Begin typing your search above and press return to search.

భారత్ లో 2036 ఒలింపిక్స్.. ఖర్చు 2 లక్షల కోట్లు.. అసలు సాధ్యమా?

దీంతో నాలుగేళ్ల తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ఒలింపిక్స్ పై ఆశలు పెట్టుకుంది.

By:  Tupaki Desk   |   15 Aug 2024 12:30 PM GMT
భారత్ లో 2036 ఒలింపిక్స్.. ఖర్చు 2 లక్షల కోట్లు.. అసలు సాధ్యమా?
X

అత్యంత ఆడంబరంగా.. అంతకుమించిన పోటాపోటీగా.. సకల క్రీగల సమాహారంగా మొన్ననే పారిస్ లో ఒలింపిక్స్ ముగిశాయి.. నిర్వహణలో చిన్నచిన్న విమర్శలు వచ్చినా.. సౌకర్యాలపరంగా ఇబ్బందులు తలెత్తినా.. ఇంత పెద్ద క్రీడా సంరంభంలో అవి చాలా చిన్నవి. ఇక ఈ క్రీడల్లో భారత్ ఆరంటే ఆరే పతకాలతో సాదాసీదా ప్రదర్శన చేసింది. దీంతో నాలుగేళ్ల తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ఒలింపిక్స్ పై ఆశలు పెట్టుకుంది.

పారిస్ ఖర్చు లక్ష కోట్లు..

32 క్రీడాంశాల్లో నిర్వహించిన పారిస్‌ ఒలింపిక్స్‌ కు ఖర్చు సుమారు 10 బిలియన్‌ డాలర్లు అయింది. భారత కరెన్సీలో దాదాపు రూ.85 వేల కోట్లు అన్న మాట. అయితే, ఇది 2021 నాటి టోక్యో ఒలింపిక్స్‌ వ్యయం కంటే తక్కువే. 2020లో జరగాల్సిన ఈ ఒలింపిక్స్ కు.. కరోనా కారణంగా కొన్ని ప్రత్యేక, పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. దీంతో జపాన్‌ రూ.లక్ష కోట్ల పైనే ఖర్చు చేసింది. పారిస్ లో మాత్రం ఖర్చు తగ్గించే క్రమోంలో ఆదా మార్గాలను అన్వేషించారు. అయినా రూ.85 వేలకోట్లు అయింది.

భారత్ కూడా పోటీలో..

2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2032 ఒలింపిక్స్ ను నిర్వహించేంది ఎక్కడ..? దీనికి సమాధానం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం. వాస్తవానికి 2024 ఒలింపిక్స్ కూ లాస్ ఏంజెల్స్ పోటీ పడింది. కానీ, పారిస్ కు అవకాశం దక్కింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ 2000 సంవత్సరంలో ఒలింపిక్స్ నిర్వహించింది. 1956లో మెల్ బోర్న్ లో విశ్వ క్రీడలు జరిగాయి. కాగా, 2032లో బ్రిస్బేన్ వేదిక కానుంది. 2036లో జరిగే ఒలింపిక్స్ కు భారత్ పోటీ పడుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ

మరోసారి స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో మోదీ ఉద్ఘాటించారు. పారిస్‌ ఒలింపిక్స్‌ లో పోటీ పడిన అథ్లెట్లకు ధైర్యం చెబుతూనే.. పారాలింపిక్స్‌ కు వెళ్లే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో తొలిసారి జీ 20 సమ్మిట్‌ ను దిగ్విజయంగా నిర్వహించామని.. భారీ ఈవెంట్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించగలమని చాటామని తెలిపారు. ఒలింపిక్స్‌ కు ఆతిథ్యం భారత్‌ కల అని.. 2036లో ఈ క్రీడలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం అని స్పష్టం చేశారు.

ఏడెనిమిదేళ్ల ముందే..

ఒలింపిక్స్ అంటే మామూలు మాటలు కాదు. పారిస్ కు రూ.లక్ష కోట్లు అయిందంటే.. 12 ఏళ్ల తర్వాత నిర్వహించే పోటీలకు రూ.2 లక్షల కోట్లు కావడం ఖాయం. ఇంకా ఎక్కువే అయినా ఆశ్చర్యం లేదు. తక్కువ అనుకుంటే.. లక్షన్నర కోట్లు అయినా కాకుండా ఉండదు. ఇక ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం ఏడెనిమిదేళ్ల ముందే పోటీ పడాలి. అంటే.. 2028-29 నుంచే రంగంలోకి దిగాలి. ఈ మేరకు బిడ్డింగ్ లో పాల్గొనాలి. పారిస్ కు బిడ్డింగ్ 2017 సెప్టెంబరులోనే ఖరారైన సంగతిని ఇక్కడ గుర్తుంచుకోవాలి.

140 ఏళ్ల తర్వాత నిర్వహణకు పోటీనా..?

భారత్ ఒలింపిక్స్ పతకాల్లోనే కాదు.. నిర్వహణలోనూ పూర్తిగా వెనుకబడే ఉందని చెప్పాలి. మన దేశంలో సగం కూడా కాదు.. మన తెలంగాణ అంత విస్తీర్ణం కూడా లేని దేశాలు ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వహించాయి. కాగా, తొలి ఆధునిక ఒలింపిక్స్ 1896లో గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో జరిగాయి. భారత్ 2036లో నిర్వహణకు పోటీపడుతోంది. అంటే.. ఒలింపిక్స్ మొదలైన 140 ఏళ్ల తర్వాత మన దేశం రేసులో నిలిచింది. అయితే, ఇప్పటికి ఇది ప్రతిపాదన మాత్రమే. కచ్చితంగా నిర్వహణకు మనకే దక్కుతుందన్న నమ్మకం లేదు. బిడ్ లో పోటీ పడి గెలవాల్సి ఉంటుంది. మనతో పోటీ పడే నగరాలను ఓడించాల్సి ఉంటుంది.