అమ్మో.. అమ్మాయి.. అద్భుతం.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ
మరే భారత ఆటగాడికీ ట్రిపుల్ సాధ్యం కాలేదు. కానీ వన్డేల్లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టేసింది ముంబై కుర్రది. ఏ స్థాయిలోనైనా భారత క్రికెట్ లో ఇది రికార్డు కావడం విశేషం.
By: Tupaki Desk | 12 Jan 2025 9:30 PM GMTటి20ల్లో సెంచరీ.. వన్డేల్లో డబుల్ సెంచరీ.. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ.. కాస్త కష్టమైన స్కోర్లివి... వీటిని అందుకుంటే ఆ బ్యాట్స్ మన్ ను మంచి ప్లేయర్ గా గుర్తిస్తారు. ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ కొడితే మేటి బ్యాట్స్ మన్ గా పరిగణిస్తారు.. అంతర్జాతీయ క్రికెట్లో ఈ రికార్డును అందుకున్నది అతికొద్దిమందే. వన్డేల్లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడుసార్లు డబుల్ సెంచరీ బాదేశాడు. మరికొందరూ డబుల్ ను అందుకున్నారు. కానీ, వన్డే ఏకంగా ట్రిపుల్ సెంచరీ కొట్టడం అంటే... అది కూడా మహిళల క్రికెట్ లో అయితే..? ఇప్పటిదాకా అసాధ్యం అనుకున్నారు.
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్లే ఇద్దరు. ఒకరు వీరేంద్ర సెహ్వాగ్ (రెండుసార్లు), మరొకరు కరుణ్ నాయర్. మరే భారత ఆటగాడికీ ట్రిపుల్ సాధ్యం కాలేదు. కానీ వన్డేల్లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టేసింది ముంబై కుర్రది. ఏ స్థాయిలోనైనా భారత క్రికెట్ లో ఇది రికార్డు కావడం విశేషం.
ముంబై మెరిక..
ఇరా జాదవ్.. నిన్నటివరకు ఎవరికీ తెలియని పేరు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ, ఇప్పుడు ఆమె మీడియాలో హెడ్ లైన్ కావడం ఖాయం. ఎందుకంటే ఇరా సృష్టించిన సంచలనం అలాంటిది మరి. అండర్-19 ముంబై జట్టు తరఫున ఆడుతూ.. 14 ఏళ్ల ఇరా ఆదివారం మేఘాలయతో జరిగిన మ్యాచ్ లో 157 బంతుల్లోనే 346 పరుగులు చేసింది. ఇందులో 42 ఫోర్లు, 16 సిక్సర్లు ఉండడం గమనార్హం. ఇరా ట్రిపుల్ తో పాటు ముంబై కెప్టెన్ హుర్లే గాలా (116) సెంచరీతో ముంబై 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లను కోల్పోయి 563 పరుగులు చేసింది.
ప్రత్యర్థి 19 కే ఆలౌట్..
ముంబై 563 పరుగులు భారీ స్కోరు చేస్తే.. ప్రత్యర్థి మేఘాలయ అత్యంత దారుణంగా 19 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ముంబై 544 పరుగుల భారీ తేడాతో గెలిచింది. పైగా మేఘాలయ బ్యాట్స్ మెన్ లో ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఇంకో విషయం ఏమంటే.. ముంబై బౌలర్ల ఎక్స్ ట్రాలు 1 0. ఇవే ముంబై ఇన్నింగ్స్ లో టాప్.
కొసమెరుపు: ఇరా వయసు 14 ఏళ్లే. ఇంకా బాలికే అన్నమాట. ఇటీవలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఈమెను ఎవరూ కొనలేదు.