టీమ్ ఇండియాలో అతడు.. ఒకే ఒక్కడు.. ఓవరాల్ గా నాలుగో వాడు
ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టక ముందు బుమ్రా టెస్టుల్లో 171 వికెట్లు తీశాడు. ఈ సిరీస్ లో మరో 20 వికెట్లు తీస్తాడులే అనుకుంటే.. ఇప్పటికే 29 పడగొట్టాడు.
By: Tupaki Desk | 30 Dec 2024 12:30 AM GMTటీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో కాస్తయినా పోటీలో నిలిచిందంటే దానికి కారణం ఇద్దరే ఇద్దరు.. ఒకరు తెలుగు కుర్రాడు 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి అయితే.. మరొకరు సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. కెప్టెన్ హోదాలో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన బుమ్రా.. తొలి టెస్టులోనే జట్టును గెలిపించి తన సత్తా చాటాడు. వాస్తవానికి ఒక పేస్ బౌలర్ భారత జట్టుకు నాయకత్వం వహించి దాదాపు 40 ఏళ్లు అవుతోంది. చివరగా దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. మళ్లీ ఆ అవకాశం బుమ్రాకు దక్కింది. అయితే, రెండో టెస్టు నాటికి కెప్టెన్ గా రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో బుమ్రా వైస్ కెప్టెన్సీకి పరిమితం అయ్యాడు.
ఒక్కసారి విఫలం కాలేదు..
5/30 & 3/42, 4/61 & 0/2, 6/76 & 3/18, 4/99 & 4/56.. ఇదీ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు బుమ్రా ప్రదర్శన. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ పూర్తికాకమునుపే మొత్తం 29 వికెట్లు. దీనిని బట్టే బుమ్రా ఎంతటి అసాధారణ బౌలర్ అనేది తెలుస్తోంది. కంగారూ బ్యాటర్లను హడలెత్తిస్తూ.. జట్టు భారాన్ని ఒంటిచేత్తో మోస్తున్నాడు.
200 వికెట్లు తీసేశాడు..
ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టక ముందు బుమ్రా టెస్టుల్లో 171 వికెట్లు తీశాడు. ఈ సిరీస్ లో మరో 20 వికెట్లు తీస్తాడులే అనుకుంటే.. ఇప్పటికే 29 పడగొట్టాడు. దీంతో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు.
మొత్తమ్మీద అతడు నాలుగో పేసర్ కావడం విశేషం. కాగా, బాక్సింగ్ డే టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ కీలక బ్యాట్స్ మన్ ట్రావిస్ హెడ్ ను బుమ్రానే ఔట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో హెడ్ వికెట్ తీశాక 200 వికెట్ మైలురాయిని చేరాడు.
అతి తక్కువ బంతుల్లో..
బుమ్రా ప్రస్తుతం 44వ టెస్టు ఆడుతున్నాడు. 8,484 బంతులు (వైడ్ లు, నో బాస్ కాకుండా) వేసిన అతడు 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 7,725 బంతుల్లో 200 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా పేసర్లు డేల్ స్టెయిన్ (7,848), కగిసో రబాడా (8,153) తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ ల పరంగా ఇటీవల రిటైరైన భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (37 మ్యాచ్ లు) భారత్ తరఫున అత్యంత తక్కువ టెస్టుల్లో 200 వికెట్లు తీశాడు.