు ప్లేఆఫ్స్ ఆడింది. ముంబై, చెన్నై తర్వాత ఎక్కువసార్లు ట్రోఫీ నెగ్గిన జట్టు కోల్ కతానే.
బెంగళూరులాగే ఐపీఎల్ టైటిల్ కొట్టని జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఆరేళ్ల కిందటే ఢిల్లీ డేర్ డెవిల్స్ నుంచి పేరును క్యాపిటల్స్ గా మార్చుకున్న ఈ జట్టు ఆరుసార్లు టాప్ 4లోకి వచ్చింది. ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది. అది కూడా ముంబై చివరి టైటిల్ అయిన 2020లో.
2008 ప్రారంభ సీజన్ లోనే టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మళ్లీ చాంపియన్ గా నిలవలేకపోయింది. ఐదుసార్లు ప్లేఆఫ్స్ ఆడింది. గత సీజన్ లో టాప్ 4 లోకి చేరినా నిరాశపరిచింది.
2022లో మూడేళ్ల కిందట లీగ్ లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ వెంటనే టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. 2023లోనూ ఫైనల్ చేరింది. నిరుడు ప్లేఆఫ్స్ బెర్తును అందుకోలేకపోయింది.
గుజరాత్ తో పాటే వచ్చిన మరో కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ మూడు సీజన్లలో రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. కానీ చాంపియన్ కాలేదు.
అసలు ఐపీఎల్ మొత్తం చరిత్రలో టైటిల్ కొట్టలేకపోవడమే కాదు.. అత్యంత పేలవ ప్రదర్శన చేసే జట్టుగా పేరున్న పంజాబ్ కింగ్స్ రెండుసార్లే ప్లేఆఫ్స్ చేరింది.