అనుకున్నదే అయింది..చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ పేసర్ ఔట్?
ఈ క్రమంలో టీమ్ ఇండియా సర్వసన్నద్ధం అవుతోంది. వన్డేల్లో వేగంగా ఆడే ఇంగ్లండ్ తో ప్రస్తుతం మూడు మ్యాచ్ ల సిరీస్ లో తలపడుతోంది.
By: Tupaki Desk | 11 Feb 2025 12:30 PM GMTప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ ముంగిట టీమ్ ఇండియాకు గట్టి దెబ్బనే తగిలింది. వన్డే ఫార్మాట్ లో ప్రపంచ కప్ తర్వాత అత్యంత కీలకమైన ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచి 11 ఏళ్లుదాటింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్ సొంతగడ్డ పై టోర్నీ జరుగుతోంది. భారత మ్యాచ్ లు దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా సర్వసన్నద్ధం అవుతోంది. వన్డేల్లో వేగంగా ఆడే ఇంగ్లండ్ తో ప్రస్తుతం మూడు మ్యాచ్ ల సిరీస్ లో తలపడుతోంది.
చాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19 నుంచి మొదలుకానుంది. ఆందుకోసం గత నెలలోనే 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. అయితే, మార్పులు-చేర్పులకు మంగళవారం వరకు అవకాశం కల్పించారు. అన్నిటికంటే బిగ్ షాక స్టార్ పేసర్ బుమ్రా టోర్నీకి అందుబాటులో ఉండడం లేదని తేలడం.
బుమ్రా సాధారణ బౌలర్ కాదు.. వైవిధ్యంతో బంతులేసే అతడు బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తిస్తాడు. అలాంటి బౌలర్ కు గాయమైతే అది తీవ్రంగానే ఉంటుంది. రెండేళ్ల కిందట అయిన గాయం ఈ సంగతినే చెప్పింది. ఇక గత నెల మొదట్లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో బుమ్రా గాయంతో తప్పుకొన్నాడు. అప్పుడే అతడు కొన్నాళ్లు క్రికెట్ కు దూరం అయినట్లేనని ప్రమాద సంకేతాలు వచ్చాయి. ఇప్పుడవి నిజమయ్యాయి.
ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ వన్డే ఫార్మాట్ లో జరగనుంది. వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్న బుమ్రా అందుబాటులో ఉంటాడా? లేదా అనేదానిపై బీసీసీఐ మంగళవారం నిర్ణయం ప్రకటించనుంది.
బుధవారం అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్ తో మూడో వన్డేలో బుమ్రాను ఆడిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కే పరిమితం అయ్యాడు. దీంతో ఫిట్ నెస్ పై సందేహాలు వస్తున్నాయి. బుమ్రా అందుబాటులో లేకుంటే అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను తీసుకునే చాన్సుంది.
రెండో వన్డేలో అరంగేట్రం చేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తినీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తారని అంటున్నారు. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్‌లో వరుణ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కావడం గమనార్హం. మరి ఇతడి కోసం కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరిని పక్కనపెట్టాలి. కుల్దీప్ మణికట్టు స్పిన్నర్ కాబట్టి ఇతడినే కొనసాగించొచ్చు. మంగళవారం తర్వాత కూడా ఐసీసీ సాంకేతిక కమిటీ అనుమతితో జట్టులో మార్పులకు వీలుంది. కాబట్టి బుమ్రా, సుందర్ లను ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా కొనసాగిస్తారేమో?