Begin typing your search above and press return to search.

క్యాష్ రిచ్ ఇండియన్ లీగ్.. క్రికెటర్లకు లాభమా? నష్టమా?

కానీ, ఐపీఎల్ 17 సీజన్ ముగిసేసరికి అతడి విధ్వంసం ఏమిటో తెలిసొచ్చింది.

By:  Tupaki Desk   |   28 May 2024 1:30 AM GMT
క్యాష్ రిచ్ ఇండియన్ లీగ్.. క్రికెటర్లకు లాభమా? నష్టమా?
X

ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్.. మెరుపు బ్యాటింగ్ చేయగల 22 ఏళ్ల ఈ బక్కపల్చటి కుర్రాడి మీద మొన్నటివరకు పెద్దగా అంచనాలు లేవు. కానీ, ఐపీఎల్ 17 సీజన్ ముగిసేసరికి అతడి విధ్వంసం ఏమిటో తెలిసొచ్చింది.

దక్షిణాఫ్రికాకు చెందిన ట్రిస్టన్ స్టబ్స్.. ఏ స్థాయిలో చెలరేగుతాడో ఇప్పటివరకు పెద్దగా ఎవరూ చూసి ఉండరు. కానీ, ఐపీఎల్ 17తో అతడి సత్తా అందరికీ అర్థమైంది.

వీరిద్దరే కాదు.. విదేశాలకు పలువురు ఆటగాళ్లను ఐపీఎల్ వెలుగులోకి తెచ్చింది. గతంలో చూస్తే పలువురు ఎమర్జింగ్ ఆటగాళ్లు ఐపీఎల్ అనంతరమే వారి జాతీయ జట్లకు సెలక్టయ్యారు. ఫామ్ కోల్పోయిన సీనియర్లకూ ఐపీఎల్ మంచి వేదిక. తిరిగి లయ అందుకోవడానికి వారు ఈ లీగ్ ను ఓ మంచి అవకాశంగా మలుచుకున్నారు.

అయితే.. ఐపీఎల్ మీద ఉన్న పెద్ద నింద ఏమంటే.. ఈ లీగ్ తమ క్రికెట్ ను నాశనం చేస్తోందని వివిధ దేశాల బోర్డులు మండిపడుతున్నాయి. డబ్బు రూ.కోట్లలో వస్తుండడంతో ఆటగాళ్లు సొంత దేశాల కంటే ఈ లీగ్ కే ప్రాధాన్యం ఇవ్వసాగారు. మన పొరుగునే ఉండే శ్రీలంక కూడా ఇలానే నిందించింది. ఇందులో కొంత వాస్తవం ఉన్నా పూర్తిగా మాత్రం లీగ్ దే తప్పు కాదు. ఎందుకంటే.. ఐపీఎల్ జరిగే సమయంలో ఇతర దేశాల్లో గతంలో టోర్నీలే లేవు. అంటే.. వారు ఖాళీగా ఉన్న (ఉండే) సమయంలోనే ఐపీఎల్ జరుగుతోంది. అలాంటప్పుడు మన లీగ్ కు తగినట్లుగా వారు షెడ్యూల్ వేసుకుంటే సమస్య ఉండదు కదా.?

ఆర్థికంగా మహా దన్ను..

ఎవరెన్ని చెప్పినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పారితోషికం పరంగా అత్యంత ముందంజలో ఉంది. వారి దేశాలకు సంవత్సరం అంతా ఆడినా రాని డబ్బును రెండు నెలల్లోనే ఇస్తోంది. ఉదాహరణకు కాంట్రాక్టులో ఉన్న ఒక ఆస్ట్రేలియా క్రికెటర్ కు ఏడాదికి మూడు నుంచి నాలుగు కోట్లు వస్తాయనుకుంటే.. దానికి 5 రెట్లు (రూ.25 కోట్లు) పొందాడు పేసర్ మిచెల్ స్టార్క్. కమ్మిన్స్ కూడా నాలుగురెట్లు డబ్బు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ క్రికెటర్లకూ ఇదే తరహాలో డబ్బు అందింది.

ప్రతిభ బయటపడేది ఇక్కడే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు.. ప్రతిభను వెలికితీసే వేదిక. ఒక్క టీమిండియానే తీసుకుంటే.. ఇప్పుడు ఆడుతున్ సగంమంది క్రికెటర్లు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. ఒత్తిడిని తట్టుకుంటూ రాణించిన వీరంతా మేటి ఆటగాళ్లుగా ఎదిగారు. అయితే, మంచి వెనుక చెడు ఉన్నట్లు గాయాల బారినపడడం ఈ లీగ్ లో ప్రధాన సమస్య. క్రికెటర్ కు గాయాలు అనేది సహజం. కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.