వినేశ్ ఫోగాట్ క్రీడా రాజకీయాలకు బలయ్యారా?.. కోచ్ కీలక వ్యాఖ్యలు!
100 గ్రాముల అదనపు బరువు కారణాన్ని చూపెడుతూ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో ఆమె కోచ్ కృపా శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 9 Aug 2024 5:23 PM GMTప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారత రెజ్లర్ నినేశ్ ఫోగాట్ గురించి చర్చే జరుగుతుందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆమె పేరు ట్రెండింగ్ లో ఉంది. ఈ సమయలో ఆమె రజత పతక రిక్వస్ట్ పై "కాస్" ఎలా రియాక్ట్ అవుతాదనే విషయంపైనే అందరి చూపూ ఉంది. ఈ సమయంలో వినేశ్ ఫోగాట్ క్రీడా రాజకీయాలకు బలయ్యారా అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ప్రస్తుతం వినేశ్ ఫోగాట్ అనే పేరు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. పారిస్ ఒలింపిక్స్ లో పతకం ఖాయమైన సమయంలో అనర్హత వేటుకు గురైన ఆమె.. చివరికి రెజ్లింగ్ కు వీడ్కోలు పలికింది. 100 గ్రాముల అదనపు బరువు కారణాన్ని చూపెడుతూ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో ఆమె కోచ్ కృపా శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా స్టార్ రెజ్లర్ వినేశ్ అనర్హతకు కారణం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూ.ఎఫ్.ఐ) తీరే కారణమని ఆరోపించారు. బరువు విషయంలో ఇలాంటి పరిస్థితిని ఆమె గతంలో ఎదుర్కోలేదని అన్నారు. కాకపోతే స్వల్ప వ్యవధిలో రెండు సార్లు బరువును తూచుకోవాల్సిన అవసరంపై తాను గతంలో చేసిన సూచనలను భారత రెజ్లింగ్ సమాఖ్య పెడచివిన పెట్టిందని తెలిపారు.
ఇదే సమయంలో... డొమెస్టిక్ లోనైనా రెజ్లర్లకు అప్పుడప్పుడూ ఇలాంటివి అమలు చేసి ఉండాల్సిందని వెల్లడించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సగం సగం రూల్స్ తో నడపొద్దని చెప్పినందుకు తనను అర్రేళ్ల పాటు భారత రెజ్లింగ్ సమాఖ్య సస్పెండ్ చేసిందని వెల్లడించారు. ఒక్క రోజులో బరువును తగ్గించుకోవడం చాలా కష్టమని.. దానికి ఎంతో ప్రాక్టీస్ అవసరమని.. అందుకే రెజ్లర్ల కోసం సరైన వ్యవస్థను అమలుచేయాలని అన్నారు.
అయితే చూడటానికి ఇది చాలా మందికి చాలా చిన్న విషయంగా కనిపించినా... నేడు దేశానికి పతకం చేజారెందుకు కారణమైందని శంకర్ వ్యాఖ్యానించారు. దీంతో.. ఈయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూ.ఎఫ్.ఐ.), దాని అధ్యక్షుడు సంజయ్ సింగ్ పై వినేశ్ సంచలన ఆరోపణలు చేశారు. డబ్ల్యూ.ఎఫ్.ఐ. ప్రాక్సీ నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు! ఈ సందర్భంగా స్పందించిన ఆమె తరుపు లాయర్ రాహుల్ మెహ్రా... డబ్ల్యూ.ఎఫ్.ఐ. అధికారులు ఆమె విషయంలో వ్యవహరించిన వైఖరిని వెల్లడించారు!
గత ఏడాది డిసెంబర్ లో డబ్ల్యూ.ఎఫ్.ఐ.కి నిర్వహించిన ఎన్నికలు చట్టవ్యతిరేకమని, స్పోర్ట్స్ కోడ్ ను పాటించనందున కమిటీని పక్కనపెట్టాలంటూ రెజ్లర్లు బహరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ సహా పలువురు ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. డబ్ల్యూ.ఎఫ్.ఐ. నిర్వహించే కార్యకలాపాలపై స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్ పై మే 24న తీర్పు కోసం రిజర్వ్ చేయబడినప్పటికీ.. ఇప్పటికీ తీర్పు వెలువడలేదు.
ఈ నేపథ్యంలో... ఈ పిటిషన్ పై తీర్పు వెల్లడించేందుకు తేదీని ప్రకటించాలని వినేశ్ తో పాటు వారి కౌన్సిల్ జస్టిస్ సచిన్ దత్తాను అభ్యర్థించారు. ఆమె ఇప్పుడు బంగారు పతకాన్ని కోల్పోయిందని రాహుల్ మెహ్రా పేర్కొన్నారు. అయినప్పటికీ జడ్జ్ తీర్పు తేదీని ప్రకటించలేదని తెలుస్తోంది!