జీవితంలో ఆంధ్రా జట్టుకు ఆడను... విహారీ ఇష్యూ ఏమిటి?
అవును... చాలా రంగాలతో పాటు క్రికెట్ లోనూ రాజకీయ జోక్యం పెరిగిపోయిందంటూ వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలాంటి సంఘటన ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 27 Feb 2024 5:34 AM GMTభారతదేశంలో క్రికెట్ ఆట గురించి, దానికున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమయంలో క్రికెట్ బోర్డుల్లో రాజకీయ నేతల జోక్యంపై కూడా నిత్యం ఏదో ఒక మూల విమర్శలు వినిపిస్తుంటాయి. ఇందులో ఉన్నతమైన బోర్డు, చిన్న బోర్డు అనే తారతమ్యాలేమీ ఉండవు అని కూడా పలువురు సీనియర్లు చెబుతుంటారు! ఈ క్రమంలో తాజాగా స్టార్ క్రికెటర్ హనుమ విహారీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు! ప్రస్తుతం ఇతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
అవును... చాలా రంగాలతో పాటు క్రికెట్ లోనూ రాజకీయ జోక్యం పెరిగిపోయిందంటూ వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలాంటి సంఘటన ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ హనుమ విహారీ ఏపీ క్రికెట్ అసోసియేషన్ లో రాజకీయ నేతల పాత్ర పెరిగిపోయిందన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు క్రీడా రంగంలోనూ తీవ్ర చర్చ నీయాంశం అవుతున్నాయి.
వివరాళ్లోకి వెళ్తే... ఏడేళ్లుగా విహారీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆంధ్రా రంజీ జట్టు ఇటీవల మధ్యప్రదేశ్ చేతిలో కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఒక మ్యాచ్ లో ఏపీ టీం లోని 17వ ఆటగాడిని కెప్టెన్ విహారీ మందలించాడంట. దీంతో అలిగిన ఆ ఆటగాడు ఈ విషయం తన తండ్రికి చెప్పాడంట. ఆయన ఒక కార్పొరేటర్ గా ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ఆయన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కు ఫిర్యాదు చేశారంట.
దీంతో ఈ విషయంపై ఏసీఏ సీరియస్ గా స్పందించడం.. అందులో భాగంగా విహారీని కెప్టెన్ గా తొలగించడం.. ఆ స్థానంలో మరో కెప్టెన్ ను నియమించడం చకచకా జరిగిపోయాయంట. దీంతో ఈ విషయాన్ని, తన ఆవేదనను మధ్యప్రదేశ్ తో మ్యాచ్ ఓటమి అనంతరం విహారీ ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు. రాజకీయ నాయకుల జోక్యం వల్ల తాను కెప్టెన్సీ కోల్పోయినట్లు తెలిపాడు.
ఇందులో భాగంగా... బెంగాళ్ తో జరిగిన మ్యాచ్ లో తానే కెప్టెన్ గా ఉన్నాను అని చెప్పిన విహారీ... అప్పుడు ఆ టీం నిర్ధేశించిన 410 లక్ష్యాన్ని పోరాడి చేదించామని తెలిపాడు. అలా గత సీజన్ లో ఫైనల్ కు చేరిన బెంగాల్ జట్టును తాము మొదటి మ్యాచ్ లోనే ఓడించినా కూడా.. తనను కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిందిగా ఏసీఏ ఆదేశించింది. తన తప్పేమీ లేకపోయినా ఈ శిక్ష పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని పేర్కొన్నాడు. ఇకపై ఆంధ్రా జట్టుకు ఆడబోనని ప్రకటించారు!
మరోపక్క... హనుమ విహారిని కెప్టెన్ గా తొలగించిన అనంతరం.. (ఫిర్యాదు చేసిన వ్యక్తి మినహా) జట్టులోని 15 మంది సభ్యులూ ఏసీఏ పెద్దలకు ఒక లేఖ రాశారు. ఇందులో భాగంగా... విహారినే కెప్టెన్ గా కొనసాగించాలని కోరారు. వారిలో విహారి తర్వాత కెప్టెన్ గా నియమితుడైన రికీభుయ్ కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో... విహారి అభ్యంతరకర పదజాలంతో దూషించినట్టు తమ సహచర సభ్యుడొకరు ఫిర్యాదు చేశారు కానీ... విహారి దురుసుగా దూసుకొచ్చాడన్నది నిజం కాదు అని వారు పేర్కొన్నారు.
కాగా... ఈ సీజన్ లో 13 ఇన్నింగ్స్ ల్లో విహారి 522 పరుగులు చేశారు. రికీభుయ్ తర్వాత జట్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. ఇదే సమయంలో ఆంధ్రా తరఫున అంతర్జాతీయ క్రికెట్ అడిన అతికొద్ది మంది క్రీడాకారుల్లో విహారి కూడా ఒకరు కాగా... భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్ లు ఆడి, 839 పరుగులు చేసిన విహారీ... వెస్టిండీస్ పై సెంచరీ చేశారు!