Begin typing your search above and press return to search.

ఏడాదికి వచ్చాడు..వికెట్లు తీశాడు..ఆస్ట్రేలియా ఫ్లైటెక్కుతున్నాడు

ఇప్పుడు రెండు రోజుల కిందట తిరిగొచ్చిన అతడు వికెట్లు తీశాడు.

By:  Tupaki Desk   |   15 Nov 2024 12:35 PM GMT
ఏడాదికి వచ్చాడు..వికెట్లు తీశాడు..ఆస్ట్రేలియా ఫ్లైటెక్కుతున్నాడు
X

భారత్ వేదికగా నిరుడు సరిగ్గా ఇదే రోజుల్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో అతడు దుమ్మురేపాడు.. బంతి పట్టాడంటే వికెట్.. ఓవర్ ఓవర్ కు బచ్ గయా అంటూ బ్యాట్స్ మెన్ ఊపిరిపీల్చుకున్నారు.. రెండు మ్యాచ్ లు ఆలస్యంగా వచ్చినా తన సత్తా ఏమిటో చూపాడు. సెమీఫైనల్లో ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. దీంతోనే అతడి పేరు మార్మోగింది. కానీ, అనూహ్యంగా గాయానికి గురయ్యాడు. నిరుడు నవంబరు 19 తర్వాత మళ్లీ మైదానంలోకి దిగలేదు. ఇప్పుడు రెండు రోజుల కిందట తిరిగొచ్చిన అతడు వికెట్లు తీశాడు. టీమ్ ఇండియాను ఆదుకునేందుకు వెళ్తున్నాడు.

తమ్ముడితో ఆడి..

టీమ్ ఇండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ప్రస్తుతం బెంగాల్ తరఫున మధ్యప్రదేశ్ తో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో మధ్యప్రదేశ్ నాలుగు వికెట్ల తీశాడు. దీంతో ఫిట్ నెస్ నిరూపించుకున్నాడు. గత ఏడాది ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత షమీ మోకాలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. సరిగ్గా ఏడాది అనంతరం మైదానంలో అడుగుపెట్టాడు. నాలుగు వికెట్లు పడగొట్టడంతో అతడి ఫిట్ నెస్ పై అనుమానాలు తొలగాయి. ఈ మ్యాచ్ లో తమ్ముడు మొహమ్మద్ కైఫ్ తో కలిసి ఆడిన షమీ అతడి కంటే మెరుగ్గా రాణించాడు.

మునుపటి షమీ..

మధ్యప్రదేశ్ తో మ్యాచ్‌ లో షమీ మునుపటిలానే కనిపించాడు. ఎక్కడా ఇబ్బంది పడలేదు. తొలి రోజు వికెట్లు తీయకున్నా రెండో రోజు 9 ఓవర్లు మాత్రమే వేసిన వాటిలో 20 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడిని ఆస్ట్రేలియాకు పంపించాలని సెలక్షన్ కమిటీ భావిస్తోందట. అయితే, రంజీ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌ వరకు నిరీక్షించనుందట. షమీ ఫిట్‌ నెస్ ఎలా ఉంది? మ్యాచ్‌ ముగిసే సమయానికి ఏదైనా వాపు లేదా నొప్పి ఉందా? అనేది చూడనుంది. ఏ ఇబ్బందీ లేకుంటే షమీని ఈ నెల 22న మొదలయ్యే తొలి టెస్టుకు ముందే ఆస్ట్రేలియాకు పంపనుంది. అక్కడ ప్రైమ్‌ మినిస్టర్స్‌-XIతో రెండు రోజుల డే/నైట్ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడించనుంది. కాగా, మధ్యప్రదేశ్ తో మ్యాచ్ లో షమీని సెలక్షన్‌ కమిటీ సభ్యుడు అజయ్ రాత్రా, ఎన్‌సీఏ మెడికల్ టీమ్ హెడ్ నితిన్ పటేల్‌ పరిశించారు. వీరి ఫీడ్‌ బ్యాక్‌ ను బట్టి చీఫ్‌ సెలక్టర్ అజిత్ అగార్కర్‌, కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌ కోచ్‌ గౌతమ్ గంభీర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.