Begin typing your search above and press return to search.

12 సెకన్లకో బాల్.. 72 సెకన్లలో ఓవర్.. టీమ్ ఇండియా బౌలర్ సెన్సేషన్

జడేజా ఇలా చకచకా ఓవర్ వేయడం జట్టు కెప్టెన్ కు చాలా మేలు చేస్తుంది. స్లో ఓవర్ రేట్ నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఇస్తుంది.

By:  Tupaki Desk   |   9 Feb 2025 3:15 PM GMT
12 సెకన్లకో బాల్.. 72 సెకన్లలో ఓవర్.. టీమ్ ఇండియా బౌలర్ సెన్సేషన్
X

బంతిని చేతిలోకి తీసుకోవడం.. గ్రిప్ పట్టుకోవడం.. బ్యాట్స్ మన్ కు విసరడం.. దీనికి ఎంత సమయం పడుతుంది..? కనీసం అర నిమిషం.. మరికొందరికైతే నిమిషం.. ఇదంతా స్పిన్నర్ విష

యంలో.. మరి పేస్ బౌలర్ కైతే ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది.. కానీ, టీమ్ ఇండియా బౌలర్ ఒకరు 12 సెకన్లకో బంతిని వేశాడు.. 72 సెకన్లలో ఓవర్ ను కంప్లీట్ చేశాడు.. అంటే మనం టీవీ పెట్టి, చానల్ నంబర్ ను ఎంచుకుని క్లిక్ చేసే లోపే బహుశా ఓవర్ ను ముగించేశాడు.

ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఒడిశాలోని కటక్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పైన చెప్పుకొన్న అద్భుతాన్ని సాధ్యం చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 24వ ఓవర్లో బ్యాట్స్ మన్ హ్యారీ బ్రూక్ కు బౌలింగ్ చేశాడు జడేజా. వాస్తవానికి బ్రూక్ విధ్వంసక బ్యాటర్. టెస్టులను వన్డేల్లా, వన్డేలను టి20ల్లా ఆడేవాడు. అలాంటివాడికి జడేజా చకచకా బంతులు వేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఓవర్ పూర్తిచేశాడు. తీరా చూస్తే కేవలం 72 సెకన్లలో ఓవర్ పూర్తయినట్లు తేలింది.

మ్యాచ్ లో జడేజా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్ల కోటాలో 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత బౌలర్లలో అతి తక్కువ పరుగులు ఇచ్చింది అతడే. తన బౌలింగ్ కోటాలో ఇందులో ఒక మెయిడెన్ ఉంది. బ్రూక్ కు 72 సెకన్లలో వేసిన మెయిడెన్ ఇదే కావడం విశేషం.

కాగా, గతంలో టెస్టుల్లోనూ రవీంద్ర జడేజా అతి స్వల్ప వ్యవధిలో ఓవర్ ను పూర్తి చేశాడు. 2021లో టెస్టు మ్యాచ్ లో 64 సెకన్లలో ఓవర్ వేశాడు. ఇది కూడా ఇంగ్లండ్ పైనే కావడం గమనార్హం. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 93 సెకన్లలోనే ఓవర్ పూర్తి చేశాడు.

జడేజా ఇలా చకచకా ఓవర్ వేయడం జట్టు కెప్టెన్ కు చాలా మేలు చేస్తుంది. స్లో ఓవర్ రేట్ నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఇస్తుంది. మరోవైపు బంతికి బంతికి చాలా తక్కువ వ్యవధి ఉండడంతో బ్యాటర్లను గుక్క తిప్పుకోకుండా ఒత్తిడికి గురిచేస్తుంది.

చిత్రం ఏమంటే.. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు జడేజాకు అవకాశం ఉంటుందని ఎవరూ భావించలేదు. శ్రీలంకతో వన్డే సిరీస్ కు జూలైలో జడేజాను ఎంపిక చేయలేదు. అంతకుముందు టి20 ప్రపంచ కప్ విజయం అనంతరం జడేజా ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. మునుపటిలా బంతిని స్పిన్ చేయలేకపోతున్నందుకు.. పైగా తనలాగే బౌలింగ్, బ్యాటింగ్ చేయగల అక్షర్ పటేల్ ఉండడంతో జడేజాను వన్డేలకు ఎంపిక చేస్తారని భావించలేదు. కానీ, చివరకు జడేజా సీనియారిటీని సెలక్టర్లు గుర్తించారు. తొలి వన్డేలోనూ మెరుగ్గా బౌలింగ్ చేశాడు.