46 ఆలౌట్..భారత్ పరువు గంగపాలు..92 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి
అయితే, సొంత గడ్డపై మాత్రం మన జట్టు ఎప్పుడూ ఇంతటి పేలవ ప్రదర్శన చేయలేదు.
By: Tupaki Desk | 17 Oct 2024 9:21 AM GMTబ్యాటింగ్ కు స్వర్గ ధామం అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమ్ ఇండియా బోల్తాకొట్టింది. టెస్టులో బెస్ట్ బ్యాట్స్ మన్ సహా జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు డకౌట్ గా వెనుదిరిగారు. దాదాపు నాలుగేళ్ల కిందట ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌటైంది. మొత్తమ్మీద టెస్టుల్లో మన జట్టుకు అదే అత్యల్ప స్కోరు. అయితే, సొంత గడ్డపై మాత్రం మన జట్టు ఎప్పుడూ ఇంతటి పేలవ ప్రదర్శన చేయలేదు.
టాస్ గెలిచి..
బెంగళూరులో టెస్టు మ్యాచ్ అంటే పరుగుల పండుగే అభిమానులు అనుకున్నారు. కానీ, తీరా పరిస్థితి చూస్తే 50 కి కూడా దాటలేదు. అది వ్యక్తిగతంగా కాదు జట్టు స్కోరులో. బుధవారం ప్రారంభం కావాల్సిన టెస్టు మ్యాచ్ వర్షంతో రోజంతా తుడిచిపెట్టుకుపోయింది. గురువారం రెండో రోజు మ్యాచ్ మొదలవుతూనే వికెట్లు టపాటపా పడ్డాయి. విరాట్ కోహ్లి సహా ఐదుగురు ఆటగాళ్లు ఖాతానే తెరవలేదు. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ 31.2 ఓవర్లలోనే ముగిసింది. కేవలం 46 పరుగులకే ఆలౌటైంది.
ఇద్దరే రెండంకెల స్కోరర్లు..
ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (13), వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ (20) మాత్రమే జట్టులో డబుల్ డిజిట్ దాటారు. న్యూజిలాండ్ పేస్ బౌలర్
మ్యాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టాడు. ఓరౌర్కీ నాలుగు వికెట్లు తీశాడు. కాగా, భారత్ టెస్టుల్లో సొంతగడ్డపై చేసిన అత్యంత స్వల్ప స్కోరు (46) ఇదే. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో దారుణ ప్రదర్శన చేయలేదు. 1987లో వెస్టిండీస్ పై 75 పరుగులకు ఆలౌటైంది. అదే ఇప్పటివరకు మన జట్టు స్వదేశంలో చేసిన అత్యల్ప స్కోరు.
టెస్టు చేజారినట్లేనా?
టెస్టు చాంపియన్ షిప్ లో ప్రస్తుత మ్యాచ్ సహా 8 టెస్టులు ఆడాల్సి ఉన్న టీమ్ ఇండియాకు ఫైనల్ చేరేందుకు సవాల్ ఎదురవుతోంది. బెంగళూరు టెస్టులో మన జట్టు బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్ చేజారే ప్రమాదం కనిపిస్తోంది. న్యూజిలాండ్ చకచకా పరుగులు చేస్తోంది. 250 పరుగులు చేసినా వారికి 200 పరుగుల ఆధిక్యం లభిస్తుంది. అంటే.. రెండో ఇన్నింగ్స్ లో భారత్ అత్యంత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. లేదంటే టెస్టులో పరాజయం తప్పదు. కనీసం డ్రాం చేసుకునేందుకు అయినా.. ఇంకా మూడున్నర రోజుల పాటు పోరాడాలి.