Begin typing your search above and press return to search.

ఐపీఎల్ ఫైనల్.. సమఉజ్జీల మధ్యలో "వర్షం" మ్యాచ్?

వాన ముప్పు.. కానీ, ప్రస్తుతం తీవ్ర వేసవి కాలం అయినప్పటికీ.. దక్షిణాదిలో అనూహ్యంగా వర్షాలు పడుతున్నాయి.

By:  Tupaki Desk   |   26 May 2024 7:15 AM GMT
ఐపీఎల్ ఫైనల్.. సమఉజ్జీల మధ్యలో వర్షం మ్యాచ్?
X

ఎప్పుడో మార్చి 22న మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్.. రెండు నెలల 4 రోజులు సాగి ఈ మే 26తో ముగింపునకు వచ్చింది. ఆదివారం చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా జరగనున్న ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ బలాబలాల్లో సమఉజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీ పోరాటం ఖాయం. అయితే, గణాంకాలు, పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడం ప్రకారం చూస్తే కోల్ కతాకే కాస్త ఎక్కువ అవకాశాలున్నాయి. వీటి మధ్య మరో కీలక అంశం కూడా ఉంది. అదే వర్షం.

సముద్ర తీరం చెన్నైలో.. చెన్నై అంటే మనందరికీ తెలిసిందే. సముద్ర తీర నగరం. ఇక్కడ వేసవిలో ఉక్కపోత మరీ ఎక్కువ. అలాంటి నగరంలో ఆదివారం ఫైనల్స్ జరగనుంది. సహజంగా చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. దీనికి మంచు తోడైతే స్పిన్నర్లు చెలరేగిపోతారు. బంతి బ్యాట్ మీదకు ఆలస్యంగా వస్తుంది. చేజింగ్ మరీ కష్టం. అయితే, శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ లో రాజస్థాన్ రాయల్స్ – సన్ రైజర్స్ మ్యాచ్ లో ఇదేమీ కనిపించలేదు. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో పిచ్ ఎలా ఉంటుందో చూడాలి.

వాన ముప్పు.. కానీ, ప్రస్తుతం తీవ్ర వేసవి కాలం అయినప్పటికీ.. దక్షిణాదిలో అనూహ్యంగా వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-17 తుది సమరానికి వర్షం ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఆదివారం రాత్రి జల్లుల వర్షం పడొచ్చని అంచనా. కానీ, ఇది మ్యాచ్‌ను తుడిచిపెట్టేంతగా ఏమీ ఉండదని చెబుతున్నారు. అంటే.. కాస్త విరామం ఇచ్చినా, పూర్తి స్థాయిలో మ్యాచ్ జరుగుతుంది. ఓవర్ల తగ్గింపు కానీ, టార్గెట్ కుదించాల్సిన పరిస్థితులు కానీ తలెత్తే అవకాశం లేదు. మరోవైపు వర్షంతో ఆదివారం మ్యాచ్ ఆగినా.. ఫైనల్ కు సోమవారం రిజర్వ్‌ డే ఉంది. సోమవారం కూడా వర్షంతో రద్దయితే.. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాపర్ గా నిలిచిన జట్టుకు టైటిల్ దక్కుతుంది. అంటే.. సన్ రైజర్స్ కు నిరాశే మిగులుతుంది. కానీ, దీనికి ఆస్కారం చాలా తక్కువ.

కొసమెరుపు: సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ గా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ గిల్ క్రిస్ట్ సారథ్యంలో 2009లో తొలిసారి ఐపీఎల్ టైటిల్ కొట్టింది. 2016లో మరోసారి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో చాంపియన్ గా నిలిచింది. మళ్లీ నేడు ఆస్ట్రేలియన్ కమ్మిన్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక కోల్ కతా 2012, 2014లో టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు టైటిల్ కొట్టింది. గంభీర్ ఆ జట్టు మెంటార్ గా తిరిగొచ్చాక ప్రస్తుతం ఫైనల్ చేరింది.