Begin typing your search above and press return to search.

హ్యాపీ రిటైర్మెంట్ రో..కో..ట్రెండింగ్ లో టీమ్ ఇండియా స్టార్లు

మరొక్క 13 ఓవర్లు.. క్రీజులో గడిపి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది.. కానీ, టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో మ్యాచ్ చేజారింది.

By:  Tupaki Desk   |   30 Dec 2024 7:19 AM GMT
హ్యాపీ రిటైర్మెంట్ రో..కో..ట్రెండింగ్ లో టీమ్ ఇండియా స్టార్లు
X

మరొక్క 13 ఓవర్లు.. క్రీజులో గడిపి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది.. కానీ, టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో మ్యాచ్ చేజారింది.

స్టార్ బ్యాట్స్ మన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడింది 40 బంతులు.. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆడింది 29 బంతులు.. స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడింది 45 బంతులు. అంటే.. కోహ్లి, రోహిత్ కంటే అధికం.

దీనినిబట్టే చెప్పొచ్చు రోహిత్, కోహ్లిల ప్రస్తుత ఫామ్ ఏమిటో..? బోర్డర్- గావస్కర్ సిరీస్ లో భాగంగా మెల్ బోర్న్ లో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ ఇండియా 184 పరుగులతో పరాజయం పాలవడంతో వీరిద్దరి భవిష్యత్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తొలి ఇన్నింగ్స్ లోనూ రోహిత్ చేసింది 3 పరుగులు కాగా.. కోహ్లి కొట్టింది 36. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ 9, కోహ్లి 5 పరుగులకు ఔటయ్యారు. వీరిద్దరూ క్రీజులో కాసేపు ఉన్నా మ్యాచ్ కచ్చితంగా డ్రా అయ్యేది. కానీ, అలా జరగలేదు.

దీంతోనే వీరిద్దరి టెస్టు కెరీర్ ముగిసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్టులో ఇద్దరూ అత్యంత పేలవమైన ప్రదర్శన చేయడంతో అభిమానులు మండిపడుతున్నారు. హ్యాపీ రిటైర్మెంట్ రో.. (రోహిత్).. కో.. (కోహ్లి) అని ట్రెండింగ్ చేస్తున్నారు.

టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఏదైనా సరే అతడే నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. టాప్‌ ఆర్డర్‌ లో ఆడే రోహిత్ ఫుట్‌ వర్క్‌ మెరుగ్గా లేదంటున్నాడు. పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతుండడాన్ని బట్టి చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించాచడు. ఆస్ట్రేలియా సిరీస్‌ ముగిశాక ఏదొక నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటున్నట్లు చెప్పాడు.

ఫిట్ నెస్ రీత్యా కోహ్లి మరో మూడేళ్లు ఆడే అవకాశం ఉందంటున్నాడు. కానీ, కోహ్లి కొన్నాళ్లుగా అసలు ఫామ్ లో లేడు. ఆస్ట్రేలియా సిరీస్ లో తొలి టెస్టులో సెంచరీ చేసినా అది పరిస్థితులు సాఫీగా ఉన్నప్పుడు సాధించినది. ఇక మెల్ బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో తన బలహీనత అయిన ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్తున్న బంతిని వెంటాడి ఔటయ్యాడు. దీంతోనే కోహ్లి కూడా రిటైర్ కావాలనే డిమాండ్లు వస్తున్నాయి.